January 10, 2025

26-12-2024 Daily Current Affairs| Daily Short News Telugu-IARI డైరెక్టర్ గా తెలుగు వ్యక్తి

0
26-12-2024 Daily Current Affairs in Telugu

26-12-2024 Daily Current Affairs in Telugu

26-12-2024 Daily Current Affairs| Daily Short News Telugu|IARI డైరక్టర్ గా తొలి తెలుగు వ్యక్తి

IARI డైరక్టర్ గా తొలి తెలుగు వ్యక్తి 

భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI, Delhi) డైరెక్టర్ గా ప్రముఖ శాస్త్రవేత్త  శ్రీ చెరకుపల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆయన స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట దగ్గరలో ఉన్న అనిగండ్ల పాడు గ్రామం. IARI కు డైరక్టర్ గా ఎంపికైన మొట్టమొదటి తెలుగు వ్యక్తి శ్రీ చెరుకుపల్లి శ్రీనివాసరావు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో గల  NAARM (జాతీయ వ్యవసాయ పరిశోధనా, విస్తరణ యాజమాన్య అకాడమీ) కి గత ఎనిమిది సంవత్సరాలుగా డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు.(26-12-2024 Daily Current Affairs)

బాపట్ల వ్యవసాయ కళాశాలలో 1982 – 86 బ్యాచ్ లో అగ్రికల్చర్ బిఎస్సీ చదివారు. 1986 – 88 వరకూ వ్యవసాయ శాస్త్రం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. ఆ తర్వాత IARI , ఢిల్లీ లో పీ హెచ్ డీ పూర్తి చేసి సైంటిస్ట్ గా ఉద్యోగం లో చేరారు. ముప్పై ఏళ్లకు పైగా భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ లో వివిధ పదవులు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి లో భూ విజ్ఞాన శాస్త్రవేత్త గా ప్రఖ్యాతి పొందారు. దాదాపు మూడు వందలకు పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు.  భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ పూర్వ విద్యార్ధి అయిన శ్రీ శ్రీనివాసరావు గారు అదే సంస్థకు అధిపతి గా ఎంపిక కావడం విశేషం.

అగ్రి బిజినెస్ మేనేజ్ మెంట్ లో ఎం బీ ఏ కోర్సును ప్రవేశ పెట్టిన ఘనత ఈయనదే. అనేక అవార్డులు గెలుచుకున్నారు.  రాష్ట్రపతి అవార్డు, ప్రధాన మంత్రి నుండి 2015 లో ప్రత్యేకమైన అవార్డు పొందారు. ఎఫ్ సి ఐ, రైతు పురస్కారాలు, యంగ్ సైంటిస్ట్ అవార్డు, ఇంటర్నేషనల్ పొటాష్ ఇనిస్టిట్యూట్ అవార్డు వంటి  అనేక అవార్డులను  ఆయన అందుకున్నారు.

తెలంగాణా గ్రామీణ బ్యాంక్ లో ఎపీజీవీబీ శాఖలు విలీనం.(26-12-2024 Daily Current Affairs)

ఒక రాష్ట్రం – ఒక గ్రామీణ బ్యాంకు నినాదం తో కేంద్ర ప్రభుత్వం దేశం లోని గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగం గా తెలంగాణా రాష్ట్రం లో ఇప్పటివరకూ ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (APGVB) శాఖలను తెలంగాణా గ్రామీణ బ్యాంకు (TGB) లో విలీనం చేయనున్నారు.

తెలంగాణా రాష్ట్రం లో ఇప్పటివరకూ 493 APGVB శాఖలు ఉన్నాయి. అలాగే తెలంగాణా గ్రామీణ బ్యాంకు కు సంబంధించి 435 శాఖలు ఉన్నాయి. ఒక రాష్ట్రం లో ఒకే గ్రామీణ బ్యాంకు ఉండాలనే ఉద్దేశ్యం తో APGVB శాఖలను TGB లో విలీనం చేస్తారు. జనవరి 1, 2025 లోపు ఈ విలీన ప్రక్రియ పూర్తి అవుతుంది. జనవరి 1 నుండి తెలంగాణా లో APGVB శాఖలు కనబడవు.

APGVB శాఖల విలీనం తో తెలంగాణా గ్రామీణ బ్యాంకు యొక్క శాఖల సంఖ్య 928 కి చేరుతుంది. ఇంతకు ముందు 435 శాఖలు కలిగి ఉన్న TGB ముప్పై వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉండేది. APGVB కి చెందిన 493 శాఖల విలీనం తో ప్రస్తుతం ఈ వ్యాపారం 70,000 కోట్ల కు చేరుతుంది. ఈ వివరాలను తెలంగాణా గ్రామీణ బ్యాంకు చైర్మన్ వై. శోభ పత్రికలకు తెలియజేసారు.

