Hug Day Valentine Week – రా హత్తుకుందాం… ఒక్కటయ్యేలా….
రా… హత్తుకుందాం…వర్ణించాలంటే భూమ్మీద పదాలు సరిపోకూడదు….
రా… హత్తుకుందాం….గుర్తుచేసుకోవాలంటే ఆ చిన్ని జ్ఞాపకమే ఒక యుగమంత ఉండాలి…
Hug Day Valentine Week – రా హత్తు కుందాం… ఒక్కటయ్యేలా…
“హత్తుకోవాలంటే… రెండు చేతులు ఉన్నవాళ్లకే సాధ్యమా…”(Hug Day Valentine Week)
“అలా ఏం కాదు … రెండు హృదయాలు కావాలి …”
“రెండు మనస్సులు ఉంటే సరిపోదా ..”
“అబ్బా… రెండు హృదయాలన్నా.. రెండు మనసులన్నా దాదాపు ఒకటే….”
“రెండు గుండెలు అన్నా కూడా అదే అర్ధమా….”
“అవును.. అవును… అవును…”
“సరే.. సరే… లెక్క వేద్దాం… రెండు చేతులు, రెండు హృదయాలు, రెండు మనసులు, రెండు గుండెలు …. ఏవైతేనేం మొత్తానికి ఎనిమిది అంశాలు అవసరం అన్నమాట ..”(Hug Day Valentine Week)
“నీ లెక్క కొంచం ఏడ్చినట్టే ఉంది… నేనో లెక్క చెప్తా విను….”
“చెప్పు.. చెప్పు… నీతో చెప్పించాలనే ఇంత రాద్దాంతం చేశా… క్షణం కూడా ఆలస్యం లేకుండా చెప్పు ….”
“చంద్రుడు భూమి చుట్టూ , భూమి సూర్యుని చుట్టూ… తేనెటీగలు పుష్పాల చుట్టూ , లేలేత మంచు బిందువులు సన్నని గరిక పోచల చుట్టూ.. పగలూ రాత్రీ ఒకదాని చుట్టూ మరొకటి… పౌర్ణమి అమావాస్యా ఒకదాని చుట్టూ మరొకటి… తూర్పు చుట్టూ పడమర.. పడమర చుట్టూ తూర్పు… తిరుగుతూనే ఉంటున్నాయి కదా… చివరికి మట్టి రేణువులు – వర్షపు చినుకులు, అంతెందుకు… వెన్నెల లాంటి నీ చుట్టూ నేను.. నా చుట్టూ నువ్వు…తిరుగుతూనే ఉంటున్నాం కదా..
ఒక్క నీకూ నాకూ తప్ప .. పైన ఇప్పుడు చెప్పిన వేటికీ రెండు చేతులు లేవు …
కానీ వాటిని …. ప్రేమతో పెనవేసే రెండు అదృశ్య హృదయాలు ఉంటాయి
కానీ వాటిని …. వాత్సల్యం తో కట్టి పడేసే రెండు అదృశ్య మనసులు ఉంటాయి.
కానీ వాటిని ….. అంతులేని అనురాగంతో హత్తుకొనే రెండు అదృశ్య గుండెలు ఉంటాయి..
బహుశా .. అందుకేనేమో…. మరణం వెంటపడుతున్నా… జీవం విశ్వ విజేత గా తలెగరేస్తుంది…
బహుశా… అందుకేనేమో… ప్రపంచ కన్నీటిని కొలిచే రెండు కనురెప్పల మధ్య విశ్వం ఒదిగిపోయి ఉంటుంది…
బహుశా అందుకేనేమో…. ప్రపంచ దుఃఖం మునిపంట నొక్కిపట్టే రెండు పెదవుల మధ్య శబ్దం ఇమిడి పోయి ఉంటుంది…
రా… హత్తుకుందాం…వర్ణించాలంటే భూమ్మీద పదాలు సరిపోకూడదు….
రా… హత్తుకుందాం….గుర్తుచేసుకోవాలంటే ఆ చిన్ని జ్ఞాపకమే ఒక యుగమంత ఉండాలి…
రా.. హత్తుకుందాం… ఇద్దరం ఒక్కటయ్యేలా .. హత్తుకుందాం… రా …