Bilkis Bano case – Godra Riots బిల్కిస్ బానో కేసు-గోద్రా అల్లర్లు వివరాలు
బిల్కిస్ బానో కేసు మరొక సారి వార్తలలోకి వచ్చింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయం పై నమ్మకాన్ని మరింత పెంచింది. ఈ తీర్పు కోసం అలుపెరుగని పోరాటం జరిగింది.. ఎన్నికలలో గెలుపే లక్ష్యం గా పనిచేసే ప్రభుత్వాలు న్యాయాన్ని తుంగలో తొక్కి అన్యాయాన్ని అందలం ఎక్కించినప్పుడు …… ఆమె కళ్ళ వెంట అలవాటుగానే కన్నీళ్లు చిప్పిల్లాయి.. ప్రభుత్వపు ఉత్తర్వులతో దోషులు విడుదల చేయబడినప్పుడు వారికి జరిగిన స్వాగత సత్కారాలు మరొక్క సారి ఆమె మనసుకు తీవ్రమైన గాయాన్నే కలిగించాయి. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, అవమానాలకు గురిచేసినా, బెదిరించి నయానో భయానో కేసు వాపసు తీసుకోమని వికృత చేష్టలకు పాల్పడినా బెదిరిపోని వ్యక్తిత్వం ఆమె సొంతం..తనకు మరొక్క సారి జరిగిన అన్యాయాన్ని సుప్రీం కోర్టు లో సవాల్ చెయ్యగలిగే గుండె ధైర్యం ఆమె సొంతం.. ఆమె పేరే బిల్కిస్ బానో… ఆమె గురించి తెలుసుకోవాలంటే..Bilkis Bano – Godra riots
బిల్కిస్ బానో ఎవరు?
బిల్కిస్ బానో ఒక ముస్లిం కుటుంబానికి చెందిన ఒక గృహిణి. 2002 లో గోద్రా అల్లర్లు జరిగే సమయానికి ఆమెకు 19 ఏళ్ళు . అప్పటికే మూడేళ్ళ కూతురు ఉంది. ఆమె అప్పటికి 5 నెలల గర్భవతి కూడా.
ఆ రోజు ఏం జరిగింది…?
ఎప్పటిలాగానే ఆమె ఇంట్లో తన పనిలో ఉన్నారు .. ఇంతలో ఇలా దాడులు జరుగుతున్న విషయం తెలిసింది.. కట్టు బట్టలతో ఆమె, ఇంట్లోని చిన్న పిల్లలతో సహా బయటకు వచ్చేసారు. 17 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడు కోవడానికి పరుగులు తీసారు. గర్భవతి గా ఉన్న బిల్కిస్ బానో, ఆమె కుటుంబం లో గర్భవతి గా ఉన్న మరొక ఆమెతో సహా వేరే ఊరిలో తలదాచుకున్నది ఆ కుటుంబం.అదే ఆమె పాలిట శాపం అయ్యింది.
దాడి చేసింది ఎవరు ….?
కొద్ది రోజులుగా వీరిని గమనిస్తున్న ఆ ఊరిలో కొంత మంది ఒక్కసారిగా ఈ కుటుంబం పై దాడి చేసారు. బిల్కిస్ బానో మూడేళ్ళ కూతురిని నేలకు విసిరి కొట్టారు. 14 మంది కుటుంబ సభ్యులను కిరాతకం గా చంపేశారు. రెండు రోజుల క్రితమే ప్రసవించిన మరొక కుటుంబ సభ్యురాలి రెండు రోజుల బిడ్డను చంపేశారు. ఆమె పై సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. 5 నెలల గర్భిణి గా ఉన్న బిల్కిస్ బానో పై కూడా సామూహిక అత్యాచారం చేసారు. ఆమె చనిపోయిందని భావించి వెళ్ళిపోయారు. ఈ సంఘటన మార్చి 3, 2002 న జరిగింది.
ఈ సంఘటన లో బిల్కిస్ బానో కుటుంబం మొత్తం తుడుచు పెట్టుకు పోయింది. తన ఊరిని వదిలేసి ఎక్కడో తలదాచుకొని కేసు పెట్టింది ఆమె. కేసు వెనక్కి తీసుకోమని బెదిరించారు. అన్ని విధాలా భయపెట్టారు. వెనక్కు తగ్గలేదు. చివరికి దోషులకు శిక్ష పడింది. జీవిత ఖైదు పడింది.. తనకు న్యాయమే జరిగింది అని అనుకొన్నదిఆమె…
ఇప్పుడు మళ్ళీ ఈ కేసు ఎందుకు వెలుగు లోనికి వచ్చింది?
అయితే గత సంవత్సరం అనగా 2023 ఆగస్టు 15 సందర్భం గా జీవిత ఖైదు అనుభవిస్తున్నఈ కేసులోని దోషులను అందరినీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రత్యేక ఆర్డరు తో వీరిని బయటకు తీసుకు వచ్చింది గుజరాత్ ప్రభుత్వం. వీరు జైలు నుండి బయటకు రాగానే అనూహ్యం గా కొందరు వారిని సన్మానించారు.. పూల దండలతో ముంచెత్తారు.. స్వీట్లు పంచారు.. దీనితో ప్రజలంతా ఆశ్చర్య పోయారు. ఎన్నికలలో విజయం కోసమే ప్రభుత్వం ఇలా అడ్డగోలు గా వారిని విడుదల చేసింది అని రాజకీయ పక్షాలు అన్నీ గొంతు ఎత్తాయి. బిల్కిస్ బానో తీవ్రమైన విచారం వ్యక్తం చేసారు. అంత కాకుండా సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అన్ని అంశాలు సునిశితం గా పరిశీలించిన అత్యున్నత న్యాయ స్థానం వారి విడుదలను తప్పు పట్టింది … వారిని రెండు వారాలలోపు జైలుకు పంపాలని ఆదేశించింది.
ఇటువంటి సంఘటనలు జరగడానికి అంతకు ముందు గోద్రా లో జరిగిన అల్లర్లే కారణం. ఈ సందర్భం గా గోద్రా అల్లర్లకు కారణాలు క్లుప్తం గా తెలుసుకుందాం…
గోద్రా లో అసలు ఏం జరిగింది ?
2002 వ సంవత్సరం లో గుజరాత్ లోని గోద్రా లో ఒక అమానవీయ సంఘటన జరిగింది. గోద్రా ప్రశాంతం ఉండే పట్టణం. వ్యవసాయోత్పత్తులు, కలప,నూనె మిల్లులు, పిండి మిల్లులు ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి 27 వ తేదీన అయోధ్య నుండి హిందూ యాత్రికులతో వస్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలు గోద్రా స్టేషన్ లో ఆగింది. ఉన్నట్టుండి… రైలు లో ఉన్న కర సేవకులకు తినుబండారాలు అమ్ముతున్న ముస్లిం యువకులకు మధ్య ఘర్షణ మొదలైంది. అది చిలికి చిలికి పెద్దదై చివరకు హింసకు దారి తీసింది. ఇంతలో రైలుకు ఎవరో నిప్పు పెట్టారు. ఆ రైలు లో దాదాపు రెండు వేలమంది కి పైగా కరసేవకులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణీకులతో క్రిక్కిరిసి ఉన్న రెండు భోగీలు పూర్తిగా మంటల్లో చిక్కు కున్నాయి. ఈ ఘటన లో 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
అల్లర్లు ఎలా చెలరేగాయి అంటే….
ఈ సంఘటన తో గోద్రా అంతా అల్లకల్లోలం గా మారింది. అల్లరి మూకలు స్వైర విహారం చేసాయి. రైలు ప్రమాదం లో కరసేవకులు చనిపోవడం తో ముస్లిం ల పై ప్రతీకారేచ్చ తో రగిలిపోయారు.. అల్లర్లు చెలరేగాయి. అదుపు చెయ్యడం సాధ్యం కాలేదు. అప్పటికి గుజరాత్ ముఖ్యమంత్రి గా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. ఈ అల్లర్లను కట్టడి చెయ్యడానికి ఆయన సరిగ్గా ప్రయత్నం చెయ్యలేదనే విమర్శ ఉంది. (Bilkis Bano – Godra riots)
నరోడా పాటియా నరమేధం ఎలా జరిగింది అంటే…
ఫిబ్రవరి 28 వ తేదీన అహ్మదాబాద్ లో మారణహోమం జరిగింది. కోపోద్రిక్తులైన ఐదు వేలకు పైగా గుంపు పది గంటలుగా జరిపిన హత్యాకాండ లో 97 మంది ముస్లిం లను చంపేశారు. దీనిని నరోడా పాటియా మారణహోమం గా చెప్తారు.
ఈ అల్లర్ల లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే…..
అధిక భాగం ముస్లిం కుటుంబాల ఊచకోత జరిగింది. ఈ అల్లర్ల లో దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెప్తున్నాయి. 800 మంది ముస్లిం లు, 250 మందికి పైగా హిందువులు ప్రాణాలు కోల్పోయారు. 200 మంది కి పైగా కనబడకుండా పోయారు. ఎంతో మంది భర్తలను కోల్పోయారు. ఎంతో మంది పిల్లలు అనాధలు అయ్యారు. అనేక దర్గాలు, మసీదులు, గుడులు, చర్చి లు విధ్వంసానికి గురయ్యాయి. రైలు దహనం తర్వాత దాదాపు మూడు నెలల వరకూ అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. గుజరాత్ లో జరిగిన ఈ అల్లర్ల పై దర్యాప్తు జరపడానికి నానావతి – మెహతా కమీషన్ ను ప్రభుత్వం నియమించింది.
స్వతంత్ర భారత చరిత్ర లోనే ఒక నెత్తుటి మరక ఈ గోద్రా అల్లర్లు
స్వతంత్ర భారత చరిత్ర లోనే ఒక నెత్తుటి మరక ఈ గోద్రా అల్లర్లు… ఆ నరమేధానికి సజీవ సాక్ష్యం బిల్కిస్ బానో.. ఆప్తులను, మాన ప్రాణాలను కోల్పోయిన ఎంతో మంది కి ప్రతినిధి ఆమె… తనకు జరిగిన అన్యాయం పై రాజీ లేని పోరాటం చేసి దోషులను జైలుకు పంపినప్పటికీ … వాళ్ళు బయటకు వచ్చేసారు… తిరిగి వాళ్ళను లోపలికి పంపే వరకూ పోరాటం చేసిన ఒక సామాన్య మహిళ … ధీర వనిత బిల్కిస్ బానో.. బిల్కిస్ బానో ఉదంతం వల్లనే గోద్రా నరమేధం గుర్తు చేసుకుంటున్నాం ఇప్పటికీ… లేకపోతే…. మతిమరపు జనాలం.. ఏనాడో మరచి పోయేవాళ్ళం… (Bilkis Bano – Godra riots)
PS: బిల్కిస్ బానో ఉదంతం లో జైలు నుండి విడుదలైన 11 ఖైదీ లలో 9 మంది ఆచూకీ తెలియడం లేదు. సుప్రీం కోర్టు తీర్పు రాగానే వాళ్ళ ఇళ్ళు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు..
ఈ వ్యాసం పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
It’s tooo clarity sir 👏👏☺️
Easy ga artham avuthundi sir.
thank you Begum garu