Ambajipeta Marriage Band review- అంబాజీపేట మ్యారేజీ బ్యాండు విశ్లేషణ
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు – ఒక విశ్లేషణ-Ambajipeta Marriage Band review
వైవిధ్యమైన పాత్రలు ఎంచుకొనే హీరో సుహాస్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ . ఈ చిత్రం ఫిబ్రవరి 2 న విడుదలైంది. విడుదలైన ప్రతి సెంటర్ లో పాజిటివ్ రివ్యూ లు రాబట్టింది. చిత్రం చూసిన ప్రతి ఒక్కరి కీ తమ పల్లెటూరి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. గ్రామాల్లో ఉండే ప్రేమాభిమానాలు,కులాల మధ్య అంతరాలు, గొప్ప బీద తారతమ్యాలను స్పృశిస్తూ ముందుకు సాగిన చిత్రం ఇది. అమాయకత్వం మాటున దాగి ఉన్న ఆత్మాభిమానం యొక్క గొప్పదనాన్ని మనకు పరిచయం చేస్తూ అలా నడిచిపోతుంది కథనం.(Ambajipeta Marriage Band review)
నటుల కంటే పాత్రలే కనిపిస్తాయి
ఈ సినిమాలోని నటించిన వారికంటే వారు పోషించిన పాత్రలే మనకు కనిపిస్తాయి. సులువు గా కధలోనికి వెళ్ళిపోతాం. కలర్ ఫోటో లాంటి చిత్రం లో ఇప్పటికే నటించి ఉన్న సుహాస్ కు ఇటువంటి పాత్రలు కొట్టిన పిండి లాంటివి. తను పోషించిన మల్లి పాత్రే మనకు కనిపిస్తుంది. తన సోదరి గా చేసిన శరణ్య ప్రదీప్ కూడా పద్మ పాత్రలో జీవించింది. ఈ చిత్రం లో ఆమెది పూర్తి నిడివి గల పాత్ర… కవల పిల్లలైన ఈ ఇద్దరి జీవితాలు ఆ ఊరిలో ఏ విధం గా మలుపులు తిరిగాయో చెప్పే చిత్రమే ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’. వీరే కాదు ఈ చిత్రం లో నటించిన మిగిలిన అందరూ తమ పాత్రలకు తగ్గట్టు నటించి మెప్పించారు. సినిమా పూర్తి అయి బయటకు వచ్చేటప్పుడు ఒక రకమైన అనుభూతి కి గురౌతాం.
కథ ఏంటంటే…(Ambajipeta Marriage Band review)
కథ విషయానికి వస్తే….చిరతపూడి గ్రామం లో కవలపిల్లలు మల్లి (సుహాస్), పద్మ (శరణ్య ప్రదీప్). పద్మ ఆ ఊర్లోనే టీచర్. ఆ ఊర్లో ఒక పెద్దమనిషి గా వెంకట్ బాబు (నితిన్ ప్రసన్న)..వెంకట్ బాబు కు ఒక చెల్లి లక్ష్మి (శివాని నగారం). ఈ నాలుగు పాత్రల మధ్య ప్రధానం గా జరిగే కథ ఇది. పద్మ వెంకట్ బాబు మధ్య వైరానికి దారితీసిన పరిస్థితులను చక్కగా తెరకెక్కించారు. సుహాస్ లక్ష్మి ల మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు కూడా పర్వాలేదు అన్నట్టు ఉంటాయి. ఇంటర్వెల్ ముందు వరకూ కొంచం నిదానం గా సాగిన కథ ఇంటర్వెల్ మరియు ఆ తర్వాత ఊపందు కొంటుంది. పోలీస్ స్టేషన్ లో జరిగే సన్నివేశాలు అద్భుతం గా ఉంటాయి. క్లైమాక్స్ చక్కగా తీయడం తో కథ లో కథనం లో లోపాలన్నీ మనకు కనిపించవు. ఒక మంచి కథ అని అనిపించేలా ఉంటుంది. (Ambajipeta Marriage Band review)
సెలూన్ లో నడిచే ప్రేమకథ…….
గ్రామీణ ప్రాంతాలలో కులవృత్తులు చేసుకొనే వారికి ఇప్పటికీ ఎదురౌతున్న సవాళ్ళను చక్కగా చెప్పారు. చిన్న కులం లో పుట్టినా , పేదరికం లో పుట్టినా ఆత్మాభిమానానికి ఇవేమీ సాటి రావు అని చెప్తుంది ఈ సినిమా. గ్రామీణ వాతావరణం లో సహజ సిద్ధం గా ఉండేలా సన్నివేశాలు తీయడం వలన కథ లోనికి నేరుగా వెళ్ళిపోతాం..సెలూన్ చుట్టూ బ్యాండ్ మేళం చుట్టూ నడుస్తుంది కథ. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మంచి డైలాగ్స్ రాసుకున్నారు. సుహాస్ ఆహార్యం సహజ సిద్ధం గా ఉండే హావభావాలు మనల్ని ఆ పాత్రల చుట్టూ తిరిగేలా చేస్తాయి. 2007 నేఫద్యం చాలా చక్కగా చిత్రీకరించారు. ఒక చక్కటి ఫీల్ గుడ్ మూవీ…
నటీనటులు జీవించారు…
వందల కోట్ల రూపాయలు పోసి తీస్తున్న సినిమాల భవితవ్యం ఏమిటో చూస్తున్నాం…. దేనికైనా కథ మరియు కథనం చాలా కీలకం అని, అవన్నీ సరిగ్గా ఉంటే చిన్న చిత్రం అయినా ఘన విజయం సాధిస్తుంది అని నిరూపిస్తుంది ఈ చిత్రం. చిత్రం లో నటించిన ఇతర నటీ నటులు కూడా నటించారు అనే కంటే జీవించారు అని చెప్పవచ్చు. దర్శకుని పరం గా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కథ అలా వెళ్ళిపోతూ ఉండటం తో మనకు ఆ లోపాలు ఏమీ కనబడవు. భావోద్వేగాల సమ్మిళితం గా సాగిపోతుంది ఈ సినిమా…
కొందరికి తమ కెరీర్ లోనే మైలు రాయి అనదగ్గ సినిమా (Ambajipeta Marriage Band review)
ఈ చిత్రం లో సుహాస్ అద్భుతం గా చేసాడు. తన అక్క గా చేసిన శరణ్య ప్రదీప్ కెరీర్ లోనే ఇదొక మైలురాయి గా మిగిలిపోయే పాత్ర. సినిమా ను సగం ఆమె భుజాలపై మోసింది అని చెప్పొచ్చు.. లక్ష్మి గా చేసిన శివానీ కూడా బాగా చేసింది. హీరో ఫ్రెండ్ జగదీశ్ కూడా బాగా చేసాడు. ఇతర సాంకేతిక విభాగాలు అన్నీ నూటికి నూరు శాతం తమ టాలెంట్ చూపెట్టాయి. కెమెరా పనితనం తో గ్రామీణ వాతావరణం మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. చక్కని డైలాగ్స్ కూడా ఉన్నాయి.
ఈ రోజుల్లో కులాలు ఎక్కడున్నాయి… గొప్ప బీద తేడాలు ఎక్కడున్నాయి..అనే వారికి అవి గ్రామాల పునాదుల్లో ఇప్పటికీ అలానే ఉండిపోయాయి అంటూ చెప్తుంది, చూపిస్తుంది ఈ సినిమా…..
పాజిటివ్స్ : సుహాస్, శరణ్య ప్రదీప్ నటన, కథ మరియు కథనం, కెమెరా పనితనం,
నెగెటివ్స్ : పెద్దగా కనబడవు
రేటింగ్ : 3/5
చిత్రం: అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్
నట వర్గం: సుహాస్, శరణ్య ప్రదీప్, శివానీ నాగారం, స్వర్ణ కాంత్, నితిన్ ప్రసన్న, గోపరాజు రమణ తదితరులు
సంగీతం : శేఖర్ చంద్ర
ఎడిటింగ్ : కోదాటి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ : వాజిద్ బేగ్.,
నిర్మాత : ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి, వెంకటేష్ మహా (సమర్పణ), బన్నీ వాస్ (సమర్పణ)
రచన మరియు దర్శకత్వం : దుష్యంత్ కటికనేని