After 10th Agricultural Diploma Courses | పదవ తరగతి తర్వాత అగ్రి డిప్లొమా కోర్సులు
వ్యవసాయ రంగం అంటేనే అనేక ఉద్యోగావకాశాలు ఉంటాయి. మనిషికి ఆకలి ఉన్నంత వరకు వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం ఉన్నంత వరకు వ్యవసాయ ఉద్యోగావకాశాలు ఉంటాయి. ప్రపంచం లో ఏ రంగం మూతపడినా గాని మూత పడని ఒకే ఒక రంగం వ్యవసాయ రంగం. కాబట్టి నిరభ్యంతరం గా ఈ కోర్సులు చదవవచ్చు.
After 10th Agricultural Diploma Courses | పదవ తరగతి తర్వాత అగ్రి డిప్లొమా కోర్సులు
పదవ తరగతి పరీక్షలు పూర్తి అయిన తర్వాత నుండి ఒకటే టెన్షన్ ఉంటుంది తల్లి దండ్రులకి. టెన్త్ తర్వాత ఏం చదివించాలా అని. ఎందుకంటే పదవ తరగతి తర్వాత జాయిన్ అయ్యే కోర్సు తరువాత జీవితాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి. అందుకే విద్యార్దులకీ అంతకు మించి తల్లిదండ్రులకీ ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి ఉంటుంది. నిజానికి పది చదివిన తర్వాత చాలా మార్గాలు ఉన్నాయి. అయితే అగ్రికల్చర్ వైపు వెళ్ళాలి అనుకొనే వారు ఎటువంటి కోర్సులు చదవాలి ? పదవ తరగతి తర్వాత అగ్రికల్చర్ కోర్సులు చదవ వచ్చా వంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఈ వ్యాసం లో మీకు అందించడమే మా ప్రధాన ఉద్దేశ్యం. (After 10th Agricultural Diploma Courses)
టెన్త్ పాస్ అయిన తర్వాత ఎటువంటి కోర్సులు ఉంటాయి?
పదవ తరగతి పాస్ అయిన వెంటనే అందరూ జాయిన్ అయ్యేది ఇంటర్ మీడియట్ లో. ఇంజనీరింగ్ కోర్సులు చదవాలి అనుకొనే వారు ఎం.పీ.సి (MPC) లో జాయిన్ అవుతారు. మెడిసిన్, వెటర్నరీ, అగ్రికల్చర్ కోర్సులు చదవాలి అనుకొనే వారు బై.పీ.సి (Bi.P.C) లో జాయిన్ అవుతారు. ఎకనామిక్స్, సివిక్స్ వంటి కోర్సులు చదవాలి అనుకొనే వారు CEC, HEC వంటి గ్రూపులలో జాయిన్ అవుతారు. ఇవే కాకుండా ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు చదవాలి అనుకొనే వారు ఈ సెట్ (ECET) ప్రవేశ పరీక్ష రాయడం ద్వారా డిప్లొమా లో ప్రవేశం పొందుతారు. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల మాదిరిగానే అగ్రికల్చర్ లో డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయి.
అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులలో ఎలా జాయిన్ కావాలి?
పదవ తరగతి పాస్ అయిన విద్యార్దులు ఎవరైనా అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులలో చేరవచ్చు. ఈ కోర్సులను ఆంధ్రప్రదేశ్ లో ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం (ANGRAU) వారు ఆఫర్ చేస్తున్నారు. తెలంగాణా లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం (PJTSAU) వారు ఆఫర్ చేస్తున్నారు. ఈ కోర్సులలో చేరడానికి ఎటువంటి ప్రవేశ పరీక్ష రాయనవసరం లేదు. పదవ తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత అగ్రి యూనివర్సిటీ వారు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి అప్లయి చేసుకోవలసి ఉంటుంది. ఈ విధం గా అప్లయి చేసుకున్న వారికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తారు. గత కొద్ది సంవత్సరాలు గా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ లేకపోతే నేరుగా యూనివర్సిటీ కి కౌన్సిలింగ్ కి పిలుస్తారు. (After 10th Agricultural Diploma Courses)
అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు చదవడానికి అర్హతలు ఏమిటి?
వ్యవసాయ డిప్లొమా కోర్సులు చదవడానికి ప్రధాన అర్హత పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే ఇంటర్ పాస్ అయిన విద్యార్దులకు మాత్రం ఈ కోర్సులో ప్రవేశం లేదు. ఇంటర్ ఫెయిల్ అయిన వారు మాత్రం అర్హులు. పదవ తరగతి పాస్ అయినవారు అర్హులు. అలాగే ఇంటర్ ఫెయిల్ అయినవారు కూడా అర్హులే.
గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం అని ఏమైనా తేడా ఉంటుందా?
ఇవి వ్యవసాయ సంబంధమైన కోర్సులు కాబట్టి గ్రామీణ ప్రాంతం లో చదివిన వారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. దాదాపు 75% వరకు గ్రామీణ ప్రాంతం లో చదివిన విద్యార్ధులకు అవకాశం ఇస్తారు. పట్టణ ప్రాంతాలలో అంటే మునిసిపల్ ఏరియా లో చదివిన వారు కూడా అర్హులే. అయితే 25% సీట్లు మాత్రమే వీరికి కేటాయించబడతాయి.
కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది?(After 10th Agricultural Diploma Courses)
మీకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని కౌన్సిలింగ్ కి వెళ్ళాలి. ఒకవేళ వెబ్ కౌన్సిలింగ్ జరిగినట్లు అయితే మీకు కేటాయించిన కాలేజీ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ల తో వెళ్లి జాయిన్ కావలసి ఉంటుంది. ఫీజు కూడా కాలేజ్ లోనే చెల్లించాలి. అదే మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే కౌన్సిలింగ్ లోనే ఫీజు చెల్లించవలసి ఉంటుంది. సీట్ల ఎంపిక అంతా మెరిట్ పధ్ధతి లో జరుగుతుంది. టెన్త్ లో వచ్చిన గ్రేడ్ పాయింట్ ఆధారం గా సెలక్షన్ చేస్తారు. మంచి గ్రేడ్ పాయింట్ వచ్చిన వారికి గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వస్తుంది. ప్రభుత్వ సీట్లు నిండి పోయిన తర్వాత ప్రైవేట్ కాలేజీలలో సీట్లు భర్తీ చేస్తారు. ఏదైనా ప్రైవేటు కాలేజీ లోనే చేరాలి అనుకుంటే అక్కడ సీట్ కేటాయిస్తారు. పదవ తరగతి లో వచ్చిన గ్రేడ్ పాయింట్ ను బట్టి కాలేజీ ఎంపిక ప్రక్రియ ఆధార పడి ఉంటుంది.
ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలలో ఏవి మంచివి ?
రెండూ మంచి ఎంపిక లే. మంచి గ్రేడ్ పాయింట్ వచ్చిన వారు ముందుగా ప్రభుత్వ కళాశాల ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వ కళాశాల లో ప్రైవేటు కాలేజీ లో కంటే ఫీజులు తక్కువ గా ఉంటాయి. అంతే కాకుండా ప్రభుత్వ కాలేజీలు అన్నీ ఏదో ఒక వ్యవసాయ పరిశోధనా స్థానానికి అనుబంధం గా ఉంటాయి. శాస్త్రవేత్తల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ప్రభుత్వ కళాశాలలలో అధ్యాపకుల కొరత ఉండదు. తరగతులు, ప్రాక్టికల్స్ అన్నీ పధ్ధతి ప్రకారం జరుగుతాయి. వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో జరిగే అనేక పరిశోధనలు, పొలాల్లో ప్రాక్టికల్ తరగతులలో భాగం గా పంటల సాగు చేయడం వలన విద్యార్దులకు పూర్తి అవగాహన వస్తుంది. ఈ కారణాలతో తల్లిదండ్రులు, విద్యార్దులు ప్రభుత్వ కాలేజీలను ఎంపిక చేసుకుంటారు. అందుకే గ్రేడ్ పాయింట్ వచ్చిన వారు తమకు దగ్గరలో ఉండే ప్రభుత్వ కాలేజీ లో సీటు కోసం ప్రయత్నిస్తారు.
ప్రైవేటు కాలేజీలు మంచివి కాదా..?(After 10th Agricultural Diploma Courses)
ప్రభుత్వం ఆద్వర్యం లో అఫిలియేటెడ్ గా ఉన్న మంచి యాజమాన్యం ఉన్న ప్రైవేటు కాలేజీలు తెలుగు రాష్ట్రాలలో చాలా ఉన్నాయి. ఈ కాలేజీ లలో ప్రభుత్వ కాలేజీలలో ఉన్న వసతులకంటే మెరుగైన వసతులు ఉంటాయి. ఆధునిక టెక్నాలజీ తో కూడిన తరగతి గదులు, ప్రయోగ కార్యక్రమాలు చేసుకోవడానికి కాలేజీ దగ్గరలోనే సరిపడినంత పొలం, విద్యార్ధులకు విజ్ఞాన, విహార యాత్రలు ఏర్పాటు చేయడం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. తగినంత సిబ్బంది అందుబాటు లో ఉంటారు. తగినంత మంది అర్హులైన అధ్యాపకులు ఎప్పుడూ వారికి వెనుక ఉండి నడిపిస్తూ ఉంటారు.
అయితే అన్ని ప్రైవేటు కాలేజీలలో ఇటువంటి పరిస్థితులు లేవు. చాలా ప్రైవేటు కాలేజీలలో తరగతి గదులు సరిగ్గా లేవు. సరిపడినంత మంది అధ్యాపకులు లేరు. ప్రాక్టికల్స్ చేసుకోవడానికి సరైన వసతులు లేవు. ఇటువంటి కాలేజీలను ఈ మధ్య యూనివర్సిటీ వారు గుర్తించి వాటి యొక్క అనుమతులను రద్దు చేసారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రైవేటు కాలేజీలలో వసతులు బాగానే ఉంటాయి.
నకిలీ ప్రైవేటు కాలేజీలు కూడా ఉన్నాయి జాగ్రత్త
ప్రభుత్వ ఎఫిలియేటెడ్ గా నడిచే ప్రైవేటు కాలేజీలలోనే చేరాలి. ఏ యూనివర్సిటీ కి సంబంధం లేకుండా కొందరు నకిలీ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలలో విద్యార్దులను జాయిన్ చేసుకొని వారి జీవితాలు నాశనం చేస్తున్నారు. ఆచార్య ఎన్.జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా అగ్రి యూనివర్సిటీ వారికి అనుబంధం గా ఉండే ప్రైవేటు కాలేజీలలో మాత్రమే చేరండి. ఇతర పేరు ఊరు లేని నకిలీ ప్రైవేటు కాలేజీలలో చేరవద్దు. పైన చెప్పిన వ్యవసాయ విశ్వ విద్యాలయాలు కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే విద్యార్దులను జాయిన్ చేసుకుంటాయి. ఎటువంటి కౌన్సిలింగ్ లేకుండా జాయిన్ చేసుకొనే కాలేజీలలో చేరకూడదు. (After 10th Agricultural Diploma Courses)
వ్యవసాయ డిప్లొమా కోర్సులలో చేరితే భవిష్యత్తు ఎలా ఉంటుంది?
టెన్త్ తర్వాత చదివే కోర్సు ఇది. అంటే ఇంటర్ మీడియట్ వలె రెండు సంవత్సరాలు ఉంటుంది. వ్యవసాయ డిప్లొమా కోర్సు పూర్తిగా ప్రొఫెషనల్ కోర్సు. ఈ కోర్సు చదివిన వారికి ఉద్యోగ (ప్రభుత్వ మరియు ప్రైవేటు) అర్హత ఉంటుంది. అదే ఇంటర్ చదివిన వారికి ఉద్యోగ అర్హత ఉండదు. అందుచేత ఇంటర్ కు బదులు గా ఈ వ్యవసాయ డిప్లొమా కోర్సులు చదువుతారు. రెండేళ్ళ వ్యవసాయ డిప్లొమా కోర్సు చదివిన వారు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు. అలాగే ఈ వ్యవసాయ డిప్లొమా పూర్తి చేసినవారు అగ్రికల్చర్ బిఎస్సీ చదవడానికి కూడా అర్హులు. అగ్రిసెట్ అనే ప్రవేశ పరీక్ష రాయడం ద్వారా బిఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ లో సీటు సంపాదించవచ్చు.
ఇంటర్ మరియు వ్యవసాయ డిప్లొమా కోర్సులు సమానమేనా?
వ్యవసాయ డిప్లొమా కోర్సులు, ఇంటర్ మీడియట్ సమానం కాదు. చాలా మంది ఈ కోర్సులు ఇంటర్ తో సమానం అనుకుంటారు. డిప్లొమా కోర్సులు ఎప్పుడూ ఇంటర్ బోర్డు నిర్వహించే ఇంటర్ కోర్సుకు టెక్నికల్ గా సమానం కాదు. ఐకార్ నిర్వహించే ప్రవేశ పరీక్షలకు వ్యవసాయ డిప్లొమా వారికి అనుమతి లేదు. ఇంటర్ బై.పీ.సి చదివిన వారు మాత్రం అర్హులు.
