DEEPSEEK vs ChatGPT |డీప్ సీక్ వలన లక్షల కోట్లు నష్టపోయిన అమెరికా| అసలు ఏమైందంటే
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా, పూర్తి ఉచితం గా ఒక యాప్ వస్తోంది అంటే ఎవరు వద్దనుకుంటారు? తమ వ్యాపార ప్రయోజనాలు దెబ్బ తింటాయని భయపడే AI సంస్థలు తప్పనిసరిగా ఏవో కుట్రలు చేసి డీప్ సీక్ ను నిలువరించ డానికే చూస్తాయి. ఈ క్రమం లో డీప్ సీక్ కూడా అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొనవలసి ఉంటుంది. వీటన్నిటినీ తట్టుకొని డీప్ సీక్ మనగలుగుతుందా అనేది ప్రశ్నార్ధకమే…!

DEEPSEEK vs ChatGPT
DEEPSEEK vs ChatGPT |డీప్ సీక్ వలన లక్షల కోట్లు నష్టపోయిన అమెరికా|అసలు ఏమైందంటే
అమెరికా లో కాలిఫోర్నియా కార్చిచ్చు లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఇంకా ఆ కార్చిచ్చు రేపిన మంటలు ఆరనే లేదు. ఈ సారి డీప్ సీక్ రూపం లో మళ్ళీ లక్షల కోట్ల రూపాయల నష్టం. కాలిఫోర్నియా కార్చిచ్చు వలన కలిగిన నష్టానికి రెండింతలు నష్టం..స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సంపన్న దేశం అయినప్పటికీ డీప్ సీక్ దెబ్బకు చిగురుటాకులా వణికి పోయింది అమెరికా.. DEEPSEEK vs ChatGPT
డీప్ సీక్ .. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం గా సంచలనం గా మారిన పేరు. AI రంగం లో అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టిన ఒకే ఒక పేరు డీప్ సీక్. కేవలం 51 కోట్ల రూపాయలతో రూపొందించిన ఒక చిన్న AI టూల్ 51 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని కల్గిస్తుందని అమెరికా ఎప్పుడూ అనుకొని ఉండదు. డీప్ సీక్ రాకతో ఎన్విడియా కంపెనీ అత్యధికంగా 17 శాతం నష్టాలను చవి చూసింది. రెండేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన చాట్ జీపీటీ ఉనికి కూడా ప్రశ్నార్ధకం అయిపోయింది ఇప్పుడు … ఎక్కడో చైనా లో ప్రారంభమైన చిన్న కంపెనీ అమెరికా ఆర్దిక పునాదులనే కదిలించి వేసినంత పని చేసింది. అసలు ఏం జరిగింది?
అసలు చాట్ జీపీటీ అంటే ఏమిటో చూద్దాం
Open AI అనే మాతృ సంస్థ రూపొందించిన AI చాట్ బాట్ లేదా AI మోడల్ చాట్ జీపీటీ. నవంబర్ 2022 లో Open AI సంస్థ చాట్ జీపీటీ ని విడుదల చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగం లో ఒక గొప్ప మలుపు గా దీనిని భావించవచ్చు. చాట్ జీపీటీ ఒక సంచలనాన్నే సృష్టించింది. మనం ఏ సమాచారం కావాలని అడిగినా క్షణాల్లో మనకు అందించడం దీని ప్రత్యేకత. కంప్యూటర్ రంగం లో వారికి ఇదొక వరం గా మారింది. చివరికి స్కూల్స్, కాలేజీల్లో విద్యార్దులు కూడా దీనిని విరివి గా వాడటం మొదలు పెట్టారు. విద్యార్దులు తమ మెదడు ఉపయోగించి పనులు చేయకుండా చాట్ జీపీటీ ని అడిగి ఆన్సర్ల ను కాపీ చేస్తున్నారన్న కారణం తో కొన్ని యూనివర్సిటీ లలో దీనినే నిషేదించారు కూడా. కోడింగ్ కావచ్చు, ఏదైనా క్లిష్టమైన సమస్య కావచ్చు అన్నిటినీ పరిష్కరిస్తూ ఒక మనిషి లాగానే మనతో కలిసిపోయింది చాట్ జీపీటీ. ఈ చాట్ బాట్ విడుదల అయిన కొద్ది రోజులకు ఇతర సంస్థలు కూడా తమ AI మోడళ్లను విడుదల చేయడం ప్రారంభించాయి. మెటా AI, లామా, జెమినీ వంటి AI మోడల్స్ కూడా బాగానే సేవలు అందిస్తున్నాయి.
అయితే ఈ AI మోడల్స్ తయారుచేయడానికి అమెరికన్ కంపెనీలు మిలియన్లడాలర్ల ను ఖర్చు పెట్టాయి. శక్తి వంతమైన సెమీ కండక్టర్ చిప్ లను ఉపయోగించి ఈ టూల్స్ తయారు చేసారు. ఈ సెమీ కండక్టర్ లను Open AI కంపెనీ ఎన్విడియా NVIDIA కంపెనీ నుండి కొనుగోలు చేసింది. H-100, H-800 వంటి శక్తివంతమైన చిప్ లు తయారుచేయడం, AI కి భవిష్యత్తు ఉందని తెలియడం తో NVIDIA కంపెనీ తయారుచేసే సెమీ కండక్టర్ చిప్ లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దాంతో కంపెనీ అమెరికా లోని టాప్ -10 కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. DEEPSEEK vs ChatGPT
మిలియన్ డాలర్ల సొమ్ము వెచ్చించి తయారుచేసిన AI టూల్స్ అన్నీ ఉచితం గా ఇవ్వలేక పోయాయి అమెరికన్ కంపెనీలు. చాట్ జీపీటీ ని కొంచం ఉచితం గా ఉపయోగించ వచ్చు గానీ పూర్తి వెర్షన్ వాడాలంటే మాత్రం డబ్బు చెల్లించాల్సిందే. ఆ విధం గా ప్రజల దగ్గర నుండి ముక్కు పిండి మరీ డబ్బు వసూలు చేయడం ప్రారంభించాయి AI కంపెనీలు. సరిగ్గా ఇటువంటి సందర్భం లోనే పూర్తి ఉచితంగా దూసుకు వచ్చింది డీప్ సీక్.
డీప్ సీక్ ఎలా పుట్టుకొచ్చింది అంటే… (DEEPSEEK vs ChatGPT)
డీప్ సీక్ అనేది చైనా లో తయారు చేయబడిన ఒక AI చాట్ బాట్. ప్రస్తుతానికి పూర్తి ఉచితం గా అందుబాటులో ఉన్న ఈ AI మోడల్ ప్రపంచ వ్యాప్తం గా ప్రకంపనలు సృష్టించింది. దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ లియాంగ్ వెన్ ఫింగ్. ఆయనే దీని సృష్టి కర్త. ఈయన దక్షిణ చైనా ప్రాంతానికి చెందినవారు.గ్వాంగ్ డాంగ్ పట్టణం లో జన్మించారు. ఆయన తండ్రి ఒక ఉపాద్యాయుడు. ఝెజియాంగ్ ప్రావిన్స్ లో వెన్ ఫింగ్ చదువుకున్నారు. ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసారు. ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసారు. ఝెజియాంగ్ ప్రావిన్స్ లోనే చైనా టెక్ దిగ్గజాలు అనేక మంది విద్యాభాసం చేసారు. చైనా కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆలీ బాబా కూడా అక్కడే చదువుకున్నారు. ఇటువంటి బ్యాక్ గ్రౌండ్ లో చదువు కోవడం వల్లనే లియాంగ్ వెన్ ఫింగ్ కూడా ఏదైనా సాధించాలనే దృక్పథం తో ముందుకు అడుగులు వేసారు.
లియాంగ్ వెన్ ఫింగ్ చదువు పూర్తయిన వెంటనే వ్యాపార రంగం లోనికి అడుగుపెట్టారు. తన ఇద్దరు మిత్రులతో 2015 లో హై ఫ్లయిర్ అసెట్ మ్యానేజ్ మెంట్ అనే పేరుతో ఒక హెడ్జ్ ఫండ్ ను ఏర్పాటు చేసారు. అయితే ఈ వ్యాపారం అంత సులువేమీ కాదు. ట్రేడింగ్ లో అనేక వ్యూహాలు, అనేక సంక్లిష్టమైన ఆల్గా రిధమ్స్ ఉపయోగించి తమ వ్యాపారం లో విజయం సాధించారు. ఇద్దరు మిత్రులతో కలిసి వెన్ ఫింగ్ కేవలం ఆరేళ్ళ వ్యవధి లో 15 బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధించారు.
ఈ సందర్భం లో స్వంతం గా AI ప్రాజెక్టు స్థాపించాలన్న ఆలోచన కలిగింది. దానితో అప్పటికే సెమీ కండక్టర్ చిప్ ల తయారీ సంస్థ అయిన NVIDIA ను సంప్రదించారు. ఎన్విడియా సెమీ కండక్టర్ చిప్స్ వేల సంఖ్యలో కొనుగోలు చేసారు. అప్పటికి అమెరికా నుండి సెమీ కండక్టర్ లపై ఎటువంటి ఆంక్షలు లేకపోవడం తో ఆయన పని మరింత సులువైంది. ఇలా చిప్ లను సమకూర్చుకున్న తర్వాత ‘డీప్ సీక్’ అనే పేరుతో ఒక కొత్త స్టార్టప్ (అంకుర సంస్థ) ను ప్రారంభించారు. DEEPSEEK vs ChatGPT
ముందుగా DeepSeek coder, DeepSeek LLM, DeepSeek V3 వంటి AI మోడల్స్ విడుదల చేసుకుంటూ పోయారు. ఇవి అప్పటికే ఉన్న స్వదేశీ చైనా మోడల్స్ కంటే మెరుగ్గానే ఉండటం తో మరింత ఉత్సాహం గా ముందుకు దూసుకు పోయారు. డీప్ సీక్ R1 పేరుతో ఒక సంచలనాత్మక AI మోడల్ ను విడుదల చేసారు. ఓపెన్ ఏఐ సంస్థ విడుదల చేసిన చాట్ జీపీటీ -4 కి పోటీగానే ఈ రీజనింగ్ ఆధారిత R1 మోడల్ ను విడుదల చేసి ప్రపంచం మొత్తం నివ్వెర పోయేటట్లు చేసారు.
ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి అంటే…
కృత్రిమ మేథ (ఏఐ) ఆధారం గా చాట్ బాట్ ను తయారు చేయడానికి ప్రధానం గా కావలసినవి అధిక సామర్ద్యం (GPU) కలిగిన సెమీ కండక్టర్ చిప్ లు. తక్కువ సామర్ధ్యం కలిగిన చిప్ (H – 800) లను మూడేళ్ళ క్రిందటే ఎన్విడియా NVIDIA కంపెనీ దగ్గర కొనుగోలు చేసారు వెన్ ఫింగ్. వీరు తయారు చేయాలనుకున్న మోడల్ కు అధిక సామర్ధ్యం గల (H-100) సెమీ కండక్టర్ లు అవసరం అయ్యాయి. వాటిని చైనా కి ఎగుమతి చేయడాన్ని అమెరికా ప్రభుత్వం నిషేదించింది. దానితో తమ దగ్గర ఉన్న తక్కువ సామర్ధ్యం గల సెమీ కండక్టర్ లతోనే ఈ మోడల్ ను తయారుచేయాలని నిర్ణయించు కున్నారు. రివర్స్ ఇంజనీరింగ్ చేసారు. సెమీ కండక్టర్ చిప్ రహస్యాలను చేదించారు. తమకున్న పరిమితుల్లోనే అతి శక్తివంతమైన AI మోడల్ ను రూపొందించారు.
ఈ చాట్ బాట్ ను కేవలం 51 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ యాప్ యొక్క ఇంటర్ ఫేస్ చాట్ జీపీటీ ఇంటర్ ఫేస్ మాదిరి గానే ఉంటుంది. చాట్ జీపీటీ లో మాదిరి గానే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. అయితే చాట్ జీపీటీ కంటే మరింత రీజనింగ్ గా సమాధానాలు ఇస్తుంది. అచ్చు మనిషి మాదిరి గానే సమాధానాలు ఇస్తోంది.
