BSc Agriculture Course – BSc Ag కోర్సు కు ఎందుకు అంత డిమాండ్ – ఒక పరిశీలన
డాక్టర్లు, ఇంజనీర్లకు మాత్రం చాలా గుర్తింపు ఉండటం తో విద్యార్ధులు ఆ కోర్సులు ఎక్కువగా చదవడానికి ఆసక్తి చూపే వారు. పొరపాటున మెడిసిన్, వెటర్నరీ కోర్సుల్లో సీటు రాకపోతే కనీసం నాలుగు విడతలు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొనేవారు. అప్పటికీ పై కోర్సుల్లో సీటు రాకపోతే అప్పుడు.. ఏదో ఒకటి లే… ఇది కూడా ఒకరకం గా మంచిదే ‘ అనుకొంటూ ఈ వ్యవసాయ డిగ్రీ లో జాయిన్ అయ్యేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
BSc Agriculture Course -BSc Ag కోర్సులకు ఎందుకు అంత డిమాండ్ – ఒక పరిశీలన
ప్రస్తుతం భారత దేశం లో అత్యంత డిమాండ్ కలిగిన కోర్సుల్లో ప్రధానం గా మెడిసిన్, ఇంజనీరింగ్ ప్రధానమైనవి. అయితే ఈ మధ్య కాలం లో బాగా ప్రాచుర్యం పొందిన కోర్సు బిఎస్సీ అగ్రికల్చర్. చాలా మంది విద్యార్దులు ఈ కోర్సు చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల లలో సీట్లు సరిపడినన్ని లేకపోవడం తో ప్రక్క రాష్ట్రాలకు వెళ్లి మరీ చదువు కుంటున్నారు..BSc Agriculture ఈ కోర్సుకు ఇంత డిమాండ్ ఎందుకు పెరిగింది? ఈ కోర్సు కు నిజంగా అన్ని ఉద్యోగావకాశాలు ఉన్నాయా.. అనే అంశాలు చర్చించ వలసిన అవసరం ఎంతైనా ఉంది.BSc Agriculture Course
అప్పట్లో అంత డిమాండ్ లేదు ఈ కోర్సు కి ..
తొంభై వ దశకం వరకూ కూడా వ్యవసాయ కోర్సులకు అంతగా డిమాండ్ ఉండేది కాదు… అప్పట్లో డాక్టర్లు, ఇంజనీర్లకు మాత్రం చాలా గుర్తింపు ఉండటం తో విద్యార్ధులు ఆ కోర్సులు ఎక్కువగా చదవడానికి ఆసక్తి చూపే వారు. పొరపాటున మెడిసిన్, వెటర్నరీ కోర్సుల్లో సీటు రాకపోతే కనీసం నాలుగు విడతలు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొనేవారు. అప్పటికీ పై కోర్సుల్లో సీటు రాకపోతే అప్పుడు.. ఏదో ఒకటి లే… ఇది కూడా ఒకరకం గా మంచిదే ‘ అనుకొంటూ ఈ వ్యవసాయ డిగ్రీ లో జాయిన్ అయ్యేవారు.
వ్యవసాయ కాలేజీలు తక్కువ – సీట్లు తక్కువ
బాపట్ల, తిరుపతి, రాజేంద్రనగర్ క్యాంపస్ లు మాత్రమే పెద్ద క్యాంపస్ లు గా ఉండేవి. సీట్లు కూడా తక్కువే ఉండేవి. ఉద్యోగావకాశాలు కూడా అంతగా ఉండేవి కాదు. ప్రభుత్వం తరపున రిక్రూట్ మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ప్రైవేట్ రంగం లో ఉద్యోగావకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉండేవారు.. కొద్ది మంది మాత్రం పై చదువులు చదివే వారు.
ఇటువంటి నేఫద్యం లో వ్యవసాయ రంగం లో డిగ్రీ కోర్సులకు అంతగా డిమాండ్ ఉండేది కాదు.. ఎందుకంటే పొలాల్లో తిరిగి పనిచేసే జాబ్ కాబట్టి… అంతగా గ్లామర్ లేని ఉద్యోగాలు అని భావించి తమ చివరి ఎంపిక గా మాత్రమే ఈ కోర్సులను ఎంచుకొనే వారు.
వ్యవసాయాధారిత సంస్థల స్థాపన
ఆ తర్వాత మెల్లగా మార్పు రావడం మొదలయ్యింది… రెండువేల సంవత్సరం వచ్చేసరికి వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపన ఎక్కువ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు వాణిజ్య పంటలు ఎక్కువగా పండించడం ప్రారంభించారు. దానితో మంచి దిగుబడులు రావడం తో మంచి ఆదాయం కూడా రైతులకు కనిపించింది. అయితే అధిక దిగుబడులు సాధించే క్రమం లో అధికం గా పురుగుమందులు పిచికారి చేయడం ప్రారంభించారు. పురుగులు రోగనిరోధకత పెంచుకోవడం తో రైతులు భారీగా నష్టపోయారు.BSc Agriculture Course
పురుగు మందుల కంపెనీలు విరివి గా స్థాపించారు
ఈ క్రమం లో పురుగు మందులు, రసాయన కంపెనీలు విపరీతం గా స్థాపించారు. ఆర్దిక సరళీకరణ కు కేంద్ర ప్రభుత్వం తలుపులు తెరవడం తో పురుగుమందుల కంపెనీలు, ఎరువుల కంపెనీలు కూడా దేశం లో తమ ప్లాంట్లు స్థాపించడానికి ముందుకు వచ్చాయి. దానితో సంఘటిత, అసంఘటిత రంగాలలో ఉద్యోగావకాశాలు బాగా పెరిగాయి. వ్యవసాయ పట్టభద్రుల కోసం కంపెనీలు నేరుగా వ్యవసాయ కళాశాలలకు వెళ్లి క్యాంపస్ ఇంటర్వ్యూ లు నిర్వహించి మరీ ఉద్యోగాలు ఇచ్చారు. దానితో ఇరవై ఐదేళ్ళ లోపే మంచి హోదా తో ఐదంకెల జీతం, కంపెనీ వాహనం వంటి సౌకర్యాలు చవి చూసారు వ్యవసాయ పట్ట భద్రులు.BSc Agriculture Course
విత్తన కంపెనీ లలో బ్రీడర్ల కొరత
అంతే కాకుండా గత ఇరవై ఏళ్లలో విత్తన పరిశ్రమలు దేశమంతటా నెలకొల్పాయి ప్రైవేటు కంపెనీలు.. నైపుణ్యం కలిగిన వ్యవసాయ పట్టభద్రులకు పూర్తి డిమాండ్ ఏర్పడింది. ఒకానొక దశలో అర్హత కలిగిన ప్లాంట్ బ్రీడర్ల కొరకు విత్తన కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆరంకెల జీతం ఇవ్వడానికి కూడా ప్రైవేటు విత్తన కంపెనీలు వెనుకాడలేదు. దానితో వ్యవసాయ డిగ్రీ కోర్సులకు డిమాండ్ పెరగడం మొదలైంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే…. నాలుగేళ్ల డిగ్రీ ఎంత త్వరగా పూర్తి చేసేస్తే .. అంత త్వరగా ఉద్యోగం పొందవచ్చు అనేంత గా మారిపోయింది ..
సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ అగ్రికల్చర్ వైపు(BSc Agriculture Course)
దేశం లోని వ్యవసాయ రంగం లో శరవేగం గా మార్పులు వచ్చాయి. కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటు లోనికి వచ్చింది. దానితో సాఫ్ట్ వేర్ రంగం లోని వారు కూడా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వ్యవసాయం పట్ల ఆసక్తి చూపారు. స్వంతం గా వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకొని పంటలు పండించడం ప్రారంభించారు. వ్యవసాయ డిగ్రీలు చదివిన వారిని తమ పొలాలను అప్పగించి శాస్త్రీయం గా వ్యవసాయం చేయడం ప్రారంభించారు.(BSc Agriculture Course)
పాలీ హౌసులు, గ్రీన్ హౌసుల్లో ఊపందుకున్న వ్యవసాయం
కూరగాయల సాగు (ఒలేరీ కల్చర్), పూల మొక్కల సాగు (ఫ్లోరీ కల్చర్ ), పండ్ల తోటల పెంపకం (హార్టీ కల్చర్) వంటి రంగాల పట్ల అందరికీ ఆసక్తి పెరిగింది. కూరగాయలకు, పూలకు, పళ్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా పాలీ హౌసుల్లో సేద్యం ప్రారంభించారు. 1990 ప్రాంతం లో దేశం మొత్తమ్మీద కేవలం మూడు గ్రీన్ హౌసులు మాత్రమే ఉన్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఆ తర్వాతి రోజుల్లో వ్యవసాయ రంగం లో చాలా మార్పులు వచ్చాయి. గ్రీన్ హౌస్ టెక్నాలజీ తో పాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానం దేశం లోనికి ప్రవేశ పెట్టబడింది. డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ లాంటి పద్ధతులపై రైతులకు కూడా ఆసక్తి పెరిగింది.
ట్రాక్టర్ కంపెనీలు, వ్యవసాయ పరికరాల కంపెనీ ల స్థాపన
ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఆధునిక పరికరాల వాడకం మొదలయ్యింది. దేశీయం గా అనేక ట్రాక్టర్ కంపెనీలు ప్రారంభించారు. వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగం కూడా పట్టభద్రులను తయారు చేయడం తో ఈ రంగం కూడా బాగా విస్తరించింది.
యూనివర్సిటీ లలో ఆధునిక వంగడాలు, పరికరాలు, నూతన టెక్నాలజీ పై పరిశోధనలు ఊపందుకున్నాయి. యూనివర్సిటీ కి చెందిన పరిశోధనా స్థానాల్లో వ్యవసాయ పట్టభద్రులకు అవకాశాలు లభించాయి. కొత్త వ్యవసాయ కళాశాలలు స్థాపించారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించారు. దీనితో వ్యవసాయ డిగ్రీ చదివిన వారికి ఉద్యోగావకాశాలు పూర్తిగా మెరుగు పడ్డాయి.. ఒక రకం గా చెప్పాలంటే వ్యవసాయ పట్టభద్రులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
బ్యాంకు పరీక్షలల్లో అగ్రి వాళ్ళే టాప్..(BSc Agriculture Course)
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోనే కాకుండా వివిధ బ్యాంకులకు చెందిన పోటీ పరీక్షలకు కూడా వీరు పోటీ పడుతున్నారు.. ఆకర్షణీయమైన జీతం, ఉద్యోగ భద్రత ఉండటం తో పోటీ పరీక్షలు రాసి బ్యాంకులలో ఉద్యోగాలు పొందుతున్నారు. దాదాపు ప్రతి సంవత్సరం వందల మంది ఇలా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులో అనేక అంశాలకు సంబంధించిన సిలబస్ ఉండటం వలన బ్యాంకు పరీక్షలే కాకుండా సివిల్ సర్వీస్ వంటి పరీక్షలలో సులువు గా విజయం సాధిస్తున్నారు.
వ్యవసాయ అనుబంధ రంగాలలో కూడా డిమాండ్
వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలలో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. స్వంతం గా వ్యవసాయ క్షేత్రాలు స్థాపిస్తున్నారు. పుట్టగొడుగుల పంపకం, తేనెటీగల పంపకం. పశు గ్రాసాల పెంపకం, పాడి పరిశ్రమ తో పాటు సమీకృత వ్యవసాయ పద్ధతులు పాటించి బాగా లాభాలు పొందుతున్నారు. దేశవ్యాప్తం గా అనేకానేక వ్యవసాయాధారిత పరిశ్రమలు స్థాపించడం తో అర్హత కలిగిన వ్యవసాయ నిపుణులకు కొరత ఏర్పడింది..