రెండేళ్ళ వ్యవసాయ డిప్లొమా చదివిన వారు అగ్రిసెట్ అనే ప్రవేశ పరీక్ష రాసి బిఎస్సీ అగ్రికల్చర్ లో ప్రవేశం పొందవచ్చు. ఒకవేళ అక్కడ సీట్ రాకపోతే సాధారణం గా అందరూ చదివే BA, BCom, BSc, BBM వంటి కోర్సులు చదువుకోవడానికి అనుమతి ఉంది. కాబట్టి వ్యవసాయ డిప్లొమా కోర్సులు నిరభ్యంతరం గా చదవవచ్చు. ఈ రెండేళ్లు డిప్లొమా చదవడం తోనే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు అర్హులు అవుతారు. పై చదువులు చదవడం కుదరనప్పుడు డిప్లొమా సర్టిఫికేట్ తో వ్యవసాయ రంగం లో ఏదైనా ఉద్యోగం సంపాదించు కోవచ్చు. ఇంటర్ చదివిన వారికి ఈ అవకాశం లేదు.( After 10th Agricultural Diploma Courses)
ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?(After 10th Agricultural Diploma Courses)
ప్రభుత్వ రంగం లో కంటే ప్రైవేటు రంగం లో ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ డిప్లొమా చదివిన వారిని వ్యవసాయ సహాయకులు (VAA – Village Agriculture Assistant) గా నియమించారు. ఇరవై ఏళ్ల వయసు కూడా నిండకుండానే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక అయి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. AEO Agricultural Extension Officer గా కూడా వీరికి అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ యూనివర్సిటీ లో కూడా ఉద్యోగాలు ఉండొచ్చు. ప్రైవేటు రంగం లో అయితే అనేక వ్యవసాయాధారిత పరిశ్రమలలో వీరికి ఉద్యోగావకాశాలు ఉంటాయి.
ఇంటర్ కాకుండా అగ్రి డిప్లొమా లో జాయిన్ కావడం మంచిదేనా..?
మంచిదే. అయితే ముందుగానే అన్నీ ఆలోచించు కోవాలి. రెండేళ్ళ కోర్సు చదివిన తర్వాత స్టడీస్ కొనసాగించాలా లేదా జాబ్ చేసుకోవాలా అని ముందుగానే నిర్ణయించు కోవాలి. బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలి అని టార్గెట్ ఉంటే డిప్లొమా మొదటి సంవత్సరం నుండే కష్టపడి చదవాలి. అగ్రిసెట్ పరీక్ష రాయడం ద్వారా బిఎస్సీ అగ్రికల్చర్ లో సీటు సంపాదించు కోవడం అంత కష్టం కాదు. బిఎస్సీ అగ్రికల్చర్ కాదు అనుకొంటే సాధారణ డిగ్రీ (BSc, BCom, BA)వంటి డిగ్రీ కోర్సులు కూడా చదువు కోవచ్చు.
జాబ్ కోసమే ఈ డిప్లొమా కోర్సు చదివితే మాత్రం అనేక అవకాశాలు ఉంటాయి. వాటిని ఒడిసి పట్టుకోవాలి. ప్రైవేటు రంగం లో ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగావకాశాలు ఏమి ఉంటాయి అనేది చాలా వివరం గా ఈ వెబ్ సైట్ లోనే పొందు పరచడం జరిగింది. ఆ వ్యాసాలను చదివితే పూర్తి వివరాలు తెలుస్తాయి. దానిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.(After 10th Agricultural Diploma Courses)
ఈ కోర్సులకు ఇప్పుడు డిమాండ్ లేదు అంటున్నారు..?
ఈ కోర్సుల విలువ తెలియని వారు అలా చెప్తున్నారు. చెడు ప్రచారం చేస్తున్నారు. ఏ కోర్సులకూ చదవగానే గవర్నమెంటు పిలిచి ఉద్యోగం ఇవ్వదు. వ్యవసాయ రంగం అంటేనే అనేక ఉద్యోగావకాశాలు ఉంటాయి. మనిషికి ఆకలి ఉన్నంత వరకు వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం ఉన్నంత వరకు వ్యవసాయ ఉద్యోగావకాశాలు ఉంటాయి. ప్రపంచం లో ఏ రంగం మూతపడినా గాని మూత పడని ఒకే ఒక రంగం వ్యవసాయ రంగం. కాబట్టి నిరభ్యంతరం గా ఈ కోర్సులు చదవవచ్చు. నిరాశావాదుల అభిప్రాయాలు కాకుండా ఈ రంగం లో అనుభవజ్ఞుల అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది.
– Vijay Kumar Bomidi, Director, Vijay Kumar Agri Academy, Salur, Vizianagaram
(ఈ వ్యాసకర్త వ్యవసాయ డిప్లొమా కోర్సులను గత 14 సంవత్సరాలు గా బోధిస్తున్న అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి అగ్రి డిప్లొమా కోర్సుల గురించి ఏవైనా సందేహాలు ఉంటే మొబైల్ నంబర్ (8125443163)కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయగలరు)