BGT-2024 Sydney Test Ind vs Aus| చెలరేగిన పంత్ | ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో భారత్
బ్యాటింగ్ చేస్తున్న పంత్ చెలరేగిపోయాడనే చెప్పాలి. అప్పటి వరకూ మంచి లైన్ మీద వేస్తున్న బోలాండ్ కాదు, స్టార్క్ కాదు, కమ్మిన్స్ కాదు ఏ బౌలర్ వచ్చినా చితక్కొట్టి వదిలిపెట్టాడు పంత్. అప్పటి వరకూ కొద్ది పాటి వేగం తో నడుస్తున్న స్కోరు బోర్డు ను పరుగులు పెట్టించాడు పంత్. బౌలర్లు పూర్తి ఆధిపత్యం వహిస్తున్న పిచ్ పై తన సహజ శైలి లో విరుచుకు పడుతూ షాట్లు ఆడాడు
BGT Sydney Test Ind vs Aus| చెలరేగిన పంత్ | ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న చివరి టెస్టు రెండవ ఇన్నింగ్స్ లో భారత్ ఎదురీదుతోంది. ఇప్పటికే టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ పెవిలియన్ కు చేరుకోవడం తో భారమంతా టెయిలెండర్ లపై పడింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తమ రెండవ ఇన్నింగ్స్ లో 141 పరుగులు చేసి ముఖ్యమైన 6 వికెట్లను కోల్పోయింది. (BGT-2024 Sydney Test)
ఈ టెస్టు లో మొదటి రోజు ఏం జరిగింది అంటే …
టాస్ గెలిచిన భారత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బుమ్రా ఈ టెస్టు కు నాయకత్వం వహిస్తున్నాడు. వరుసగా విఫలమౌతున్న రోహిత్ శర్మ ఈ టెస్టు ఆడటం లేదు. అందువల్ల గిల్ కు ఈ టెస్టులో స్థానం లభించింది. ఆకాష్ దీప్ స్థానం లో ప్రసిద్ కృష్ణ జట్టులోనికి వచ్చాడు. నిదానం గా బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు త్వరగానే వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 11 పరుగుల వద్ద కే.ఎల్ రాహుల్, 17 పరుగుల వద్ద జైస్వాల్, 57 పరుగుల వద్ద గిల్, 72 పరుగుల వద్ద కోహ్లీ, 120 పరుగుల వద్ద పంత్, అదే స్కోరు వద్ద నితీష్ రెడ్డి, 134 పరుగుల వద్ద జడేజా, 148 పరుగుల వద్ద సుందర్, 168 పరుగుల వద్ద ప్రసిద్ద్, 185 పరుగుల వద్ద బుమ్రా అవుట్ అయ్యారు.
జట్టులో అత్యధికం గా పంత్ 40 పరుగులు చేయగా, జడేజా 26, బుమ్రా అతి విలువైన 22 పరుగులు చేసారు. ఇన్నింగ్స్ చివరలో ఒక సిక్సర్, మూడు ఫోర్ల తో బుమ్రా 22 పరుగులు చేయడం తో భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులుకు ఆలౌట్ అయ్యింది.
టీ విరామం తర్వాత భారత జట్టు ఆలౌట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. బుమ్రా, కాన్ స్టాస్ మధ్య చిన్న వివాదం చెలరేగిన తర్వాత మొదటి రోజు చివరి బంతికి క్వాజా అవుట్ అయ్యాడు. బంతి అనూహ్యం గా బుమ్రా కు సహకరిస్తుండటం తో సమయాన్ని వృధా చేయడానికి కాన్ స్టాస్ ప్రయత్నించి నట్లు ఆ తర్వాత పంత్ మీడియా కు తెలియ జేశాడు. మరొక ఓవర్ వేసి ఉంటే పరిస్థితి మరొకలా ఉండేదేమో..