ఆధునిక వ్యవసాయ పద్దతులతో సాగు కు నిపుణుల అవసరం(BSc Agriculture Course)
ఆధునిక వ్యవసాయ పద్ధతులలో వ్యవసాయం చేసే యువత పెరిగింది. నేల అవసరం లేని వ్యవసాయం (హైడ్రో ఫోనిక్స్), గాలి తో వ్యవసాయం (ఏరో ఫోనిక్స్) వంటి పద్ధతులలో సేద్యం చేస్తున్నారు. చివరికి తెలుగు రాష్ట్రాలలో సాగుకు అనువు కాని పంటలు కూడా పండిస్తున్నారు. కాశ్మీర్ లో పండించే ఆపిల్స్, కుంకుమ పువ్వు, స్ట్రా బెర్రీ లాంటివి సాగు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేసి లక్షల్లో ఆదాయం పొందుతున్నయువరైతులు అనేక మంది ఉన్నారు. ఈ నేఫద్యం లో వ్యవసాయం ప్రధాన వృత్తి గా ఎంచుకోవడానికి కూడా చాలా మంది వ్యవసాయ డిగ్రీలు చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో సైతం డ్రోన్ ల వినియోగం బాగా పెరగడం తో యువ వ్యవసాయ పట్టభద్రులకు డిమాండ్ బాగా ఉంది.
మొబైల్ వినియోగం పెరిగి సలహాలు సూచనలు ఇచ్చే పట్టభద్రుల అవసరం పెరిగింది
మొబైల్ వినియోగించే రైతుల శాతం బాగా పెరగడం తో పలు కంపెనీలు నేరుగా రైతులతో టచ్ లో ఉంటున్నారు. వారి సమస్యలకు ఫోన్ ద్వారానే పరిష్కారం అందించడానికి వ్యవసాయ పట్టభద్రులు అవసరం. విత్తన కంపెనీలు, పురుగు మందుల కంపెనీలు, సూక్ష్మ పోషక ఎరువుల కంపెనీలు కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని నేరుగా రైతులతో మాట్లాడే ఏర్పాటు చేసుకొంటున్నాయి. రైతులకు ఉపయోగపడే సమాచారం తో వివిధ ఆప్స్ రూపొందిస్తున్నారు. వెబ్ సైట్ లు రూపొందించి విలువైన సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నారు. ఇటువంటి అన్ని రంగాలలో వ్యవసాయ పట్టభద్రుల అవసరం ఎంతో ఉంది.
కార్పోరేట్ వ్యవసాయం లో కూడా
కార్పోరేట్ వ్యవసాయం కూడా ఇప్పుడు పట్టాలు ఎక్కుతోంది. రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలు రైతుల వద్ద పొలాలు లీజుకు తీసుకొని కూరగాయలు తో సహా ఇతర ముఖ్యమైన పంటలు పండిస్తున్నాయి. ఇటువంటి చోట్ల వ్యవసాయ పట్టభద్రుల అవసరం ఎంతైనా ఉంది. పొగాకు, కొబ్బరి, కోకో, ఆయిల్ పాం వంటి పంటలు పండించడం తో పాటు వాటికి సంబంధించిన అనుబంధ పరిశ్రమల్లో అనేక ఉద్యోగావకాశాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. మంచి వ్యవసాయ పరిజ్ఞానం కలిగిన పట్టభద్రులు స్వంతం గా వివిధ పూల, పండ్ల మొక్కల నర్సరీలు స్థాపించి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారంటే ప్రస్తుత పరిస్థితి ని అర్ధం చేసుకోవచ్చు.
ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభిస్తే పట్టభద్రుల డిమాండ్ మరింత
సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఔషద మొక్కల పెంపకం కూడా ఊపందుకొంది. వివిధ ప్రైవేటు కంపెనీల వారు వేల ఎకరాల్లో ఇటువంటి పంటలు సాగు చేస్తున్నారు. అమెరికా లాంటి దేశాల్లో మొక్కజొన్న పంట నుండి బయో డీజిల్ (జీవ ఇంధనం – ఇథనాల్) ను తయారు చేస్తున్నారు. వచ్చే రోజుల్లో మన దేశం లో కూడా మొక్కజొన్న విస్తృతం గా పండించే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి అన్ని రంగాలలో అత్యధిక డిమాండ్ ఉన్నది వ్యవసాయ పట్టభద్రులకే. ఎక్కువ
ప్రభుత్వ ఉద్యోగాలూ ఉన్నాయి (BSc Agriculture Course)
ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వ్యవసాయ పట్టభద్రులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి మండలానికి వ్యవసాయాధికారి పోస్టులు, అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ అధికారుల పోస్టుల రిక్రూట్ మెంట్ చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాలలో కూడా చాలా మంది గ్రామ వ్యవసాయ సహాయకులు గా ఉద్యోగాలు పొందారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలలో టీచింగ్ అసోసియేట్ లు గా ఉద్యోగాలు పొందారు చాలా మంది. వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో కాంట్రాక్టు పధ్ధతి లో కూడా రీసెర్చ్ అసోసియేట్ లు గా ఉద్యోగాలు చేస్తున్నారు. బ్యాంకు పరీక్షలు రాసి ఫీల్డు ఆఫీసర్లు గా బ్యాంకు మేనేజర్లు గా అనేక మంది ఉద్యోగాలు పొందుతున్నారు. వాటర్ షెడ్ పధకాలలో కూడా అనేక మంది వ్యవసాయ పట్టభద్రులు ఉద్యోగాలు పొందుతున్నారు.(BSc Agriculture Course)
కొత్త వ్యవసాయ కళాశాలలు స్థాపించాలి (BSc Agriculture Course)
మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి .. అనేక వ్యవసాయాధారిత పరిశ్రమలు స్థాపించ బడ్డాయి.. ఇక ముందు కూడా స్థాపించబడతాయి .. ఈ రంగాలన్నింటి లో వ్యవసాయ పట్టభద్రుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇంత డిమాండ్ ఉన్న కోర్సులు చదువుకోవడానికి సరైన అవకాశాలు లేకపోవడం దురదృష్టకరం. ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుండి కొన్ని వేలమంది విద్యార్దులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకొంటున్నారు. చివరకు ఐకార్ గుర్తింపు లేని కాలేజీలలో కూడా చదువుకుంటున్నారు. డిమాండ్ కు సరిపడా వ్యవసాయ కాలేజీలు స్థాపించి విద్యార్దులు స్వంత రాష్ట్రం లోనే ఐకార్ గుర్తింపు పొందిన నాణ్యమైన విద్య అందిస్తే మరింత మంది చదువు కోవడానికి అవకాశం కుదురుతుంది. లేకపోతే సందు కొక ప్రైవేటు వ్యవసాయ కళాశాల పెట్టి ఐకార్ గుర్తింపులేని, నాణ్యత లేని విద్య అందిస్తూ వ్యవసాయ విద్యార్దుల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇటువంటి కళాశాలలను నియంత్రిచడం చాలా అవసరం.(BSc Agriculture Course)
మనిషికి ఆకలి ఉన్నంత వరకు వ్యవసాయం ఉంటుంది
ఏది ఏమైనప్పటికీ.. మనిషికి ఉన్నంత వరకు… మనిషికి ఆకలి ఉన్నంత వరకు .. వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయ నిపుణుల అవసరం ఉంటుంది. ప్రపంచం లోని అన్ని రంగాలు స్తంబించినా .. పని చేస్తూనే ఉండాల్సిన రంగం వ్యవసాయ రంగం. మనం బ్రతకాలంటే తినాలి.. తినాలంటే తిండి గింజలు ఉండాలి.. తిండి గింజలు ఉండాలంటే పంటలు పండించాలి. అంటే వ్యవసాయం ఉండాలి. అందుకే మనిషికి ఆకలి ఉన్నంత వరకు వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయ రంగ నిపుణుల ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అందుకే బిఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు అంత డిమాండ్…!!
PS : వ్యవసాయ పట్టభద్రులు అంటే BSc Agriculture, BSc Horticulture, BSc Agri Engineering వారు అందరూ గా భావించాలి
-Vijay Kumar Bomidi, Director, Vijay Kumar Agri Academy, Salur 8125443163
Nice sir 👏🏻👏🏻😊
thank you andi Begum garu