జెస్సీ రాజ్ కు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ – 2025 అవార్డు 

స్కేటింగ్ క్రీడ లో అసాధారణ ప్రతిభ చూపినందుకు గాను గుంటూరు జిల్లా మంగళ గిరి కి చెందిన క్రీడాకారిణి జెస్సీ రాజ్ ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జెస్సీ రాజ్ ‘ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ – 2025 అవార్డు‘ అందుకున్నారు. స్కేటింగ్ క్రీడ లో విశేషం గా రాణిస్తున్న 14 ఏళ్ళ జెస్సీ రాజ్ అనేక అంతర్జాతీయ పతకాలు అందుకున్నారు. వరల్డ్ స్కేట్ ఒస్నియా ఆర్టిస్టిక్ చాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం కూడా అందుకున్నారు. జెస్సీ రాజ్ గుంటూరు జిల్లా మంగళగిరి కి చెందిన వారు.

ఎత్తైన ప్రాంతం లో ప్రయాణించిన కారుగా హ్యుండాయ్ గిన్నిస్ రికార్డు 

ప్రముఖ కార్ల కంపెనీ హ్యుండాయ్ కి చెందిన ఎలెక్ట్రిక్ కారు ‘అయానిక్-5‘ అరుదైన రికార్డు సృష్టించింది. లద్దాఖ్ లోని ఉమ్లింగ్ పాస్ 5802 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ నుండి కేరళ లోని కుట్టనాడ్ (ఎత్తు 5800 మీటర్లు) కు కేవలం 14 రోజులలోనే ప్రయాణించి ఈ రికార్డు సృష్టించింది. 4900 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 14 రోజులలో చేరుకున్న ఎలెక్ట్రిక్ కారుగా ‘అయానిక్-5’ నిలిచింది. దీనితో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.

యువభారత్ సమీకృత గురుకుల పాఠశాలలు నిర్మాణానికి సినీ పరిశ్రమ సెస్(26-12-2024 Daily Current Affairs)

యువభారత్ సమీకృత గురుకుల పాఠశాలలను తెలంగాణా ప్రభుత్వం ప్రస్తుతం నిర్మిస్తోంది. 119 నియోజక వర్గాల్లో ఈ గురుకుల పాఠశాలలు నిర్మిస్తున్నారు. ఒక్కొక్క పాఠశాలకు 25 కోట్ల రూపాయల వరకూ ఖర్చు అవుతోంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణా సినీ ప్రముఖులతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశ మయ్యారు. ఈ సందర్భం గా ఈ గురుకుల పాఠశాలల నిర్మాణానికి సినీ పరిశ్రమ సహకరించ వలసినది గా ఆయన కోరారు. సినిమా టికెట్ల పై సెస్ (పన్ను) విధించడం ద్వారా కొంత ఆర్దిక వనరులను సినీ పరిశ్రమ నుండి పొందాలని అనుకొంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తో పాటు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా పాల్గొన్నారు

ఫార్మాస్యూటికల్స్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కొత్త చైర్మన్ – నమిత్ జోషీ 

ఫార్మాస్యూటికల్స్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఫార్మాక్సిల్) కొత్త చైర్మన్ గా శ్రీ నమిత్ జోషీ నియమితులయ్యారు. ప్రపంచ ఔషధ మార్కెట్ లో భారత దేశ స్థానాన్ని సుస్థిరం చేస్తారనే ఉద్దేశ్యం తోనే నమిత్ జోషీ ని కొత్త చైర్మన్ గా నియమించినట్లు ఫార్మాక్సిల్ తెలిపింది. ఫార్మాక్సిల్ 20 వ వార్షిక సర్వ సభ్య సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫార్మాస్యూటికల్స్ రంగం లో ముప్పై ఏళ్లకు పైగా అనుభవం కలిగిన నమిత్ జోషీ ఉత్తర ప్రదేశ్ కు చెందిన బరేలీ కి చెందిన వారు. 26-12-2024 Daily Current Affairs

జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి విలువ 

డాలరుతో పోల్చినపుడు రూపాయి విలువ జీవిత కాల కనిష్టానికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్ లో ట్రేడింగ్ మొదలైనప్పుడు రూపాయి విలువ 85.23 రూపాయలు గా ఉంది. చివరకు 85.27 రూపాయలకు చేరుకొని సరిక్రొత్త పతనానికి గురైంది. డాలరు తో పోల్చినపుడు జీవిత కాల కనిష్టానికి ఈ రేటు వద్ద నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారక విలువ 85 రూపాయల 27 పైసలు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *