January 10, 2025

Agri Jobs for Agri Diploma holders in private sector

agri diploma students

Agri students training program in Nursery management

ప్రైవేటు రంగం లో వ్యవసాయ డిప్లొమా చేసిన వారికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు…. అయితే చాలా ఓపికగా వాటికోసం ప్రయత్నించవలసి ఉంటుంది… agri jobs for agri diploma holders in private sector

agri diploma students

వ్యవసాయ డిప్లొమా పూర్తి చేసిన వారికి గల ప్రైవేటు ఉద్యోగావకాశాలు:

ప్రైవేటు రంగం లో వ్యవసాయ డిప్లొమా చేసిన వారికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు…. అయితే చాలా ఓపికగా వాటికోసం ప్రయత్నించవలసి ఉంటుంది… ఆవేశం ఎక్కువగా ఉండి ఆలోచన తక్కువ గా ఉండే వయసులో … ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రావడం లేదు అని తీవ్రమైన నిరాశ నిస్పృహ లకు గురి అవుతుంటారు… కాని ప్రైవేటు రంగం లో సరైన ఉద్యోగం కావాలంటే మాత్రం ప్రధానం గా పట్టుదల, ఓపిక ఉండి తీరవలసిందే…. ప్రైవేటు రంగం లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయో ఇక్కడ నేను కొద్దిగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను….

ప్రైవేటు రంగం లో ఉద్యోగాలు ఎక్కడ అందుబాటులో ఉంటాయంటే….

1. వివిధ పురుగు మందుల కంపెనీలు: 
ఇప్పుడు ఈ కంపెనీలలో ఎక్కువగా డిప్లొమా చదివిన వారికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి.. ప్రైవేటు కంపెనీలు కష్టపడి పనిచేసే వారికోసం చూస్తున్నాయి… ఏదైనా పురుగు మందుల కంపెనీలో చేరిన తర్వాత కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. మీరు అంటే ఏంటో కంపెనీ వారికి తెలియచేయాలి.. అప్పుడు తప్పకుండా కంపెనీ మీ ప్రతిభను గుర్తిస్తుంది. దానిని బట్టే మీకు ఇచ్చే జీతం కూడా ఆధారపడి ఉంటుంది.. ఈ కంపెనీలలో ప్రధానం గా మార్కెటింగ్ లోకి డిప్లొమా వారిని తీసుకుంటున్నారు.. వివిధ కొత్త పురుగుమందులను రైతులకు పరిచయం చెయ్యడం, ఆ విధంగా వాటి యొక్క సేల్స్ పెంచడం వంటి పనులు వీరికి ఉంటాయి…ఇంకా ఈ కంపెనీలలో ఇతర స్థాయిలలోనికి కూడా తీసుకుంటున్నారు…ఓపికగా పనిచేస్తే పదోన్నతులు ఉంటాయి..

agri diploma students
Agri diploma student spraying chemicals in fields

2. ఎరువుల డీలర్లు- గ్రోమోర్ షాపులు- కిసాన్ సేవా కేంద్రాలు:
డిప్లొమా వారికి ఎక్కువ అవకాశాలు ఉన్న రంగాలు ఇవి…. ఇటువంటి చోట్ల కూడా కష్టపడి పనిచేసిన వారికి మంచి అవకాశాలు ఉంటాయి… ఇప్పుడు ప్రతి చిన్న పట్టణం లో కూడా కిసాన్ సేవాకేంద్రాలు, గ్రోమోర్ షాపులు ఏర్పాటు చేస్తున్నారు… వీటిలో పనిచెయ్యడానికి డిప్లొమా చదివిన వారినే తీసుకొంటున్నారు…. కాబట్టి ఆయా సంస్థలలో ప్రయత్నించవచ్చు….

3. పేపర్ మిల్స్ లో:
ముఖ్యం గా జే.కే పేపర్ మిల్స్ వంటి పరిశ్రమలలో డిప్లొమా చదివిన వారి అవసరత ఎంతైనా ఉంది…. యూకలిప్టస్ ప్లాంటేషన్ చూసుకోవడానికి వీరిని ఫీల్డ్ అసిస్టెంట్ లు గా నియమిస్తున్నారు.. కాబట్టి మీకు దగ్గరలో ఇటువంటి పేపర్ మిల్స్ ఏవైనా ఉంటే వెంటనే వారికి మీ బయోడేటా ఇవ్వండి.. తప్పకుండా అవకాశం ఇస్తారు…

4. షుగర్ ఫాక్టరీ లలో:
తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని షుగర్ ఫాక్టరీ లలో వ్యవసాయ డిప్లొమా చదివిన వారి అవసరం ఉంది.. కొన్ని షుగర్ ఫాక్టరీ లు సేంద్రియ పద్ధతిలో చెరకు పెంపకం వంటి వినూత్న పద్ధతులలో చెరకును పండిస్తున్నాయి… అందుచేత ప్రతి షుగర్ ఫాక్టరీ లోనూ వీరి అవసరత ఉంటుంది కాబట్టి బయోడేటా వారికి తీసుకువెళ్ళి వారితో మాట్లాడితే తప్పకుండా అవకాశం ఇస్తారు… ఈ షుగర్ ఫాక్టరీ లలో మాత్రం డిప్లొమా చదివిన వారికి తప్పకుండా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది..

5. ఆయిల్ పాం కంపెనీలలో:
ఆయిల్ పాం పండిస్తున్న కంపెనీలలో డిప్లొమా చేసిన వారి అవసరత ఉంది.. కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు… కాబట్టి ఆయిల్ పాం కంపెనీలలో ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం దొరకవచ్చు…

agri diploma students
Agri diploma students sowing seeds

6. సేంద్రియ వ్యవసాయం చేయబడుతున్న క్షేత్రాలలో:
ప్రస్తుతం అనేక మంది సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి చూపిస్తునారు… అనేక ఏళ్ళు విదేశాలలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు గా చదివిన వాళ్ళు ఉద్యోగాలకు రాజీనామా చేసి మారుమూల ప్రాంతాలలో పొలాలు కొనుక్కొని చాలా ఆసక్తిగా సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.. ఈ సేంద్రియ క్షేత్రాలలో డిప్లొమా చదివిన వారినే ఉద్యోగులు గా నియమించుకొంటున్నారు…. అత్యంత ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేస్తున్నారు… డ్రోన్ లు ఉపయోగించి కూడా కొన్ని చోట్ల ఈ వ్యవసాయం జరుగుతోంది… కాబట్టి మీ చుట్టుప్రక్కల ఉండే ప్రాంతాలలో ఇటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఉంటే వెంటనే వారిని సంప్రదించండి.. మీకు ఉన్న ఆసక్తిని బట్టి మంచి జీతాలు కూడా ఇస్తారు… ఆధునిక టెక్నాలజీ ల పట్ల శిక్షణ కూడా ఇస్తారు…

7. కాల్ సెంటర్ లలో:
చాలా మంది వ్యవసాయ పాలిటెక్నిక్ వారికి తెలియని రంగం ఇది.. కాల్ సెంటర్ల లో వ్యవసాయ డిప్లొమా వారికి ఉద్యోగాలు ఉంటాయన్న విషయం చాలా మందికి తెలియదు… అవును… ఇప్పుడు అన్ని ప్రధాన పురుగు మందుల కంపెనీలు, ఇతర సూక్ష్మ పోషకాల కంపెనీలు ఇప్పుడు స్వయం గా కాల్ సెంటర్ల ను నిర్వహిస్తున్నాయి.. ఈ కాల్ సెంటర్ల లో చేరిన వారు రైతులకు ఫోన్ చేసి వారి వివరాలు రికార్డు చేస్తారు… వారికి వ్యవసాయం లో గల సమస్యలను కనుక్కొని నిపుణులతో పరిష్కారాలు తెలియజేస్తారు… ఈ ఉద్యోగాలు అమ్మాయిలకు చాలా మంచివి…. ఫీల్డు లో కాకుండా కాల్ సెంటర్ లో కూర్చొని చేసే ఉద్యోగాలు కావడం వలన దివ్యాంగులకు ఈ ఉద్యోగాలు సరైనవి… ఒక పెద్ద కంపెనీ లో పనిచేస్తున్న సూర్యం అనే నా మిత్రుడు మా పాలిటెక్నిక్ లో చదివిన అనేక మందికి  విశాఖపట్నం లోని కాన్ సెంట్రిక్స్ అనే కాల్ సెంటర్ లో ఉద్యోగాలు ఇప్పించారు… ఇప్పటికీ అనేక మంది అక్కడ ఉద్యోగాలు చేసుకొంటున్నారు… కాబట్టి ఇటువంటి కాల్ సెంటర్ లలో కూడా ప్రయత్నం చెయ్యండి… ఉద్యోగం దొరుకుతుంది…

8. గ్రీన్ హౌసులు, జీడి పరిశ్రమలలో,మరియు వ్యవసాయ సంబంధ పరిశ్రమలలో:
అనేక వ్యవసాయ సంబంధ పరిశ్రమ లలో డిప్లొమా చదివిన వారి అవసరం ఉంది. కాబట్టి ఆయా పరిశ్రమల వారిని సంప్రదిస్తే తప్పక ఫలితం ఉంటుంది..

9. విత్తన పరిశ్రమలలో, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లలో:
ముఖ్యం గా సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ చదివిన వారికి ఈ కంపెనీలలో అవకాశాలు పుష్కలం గా ఉంటాయి… విత్తనోత్పత్తి చేసే కంపెనీలు ఫీల్డు అసిస్టెంట్లు గా ఉద్యోగాలు ఇస్తున్నారు.. విత్తన పరిశ్రమలలో ముఖ్యం గా అమ్మాయిలకు అనేక అవకాశాలు ఉన్నాయి… విత్తన క్వాలిటీ టెస్టింగ్, విత్తన పరీక్షలు చేయడం, గ్రో అవుట్ టెస్టులు నిర్వహించడం, సర్టిఫికేషన్ వంటి అనేక పనులు చెయ్యడానికి ముఖ్యం గా అమ్మాయిలకు అవకాశాలు ఇస్తున్నారు…. లాబొరేటరీ లలో అనేక మంది సీడ్ టెక్నాలజీ చదివిన వారు పనిచేస్తున్నారు… ఇంకా చాలా మంది అవసరం కూడా ఉంది… ప్రస్తుతం చాల తక్కువ మంది ప్రతి సంవత్సరం రిలీవ్ అవుతున్నారు కాబట్టి ప్రస్తుతం వారికి డిమాండ్ ఉంది… ఈ పరిశ్రమలలో కూడా ప్రయత్నించండి…

10. ప్రైవేటు అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీలలో:
ప్రస్తుతం అనేక ప్రైవేట్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీలు ఫీల్డు అసిస్టెంట్ లు గా, ప్రాక్టికల్ అసిస్టెంట్ లు గా డిప్లొమా చదివిన వారిని నియమిస్తున్నారు… యూనివర్సిటీ వారి అనుమతి లేకపోయినప్పటికీ అనేక ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలు వీరిని నియమిస్తున్నాయి…. కాబట్టి మీకు దగ్గర లోని పాలిటెక్నిక్ కాలేజీ వారిని సంప్రదిస్తే మీకు అవకాశం లభించవచ్చు….

ఉద్యోగం చెయ్యాలి అనుకొనే వారికి ముఖ్యమైన సూచనలు కొన్ని:

 1.ఉద్యోగం లో చేరిన రెండవ నెలలోనే మరో కంపెనీ ఆ తర్వాత మరో కంపెనీ…. ఇలా మారుకుంటూ పోతే మీరు ఎక్కడా స్థిరం గా పనిచేయ్యలేరు… ఆ తర్వాత ఏ కంపెనీ కూడా మీకు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రాదు..
2. మీ తల్లి దండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని ఇంత వరకూ చదివించారో ఒక్క క్షణం ఆలోచిస్తే…. ఉద్యోగం లో వచ్చే కష్టం ఏమంత కష్టం గా ఉండదు…
3. ఉద్యోగం రానంత వరకూ ఉద్యోగం రాలేదని బాధపడి… తీరా ఉద్యోగం వచ్చాక జీతం సరిపోలేదని, పై అధికారి వేధిస్తున్నాడని ఉద్యోగం మానేయడం ఎంతవరకు సమంజసం…
4. కంపెనీలు జీతం ఇస్తాయి కాబట్టి దానికి సరిపడా పని చేయించుకుంటాయి…. కాబట్టి కష్టపడి పనిచేయడం తప్ప మరొక మార్గం లేదు… ముందు నెలల్లో కొంచం కష్టం గా ఉన్నా ఇష్టపడి పనిచేస్తే ఏమంత కష్టం ఉండదు… సరికదా ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తూ పనిచేస్తే పదోన్నతులు కూడా లభిస్తాయి…
5. ముందుగా బయోడేటా మాత్రం చక్కగా తయారు చేసుకొని మీకు ఏ విషయం లో ఎక్కువ ప్రావీణ్యం ఉందో వివరాలు పొందు పరిస్తే… అవతలివారికి మంచి ఇంప్రెషన్ కలిగి వెంటనే మీకు అవకాశం ఇస్తారు….agri jobs for agri diploma students

కాబట్టి… కష్టపడి పనిచేయండి… నిరాశ దగ్గరకు రానీయకండి… మీ శక్తి సామర్ద్యాలను నమ్ముకోండి…. నిజాయితీ గా పనిచెయ్యండి… పనిలో అబద్దాలు చెప్పకండి… జీవితం లో పైకి వస్తారు… మీ తల్లిదండ్రులకు, మీకు చదువు చెప్పిన గురువులకు, మీరు చదివిన కాలేజీకి, మీ గ్రామానికి మంచి పేరు తీసుకురండి…. జీవితం లో ఒక్కొక్క మెట్టూ పైకి ఎక్కి ఉన్నత శిఖరాలు అధిరోహించ డానికి ఒకే ఒక్క రహస్యం ఉంది… అదే అలుపెరుగక కష్టపడి పనిచెయ్యడం… విష్ యూ ఆల్ ద బెస్ట్….

-మీ  విజయ్ కుమార్ బోమిడి, గ్రీన్ క్రాస్ ఫౌండేషన్, (81254 43163), సాలూరు, విజయ నగరం జిల్లా 

4 thoughts on “Agri Jobs for Agri Diploma holders in private sector

Comments are closed.