Cervical Cancer – గర్భాశయ ముఖద్వార కేన్సర్ గురించి తెలుసుకోండి..
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) అనే వైరస్ ఈ కేన్సర్ రావడానికి ప్రధాన కారణం. లైంగిక సంపర్కం ద్వారా ఈ వైరస్ ఒకరి మరొకరికి వ్యాపిస్తుంది. మహిళలలో ఎక్కువగా ఇటువంటి వైరస్ లు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మందిలో వయసు పెరుగుతున్న కొద్దీ ప్రమాదకర వైరస్ ల ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. కాని నిరోధకత తక్కువ ఉండే మహిళలలో ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.
ముంచుకొస్తున్న మహమ్మారి – గర్భాశయ ముఖద్వార కేన్సర్ (సర్వికల్ కేన్సర్) – కొన్ని ముఖ్య విషయాలు Cervical Cancer
ప్రస్తుత వేగవంతమైన జీవన విధానం లో గతం లో ఎప్పుడూ వినని అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు గురించి రోజూ మనం వింటున్నాం.. చూస్తున్నాం. అటువంటి వాటిలో కేన్సర్లు ఒకటి.. ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం వరకు కేన్సర్ మరణాల గురించి అంతగా వినిపించేది కాదు. కాన్సర్ కు సరైన చికిత్సా విధానం అందుబాటు లో లేనప్పటికీ ప్రజల జీవన విధానం బాగుండేది. ఆరోగ్యం పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకొనే వారు.. అందుకే ఇటువంటి మరణాలు అరుదుగా చూసే వాళ్ళం.(Cervical Cancer)
ప్రస్తుత జీవన విధానం లో ఆరోగ్యానికి కీడు చేసే అలవాట్లు ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయాయి. ప్రాణాంతకమైన వ్యాధులు రావచ్చు అనే స్పృహ ఉన్నప్పటికీ జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలనే ఉద్దేశ్యం తో ఎటువంటి ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఫలితం గా చిన్న వయసులోనే అనేక ప్రాణాంతక వ్యాదులు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యం పరం గా గొప్ప సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఎప్పుడు ఎవరికీ క్యాన్సర్ సోకుతుందో తెలీదు. ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించినా కేన్సర్ ఏమో అని అనుమానించే పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి.
అయితే మహిళలలో ఇప్పుడు ఎక్కువగా వ్యాపిస్తున్న వ్యాధి ‘గర్భాశయ ముఖద్వార కేన్సర్’. దీనినే సర్వికల్ కేన్సర్ అంటారు. ఈ కేన్సర్ కు ఉన్న ఒక మంచి లక్షణం ఏమిటంటే దీనిని చాలా ముందుగానే పసిగట్టవచ్చు. ఇతర ఏ కేన్సర్ లలోనూ ఇలా ఉండదు. అయితే ఈ వ్యాధిని చాలా ముందుగానే కనిపెట్టే టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ మహిళలకు సరైన అవగాహన ఉండటం లేదు. భారత దేశ జనాభా లో గ్రామీణ ప్రాంతాలలో నివసించే మహిళల జనాభా చాలా ఎక్కువ ఉంటుంది. వారిలో ఇటువంటి వ్యాధుల పట్ల సరైన అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు.
గర్భాశయం ముఖద్వార కేన్సర్ (సర్వికల్ కేన్సర్ ) అంటే ఏమిటి ?
గర్భాశయ ముఖ ద్వారాన్ని సర్విక్స్ అంటారు. ఈ గర్భాశయ ముఖ ద్వారం యొక్క కణజాలం పై వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. తొలి దశలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు కేన్సర్ ప్రారంభం అయినట్లు భావించాలి. అయితే ఈ వ్యాధి సోకిన తర్వాత పై లక్షణాలు కనిపించడానికి దాదాపు పదేళ్ళు పట్టవచ్చు.
అసలు ఈ వ్యాధి ఎలా ప్రారంభం అవుతుంది…?
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) అనే వైరస్ ఈ కేన్సర్ రావడానికి ప్రధాన కారణం. లైంగిక సంపర్కం ద్వారా ఈ వైరస్ ఒకరి మరొకరికి వ్యాపిస్తుంది. మహిళలలో ఎక్కువగా ఇటువంటి వైరస్ లు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మందిలో వయసు పెరుగుతున్న కొద్దీ ప్రమాదకర వైరస్ ల ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. కాని నిరోధకత తక్కువ ఉండే మహిళలలో ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ హెచ్.పి.వి వైరస్ వలన సోకే ఇన్ఫెక్షన్ చివరకు కేన్సర్ కు దారి తీస్తుందని కనుగొన్నారు. ఈ వైరస్ వలన దీర్ఘకాలిక ఇన్ ఫెక్షన్ ప్రభావానికి గురైన మహిళల్లో ఈ కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ .
ఈ వైరస్ ఎలా సోకుతుంది ?(Cervical Cancer)
ఎక్కువ మంది తో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం, చిన్న వయసులో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం, పోషకాహారం సరిగ్గా తీసుకోలేక పోవడం, జననాంగాల పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం, ధూమ పానం, ఇతర లైంగిక వ్యాధులు ఉండటం, రోగ నిరోధకత సరిగ్గా లేకపోవడం వంటి అనేక కారణాల వలన ఈ వైరస్ వ్యాపిస్తుంది. ముఖ్యం గా లైంగిక సంపర్కం ద్వారా ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.(Cervical Cancer)
పదేళ్లకు ముందే ఈ వ్యాధి ని గుర్తించవచ్చు…
గర్భాశయ ముఖద్వారం పై HPV వైరస్ కొన్ని వ్యాధి లక్షణాలను ప్రదర్శిస్తుంది. మొదటి దశ లక్షణాలను ప్రీ కాన్సర్ దశ అంటారు. వ్యాధి లక్షణాలు మరింత ఎక్కువగా కనిపించే దశ లు కూడా ఉంటాయి. ప్రీ క్యాన్సర్ దశ లో వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. తర్వాతి దశల్లో వ్యాధి లక్షణాలను కొంత వరకూ నయం చేయవచ్చు. వైరస్ వలన వచ్చే ఈ వ్యాధి లక్షణాలు కేన్సర్ కు పునాది వేస్తాయి. అయితే ఈ లక్షణాలు కనిపించినపుడే చికిత్స తీసుకొంటే కేన్సర్ వచ్చే అవకాశం ఉండదు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే… వైరస్ వ్యాధి లక్షణాలు కనిపించిన దాదాపు పదేళ్ళ తరవాత కేన్సర్ గా రూపాంతరం చెందుతుంది. అంటే HPV సోకి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకొంటే కాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు శూన్యం..
కేన్సర్ ను నిర్ధారించే పరీక్షలు ఏమిటి?
కేన్సర్ ను నిర్ధారించడానికి పాప్ స్మియర్ (PAP Smear) పరీక్ష, Visual Inspection with Acetic Acid test (VIA test), Hybrid Capture II పరీక్ష పరీక్షలు చేస్తారు.(Cervical Cancer)
ఈ వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స ఉందా..?
కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత ఏ దశలో ఉన్నదో దానిని బట్టి చికిత్స ఉంటుంది. తొలి దశలలో కేన్సర్ ను పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. తర్వాతి దశలలో కొంత వరకు నివారించ వచ్చు. తీవ్రత బాగా ఎక్కువ అయ్యే కొద్దీ చికిత్స చేసినా ఫలితం ఉండదు. కొన్ని సార్లు గర్భాశయ ముఖ ద్వారాన్ని, గర్భసంచిని తొలగించడం ద్వారా ఈ కేన్సర్ ను పూర్తిగా అదుపు చేస్తారు. నాల్గవ దశకు చేరుకున్నపుడు మాత్రం ఉపశమనం కలిగించే కీమో థెరపీ , రేడియేషన్ వంటివి చేస్తారు తప్ప ప్రాణాలు కాపాడలేరు..
ముందుగానే పరీక్షలు చేయించు కోవాలా..?(Cervical Cancer)
అవును.. 35 ఏళ్ళు దాటిన మహిళలు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. పాప్ స్మియర్ పరీక్ష చేయించు కోవడం ద్వారా ఈ వ్యాధి లక్షణాలు కనిపెట్టవచ్చు. మూడేళ్ళకు ఒకసారి ఈ పరీక్ష చేయించు కోవడం కూడా చాలా అవసరం. ఈ పరీక్ష చేయించు కోవడం ద్వారా 40 – 50 % క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ పాప్ స్మియర్ పరీక్ష అందుబాటు లో లేకపోతే HPV వైరస్ కి సంబంధించిన PCR పరీక్ష అయినా చేయించుకోవాలి. దీనివలన వైరస్ ఉదృతి తెలుస్తుంది. ప్రమాదకర వైరస్ ల సాంద్రత ఎక్కువ ఉన్నట్టు తేలితే అప్పుడు తప్పకుండా పాప్ స్మియర్ వంటి పరీక్షలు అవసరం.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టీకాలు ఎవరికి వేస్తారు ?
9 నుండి 15 ఏళ్ళ వయసు గల అమ్మాయిలకు ఈ టీకాలు వేస్తారు. ఈ వయసులో అమ్మాయిలకు టీకాలు ఇవ్వడం వలన వారిలో యాంటీ బాడీలు బాగా తయారవుతాయి. ఈ వయసు దాటిన వారిలో యాంటీ బాడీల ఉత్పత్తి అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి ఈ వయసు లో ఉన్న బాలికలకు ఈ టీకాలు వేయించ డాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చెప్పారు. ఈ వాక్సిన్ లను ప్రభుత్వమే వేయించే ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
అబ్బాయిలకు కూడా ఈ వాక్సిన్ అవసరమా..?
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) అబ్బాయిలకు కూడా సోకుతుంది. కాబట్టి వారిలో కూడా క్యాన్సర్ లక్షణాలు కనిపించవచ్చు… అందుచేత 11 – 12 ఏళ్ళ మధ్యలో ఉన్న బాలురకు ఈ వ్యాక్సిన్ వేయించడం తప్పనిసరి..
మనదేశం లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లు ఏమిటి?(Cervical Cancer)
మన దేశం లో గర్డాసిల్ అనే క్వాడ్రివాలెంట్ వాక్సిన్, సెర్వారిక్స్ అనే పేరు తో లభ్యమయ్యే బైవలెంట్ వ్యాక్సిన్ అందుబాటు లో ఉన్నాయి. ఈ రెండు వ్యాక్సిన్ లను రీ కాంబినెంట్ DNA టెక్నాలజీ తో అభివృద్ధి చేసారు. అయితే ఈ వ్యాక్సిన్ ల ఖరీదు ఎక్కువగా ఉండటం వలన పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే స్వయం గా ఈ వాక్సిన్ లను ఉచితం గా అందించ డానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి 9-15 ఏళ్ళ లోపు బాలికలకు బాలురకు ఈ వాక్సిన్ తీసుకొనే విధం గా ప్రోత్సహించాలి.
ప్రస్తుత కర్తవ్యం ఏమిటి?
ఈ మహమ్మారి కేన్సర్ గురించి అవగాహన కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. జననాంగాల పరిశుభ్రత గురించి వారికి తరచూ బోధించాలి. 9 – 15 ఏళ్ళ లోపు బాలికలకు ఈ అంశాల పై పూర్తి పరిజ్ఞానం అందించాలి. ముఖ్యం గా ఈ వైరస్ రాకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తరగతుల్లో వారికి ప్రత్యేకం గా బోధించాలి. వేక్సిన్ వేసుకోవడం అనేది చిట్ట చివర గా తీసుకొనే ఒక రక్షణ చర్య గా భావించాలి. వీలైనంత వరకు వ్యక్తిగత శుభ్రత, సురక్షితం కాని లైంగిక సంబంధాలు, ధూమ పానం వంటి వాటిపై గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు ముఖ్యం గా 35 ఏళ్ల వారికి అవగాహన కల్పించాలి. మూడేళ్ళ కు ఒకసారి ముందస్తు టెస్టులు చేసుకొనేలా వారిని ప్రోత్సహించాలి.