Animal Husbandry Assistant Jobs లో నకిలీ సర్టిఫికేట్ ల బెడద
పశు సంవర్ధక సహాయకుల పోస్టులకు నకిలీ సర్టిఫికేట్ ల బెడద….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గ్రామ సచివాలయాలలో పశు సంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీ లో చాలా ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. బోగస్ సర్టిఫికెట్లు పొంది అర్హత పరీక్ష రాసిన అనేక మంది ఇప్పుడు ఉద్యోగాలు పొందుతూ ఉండటం వివాదానికి దారి తీస్తోంది. కాలేజీలకు వెళ్లి చదువుకొని అర్హతా పరీక్ష కు అర్హులైన వారు నష్టపోయే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అసలు ఈ పోస్టుల భర్తీ ఇంత రాద్దాంతం కావడానికి గల కారణాలు ఒక సారి పరిశీలిద్దాం…(Animal Husbandry Assistant Jobs)
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయాల వ్యవస్థ ను ఏర్పాటు చేసారు. ఒక్కొక్క సచివాలయం లో వేర్వేరు శాఖలకు చెందిన దాదాపు పది మంది చొప్పున ఉద్యోగావకాశాలు లభించాయి. వాటిలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ ఉద్యోగం ఒకటి.
2019 లో నిర్వహించిన అర్హత పరీక్ష లో విజయం సాధించి కొంత మంది ఉద్యోగాలు పొందారు. అయితే అప్పటికి తగిన అర్హతలు గల అభ్యర్దులు లేకపోవడం తో దాదాపు 6 వేల పోస్టుల వరకూ ఖాళీ గా ఉండిపోయాయి. రెండు విడతలు గా జరిగిన రిక్రూట్ మెంట్ లో ఖాళీలే ఎక్కువగా మిగిలి పోయాయి. దానితో అప్పటినుండి ఈ పోస్టుల నోటిఫికేషన్ కోసం అభ్యర్దులు ఎదురు చూస్తూ ఉన్నారు.
అంతే కాకుండా ఎక్కువ పోస్టులు ఉండటం తో చాలా మంది కొత్తగా పశు సంవర్ధక డిప్లొమా కోర్సులు చదవడం పై ఆసక్తి చూపి ఈ కోర్సులు పూర్తి చేసారు. అయితే ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదు. తిరిగి 2023 లో నోటిఫికేషన్ విడుదల చేసారు. రేషనలైజేషన్ పేరుతో పోస్టుల సంఖ్య బాగా కుదించి వేసారు.
ప్రవేశ పరీక్ష అర్హతల విషయం లో ప్రభుత్వం తప్పు చేసిందా…?
ఇంతవరకూ బాగానే జరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఈ పరీక్ష రాసే వారి అర్హతల విషయం లో ఈ సారి అనేక కోర్సులు చేసిన వారికి అవకాశం కల్పించారు. డైరీ టెక్నాలజీ , వొకేషనల్ కోర్సులు వంటి అనేక కోర్సులు చదివిన వారికి అర్హత కల్పించారు. (మొదటి నోటిఫికేషన్ లో వీరికి అవకాశం ఇవ్వలేదు.. కేవలం డిప్లొమా చదివిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు) ప్రభుత్వ సంస్థలలో చదివిన వారితో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల లో చదివిన వారు కూడా అర్హులే అని ఇచ్చారు.
ఇక్కడే తప్పు జరిగింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఈ ప్రైవేటు సంస్థ లో చదివినట్లు అనేక మంది బోగస్ సర్టిఫికెట్లు కొనుక్కున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ఈ డిప్లొమా సర్టిఫికేట్ ల అమ్మకం విచ్చలవిడి గా జరిగింది. విద్యా సంస్థ లో చేరి తరగతులకు హాజరై పరీక్షలు రాసి సర్టిఫికేట్ పొందవలసిన పరిస్థితి నుండి నేరుగా వేల కొద్దీ రూపాయలు కుమ్మరించి సర్టిఫికేట్ లు కొనుగోలు చేసారు.
అనుమతి పొందిన విద్యాసంస్థ పేరుతోనే నకిలీ సర్టిఫికేట్ లు …(Animal Husbandry Assistant Jobs)
అనుమతి పొందిన సంస్థ పేరుతోనే పెద్ద ఎత్తున నకిలీ సర్టిఫికేట్ లు చలామణీ లో ఉండటం తో చాలా మంది ఎగబడి మరీ కొన్నారు.. దానితో ఈ పరీక్ష కు హాజరయిన వారి సంఖ్య విపరీతం గా పెరిగింది. ఈ నకిలీ సర్టిఫికెట్ల తో అర్హత పరీక్ష రాసిన అనేక మంది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందబోతున్నారు.ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావస్తోంది. అనర్హులు అనేక మంది ఉద్యోగ నియామక పత్రాలు పొందుతున్నారు.
విద్యార్ధి సంఘాల ఆందోళనలు పట్టించుకోని ఉన్నతాధికారులు
ఈ విషయం గా రాష్ట్ర వ్యాప్తం గా అనేక విద్యార్ధి సంఘాలు ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నప్పటి కీ ఉన్నతాధికారులు పట్టించు కోవడం లేదు. ఇలా నకిలీ సర్టిఫికేట్ లు పొంది దాని ద్వారా ఉద్యోగం పొందిన వారు ఉంటే వారిపై ఎవరైనా ఆరోపణ చేస్తే మాత్రమే చర్యలు తీసుకోగలం అని చెప్తున్నారు. ఇది చాలా దారుణం అని చెప్పాలి.. ఎంతో కష్టపడి చదివి పట్టా పొంది ఆ తర్వాత అర్హతా పరీక్ష కోసం రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని చదివినా ఫలితం లేకుండా పోయిందని నిజం గా అర్హత కలిగిన అభ్యర్ధులు వాపోతున్నారు.
నకిలీ సర్టిఫికేట్ లతో పొందిన ఉద్యోగాలు రద్దు చేయాలి…(Animal Husbandry Assistant Jobs)
ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఈ ప్రక్రియ ను వెంటనే నిలిపివేసి నకిలీ సర్టిఫికేట్ లు పొందిన వారిని గుర్తించి వారికి ఇచ్చిన ఉద్యోగాలను రద్దు చేయాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాసంస్థ ఒక్కటే కాబట్టి … ఆ సంస్థ లో నిజం గా చదివిన వారు ఎవరో కనుక్కోవడం పెద్ద కష్టం కాదు. వారు తరగతులకు హాజరు అయ్యారా లేదా.. కళాశాల నిర్వహించే పరీక్షలకు హాజరు అయ్యారా లేదా అనే విషయాలు పరిశీలించడం అంత కష్టం కాదు. కాబట్టి ఈ సంస్థ వద్ద వివరాలు తీసుకొని క్షుణ్ణం గా పరిశీలించిన తర్వాత మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. లేదంటే చట్ట ప్రకారం అర్హతలు కలిగి ఉన్న అనేక మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది.
ప్రభుత్వం వెంటనే నిందితులను గుర్తించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి…
కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నకిలీ సర్టిఫికేట్ లు కలిగి ఉద్యోగార్హత పొందిన వారిని గుర్తించి వారిని ఉద్యోగాల నుండి తొలగించాలి. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఆరోపణలు వస్తున్న విద్యాసంస్థల రికార్డులు పరిశీలన చేసి అనర్హులను గుర్తించాలి. ఆ తర్వాత మాత్రమే ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపట్టాలి. అనర్హులు ఉద్యోగం లో చేరిన తర్వాత తమ ఉద్యోగాలు కాపాడుకోవడానికి మరిన్ని పైరవీలు చేసే అవకాశం ఉంది కాబట్టి.. ప్రభుత్వం అర్హులైన అభ్యర్దులకు సరైన న్యాయం చేయాలి. ఈ పశు సంవర్ధక సహాయకుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకం గా జరిగేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.