రెండవ రోజు ఆట విశేషాలు(BGT-2024 Sydney Test)
తొమ్మిది పరుగులకు ఒక వికెట్ నష్టపోయిన ఓవర్ నైట్ స్కోరు తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే ఆసీస్ బ్యాట్స్ మన్ కు ధారాళం గా పరుగులు తీయడం కుదరలేదు. త్వరత్వరగా వికెట్లు పారేసుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు స్కోరు 9 పరుగుల వద్ద క్వాజా, 15 పరుగుల వద్ద లబుషేన్, 35 పరుగుల వద్ద కాన్ స్టాస్, 39 పరుగుల వద్ద హెడ్, 96 పరుగుల వద్ద స్మిత్, 137 పరుగుల వద్ద అలెక్స్ కారీ అవుట్ అయ్యారు. కమ్మిన్స్ 162 పరుగుల వద్ద, స్తార్క్ 164 పరుగుల వద్ద, వెబ్ స్టర్ 166 పరుగుల వద్ద, బోలాండ్ 181 పరుగుల వద్ద అవుట్ కావడం తో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ కు తెర పడింది. 181 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. భారత్ కు 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్
ఆస్ట్రేలియా ఆలౌట్ కావడం తో తమ రెండవ ఇన్నింగ్స్ ను భారత్ ధాటి గా ప్రారంభించింది. జైస్వాల్, రాహుల్ మొదటి వికెట్ కు 42 పరుగులు జత చేసిన తర్వాత రాహుల్ అవుట్ అయ్యాడు. రాహుల్ అవుట్ అయిన కొద్ది సేపటికే జైస్వాల్ కూడా అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 47 పరుగులు. కోహ్లీ ఈ టెస్టు లో నైనా పెద్ద స్కోరు చేస్తాడనుకున్న అభిమానుల ఆశలు నెరవేరలేదు. బయటకు వెళ్తున్న బంతిని వెంటాడుతూ తన వికెట్ ను సమర్పించుకున్నాడు కోహ్లీ. ఆస్ట్రేలియా లో ఇదే కోహ్లీ చివరి ఇన్నింగ్స్ అంటూ చివరికి కామెంటేటర్లు కూడా బాధ పడిన సందర్భం అది. అప్పటికి జట్టు స్కోరు మూడు వికెట్ల నష్టానికి 59 పరుగులు. క్రీజు లోనికి వచ్చిన పంత్ దూకుడు గా ఆడటం మొదలు పెట్టాడు. అయితే గిల్ కూడా 78 పరుగుల జట్టు స్కోరు వద్ద అవుట్ అయ్యాడు.
చెలరేగిన పంత్ (BGT-2024 Sydney Test)
అప్పుడు బ్యాటింగ్ చేస్తున్న పంత్ చెలరేగిపోయాడనే చెప్పాలి. అప్పటి వరకూ మంచి లైన్ మీద వేస్తున్న బోలాండ్ కాదు, స్టార్క్ కాదు, కమ్మిన్స్ కాదు ఏ బౌలర్ వచ్చినా చితక్కొట్టి వదిలిపెట్టాడు పంత్. అప్పటి వరకూ కొద్ది పాటి వేగం తో నడుస్తున్న స్కోరు బోర్డు ను పరుగులు పెట్టించాడు పంత్. బౌలర్లు పూర్తి ఆధిపత్యం వహిస్తున్న పిచ్ పై తన సహజ శైలి లో విరుచుకు పడుతూ షాట్లు ఆడాడు. నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్ల తో విధ్వంశం సృష్టించిన పంత్ వాయు వేగం తో 61 పరుగులు చేసి కమ్మిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఒక అరగంట లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు పంత్. బౌలర్లు బాల్ వేయడానికే భయపడేంతగా బౌలర్లను భయపెట్టాడు పంత్ .
దురదృష్టవశాత్తూ పంత్ అవుట్ కావడం తో మళ్ళీ భారత్ కష్టాల్లో పడింది.తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన నితీష్ రెడ్డి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడం తో మళ్ళీ ఆసీస్ బౌలర్లు ముప్పేట దాడి చేయడం మొదలు పెట్టారు. ఆట ముగిసే సమయానికి ‘నయా వాల్’ వాషింగ్టన్ సుందర్ 6 పరుగుల తోనూ, జడేజా 8 పరుగుల తోనూ క్రీజు లో ఉన్నారు. జట్టు స్కోరు 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు.
ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా 200 పైగా స్కోరు చేదించి గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఎప్పుడో 2000 సంవత్సరం లో మాత్రమే ఆస్ట్రేలియా 200 పైగా స్కోరు ను చేజ్ చేసి గెలిచింది. కాబట్టి గణాంకాల ప్రకారం భారత్ తమ స్కోరు ను 200 దాటిస్తే మాత్రం మ్యాచ్ పై కొంచం ఆశలు పెట్టుకోవచ్చు. అదీ బుమ్రా బౌలింగ్ చేయడానికి అందుబాటులో ఉంటేనే. లేదంటే ఓటమి తప్పదు.
ఇది క్రికెట్.. ఇప్పటికి ఆస్ట్రేలియా గెలవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో భారత్ గెలవడానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో మూడవ రోజు ఏదైనా జరగవచ్చు. టెస్టు ఫలితం రావడం మాత్రం పక్కా.. డౌటే అక్కర్లేదు.