డీప్ సీక్ R1 యాప్ ను పూర్తి ఉచితం గానే విడుదల చేసారు. ఈ యాప్ విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఆపిల్ ప్లే స్టోర్ లో, గూగుల్ ప్లే స్టోర్ లో అత్యధిక శాతం మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ముఖ్యం గా అమెరికాలోని యువత ఈ యాప్ ను అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకున్నారు.
అమెరికన్ కంపెనీలు ఎందుకు నష్టపోయాయి అంటే….
అతి తక్కువ పెట్టుబడి తో అతి శక్తివంతమైన AI టూల్ తయారు చేసి ఉచితం గా అందించడం తో ప్రపంచ వ్యాప్తం గా కోట్లాది మంది డౌన్ లోడ్ లు చేసుకున్నారు. దీనితో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి రూపొందించిన అమెరికన్ AI మోడల్స్ అయిన చాట్ జీపీటీ, మెటా AI, గూగుల్ జెమిని వంటి వాటి పరిస్థితి ఆగమ్య గోచరం గా తయారైంది. ఈ AI చాట్ బాట్ ల పరిస్థితి ప్రశ్నార్ధకం అని ఎప్పుడైతే అనుమానం మొదలైందో ఆయా సంస్థల్లో తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు ఇన్వెస్టర్లు. AI మోడల్స్ తయారీ కి ఉపయోగించే సెమీ కండక్టర్ల ను తయారు చేసే ఇన్విడియా INVIDIA కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఒక్కరోజులో దాదాపు 17 శాతం షేర్లు పతనం అయ్యాయి. ఎన్విడియా కంపెనీ తీవ్రం గా నష్టపోయింది.
అత్యంత ఖరీదైన సెమీ కండక్టర్ చిప్ లేకుండానే అత్యంత ప్రజాదరణ పొందిన AI మోడల్ తయారు చేయవచ్చు అని చైనా నిరూపించింది. కాబట్టి భవిష్యత్తు లో వచ్చే AI ఉత్పత్తులు అన్నీ డీప్ సీక్ మాదిరిగానే తక్కువ వనరులతో రూపొందే అవకాశం ఉంది. కాబట్టి ఎన్విడియా అందించే చిప్స్ కి అంత డిమాండ్ ఉండదు కాబట్టి ఆ కంపెనీ లో పెట్టుబడులు పెట్టడం అంత శ్రేయస్కరం కాదు అని ఇన్వెస్టర్లు భావించడం తోనే ఎన్విడియా కంపెనీ భారీగా నష్టపోయింది. అలాగే ఇతర కంపెనీలు కూడా భారీగా నష్టపోయాయి. DEEPSEEK vs ChatGPT
డీప్ సీక్ అమెరికా ను కోలుకోలేని దెబ్బ తీసినందున వచ్చే రోజుల్లో దౌత్య పరమైన అనేక అడ్డంకులను చైనా ఎదుర్కోవచ్చు. ఇప్పటికే డీప్ సీక్ పై సైబర్ దాడులు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా నో, అంతర్గత సమాచారాన్ని సేకరిస్తున్నరన్న కారణం తోనో అమెరికా డీప్ సీక్ ను నిషేదించినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. దీనికి టిక్ టాక్ నే ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. మన దేశం ఏనాడో టిక్ టాక్ ను నిషేదించింది. త్వరలోనే అమెరికా కూడా నిషేదించ బోతోంది. ఈ బాటలోనే డీప్ సీక్ ను నిషేదించినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. అలాగే అమెరికా అనుకూల దేశాలలో కూడా ఈ చాట్ బాట్ ను నిలువరించ వచ్చు.
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా, పూర్తి ఉచితం గా ఒక యాప్ వస్తోంది అంటే ఎవరు వద్దనుకుంటారు? తమ వ్యాపార ప్రయోజనాలు దెబ్బ తింటాయని భయపడే AI సంస్థలు తప్పనిసరిగా ఏవో కుట్రలు చేసి డీప్ సీక్ ను నిలువరించ డానికే చూస్తాయి. ఈ క్రమం లో డీప్ సీక్ కూడా అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొనవలసి ఉంటుంది. వీటన్నిటినీ తట్టుకొని డీప్ సీక్ మనగలుగుతుందా అనేది ప్రశ్నార్ధకమే…!