January 10, 2025

ICAR గుర్తింపు అవసరమా అగ్రి కాలేజీలకు | ICAR Accreditation for Agricultural Colleges

మెడిసిన్ చదివే వాళ్లకు మెడికల్ కౌన్సిల్ ఉంది. డెంటల్ డిగ్రీ చదివే వారికి డెంటల్ కౌన్సిల్ ఉంది. వెటర్నరీ వారికి వెటర్నరీ కౌన్సిల్ ఉంది. ఇంత డిమాండ్ కలిగిన అగ్రికల్చర్ కోర్సుకు మాత్రం చట్టబద్దమైన  అగ్రికల్చర్ కౌన్సిల్ లేదు. దేశ వ్యాప్తం గా ఉన్న వ్యవసాయ కళాశాలలను, వ్యవసాయ విద్యనూ క్రమబద్దీకరించే అగ్రికల్చర్ కౌన్సిల్ లేకపోవడం తో ICAR సంస్థ ఆ భాద్యతలను నిర్వహిస్తోంది.

ICAR accreditation for BSc Ag colleges

ICAR Accreditation for BSc Ag colleges pic credits: VK Agri Academy

ICAR గుర్తింపు అవసరమా అగ్రి కాలేజీలకు | ICAR Accreditation for Agricultural Colleges

Bsc Agriculture… ప్రస్తుతం విపరీతం గా డిమాండ్ ఉన్న కోర్సు ఇది. ఈ కోర్సు చేసిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటమే దీనికి కారణం. తెలుగు రాష్ట్రాలలో ఉన్న వ్యవసాయ కళాశాలలు సరిపోక ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకుంటున్నారు మన విద్యార్దులు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ కోర్సు పట్ల విద్యార్దులలో ముఖ్యం గా తల్లిదండ్రులలో బాగా అవగాహన పెరిగింది. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే కనీసం ఒక్కరినైనా ఏజీ బిఎస్సీ చదివించాలి అన్నంతగా ఈ కోర్సు గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారంటే పరిస్థితి ఏ విధం గా ఉన్నదో మనం అర్ధం చేసుకోవచ్చు.(ICAR Accreditation for Agricultural Colleges)

ఈ నేపధ్యం లో బిఎస్సీ అగ్రికల్చర్ కోర్సులు ఆఫర్ చేస్తున్న వివిధ కాలేజీల అధికార గుర్తింపు ప్రస్తుతం చాలా వివాదాస్పదం అవుతోంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం లోని ఇతర రాష్ట్రాలలో ఉన్నఅనేక  వ్యవసాయ కళాశాలలకు అధికార గుర్తింపులు లేవు. అయినప్పటికీ కోర్సుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా విద్యార్దులను జాయిన్ చేసుకొంటూ వారి భవిత ను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి ఈ అనధికారిక కళాశాలలు. ఈ వ్యాసం లో దేశ వ్యాప్తం గా ఉన్న వ్యవసాయ కళాశాలల గుర్తింపు కు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు గురించి పరిశీలన చేద్దాం.

అగ్రికల్చర్ కౌన్సిల్ లేదు – అదీ సమస్య 

మెడిసిన్ చదివే వాళ్లకు మెడికల్ కౌన్సిల్ ఉంది. డెంటల్ డిగ్రీ చదివే వారికి డెంటల్ కౌన్సిల్ ఉంది. వెటర్నరీ వారికి వెటర్నరీ కౌన్సిల్ ఉంది. ఇంత డిమాండ్ కలిగిన అగ్రికల్చర్ కోర్సుకు మాత్రం చట్టబద్దమైన  అగ్రికల్చర్ కౌన్సిల్ లేదు. దేశ వ్యాప్తం గా ఉన్న వ్యవసాయ కళాశాలలను, వ్యవసాయ విద్యనూ క్రమబద్దీకరించే అగ్రికల్చర్ కౌన్సిల్ లేకపోవడం తో ICAR సంస్థ ఆ భాద్యతలను నిర్వహిస్తోంది.

దేశం లోని వివిధ రాష్ట్రాల చట్టసభలలో అగ్రికల్చర్ కౌన్సిల్ అవసరం అంటూ చట్టం చేసి కేంద్రానికి పంపాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఈ కౌన్సిల్ కావాలంటూ అసెంబ్లీ లో చట్టం చేసి పంపింది. మరి కొన్ని రాష్ట్రాలు ఇదే పని చేస్తే అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పడటం అంత కష్టం కాదు.

వ్యవసాయ కళాశాలలకు ICAR Accreditation అవసరమా ..(ICAR Accreditation for Agricultural Colleges)

వ్యవసాయ కళాశాలలకు తప్పనిసరిగా ICAR – Indian Council of Agricultural Research  గుర్తింపు (Accreditation) అవసరం. ప్రతిపాదిత  యూనివర్సిటీ కి అవసరమైన మౌలిక సదుపాయాలు (infrastructure), అర్హులైన బోధనా సిబ్బంది ఉన్నారో లేదో పరిశీలిస్తారు. అన్నిటికంటే ముఖ్యం గా వ్యవసాయ యోగ్యమైన భూమి 60 నుండి 100 ఎకరాలు విద్యార్దుల ప్రాక్టికల్స్ కోసం అవసరం.

తరగతి గదులు, హాస్టళ్ళు, సిబ్బంది మొదలైనవి అందరూ చూపిస్తున్నారు గాని వ్యవసాయ భూమి చూపలేక పోతున్నారు. అందుకే వ్యవసాయ కళాశాలలకు ICAR Accreditation తప్పనిసరి చేసింది ప్రభుత్వం. పుట్టగొడుగుల్లా వీధి కొక్కటి గా పుట్టుకొస్తున్న వ్యవసాయ కళాశాలలను అదుపు చేయడానికి ప్రభుత్వం ఈ Accreditation నిబంధనలను తీసుకువచ్చింది.

ICAR Accreditation ఒకసారి లభిస్తే సరిపోతుందా ..?

చాలదు.. ICAR గుర్తింపు కు ఒక పరిధి ఉంటుంది.. మూడేళ్ళు, నాలుగేళ్ళు, ఐదేళ్ళు అలా. గుర్తింపు కాలం పూర్తి అయిపోతే మరలా ICAR కు అప్లయి చేసుకోవాలి. మళ్ళీ ప్రమాణాలు అన్నీ పరిశీలించి అన్నీ సవ్యం గా ఉంటే మరి కొంత కాలం గుర్తింపు పొడిగిస్తారు

సాధారణం గా  ఏదైనా డిగ్రీ  కళాశాల ప్రారంభించాలంటే మొదట UGC – University Grants Commission చేత గుర్తింపు పొంది ఉండాలి. అదే వ్యవసాయ కళాశాలలు అయితే UGC తో పాటు ICAR గుర్తింపు పొంది ఉండాలి.

అయితే దేశ వ్యాప్తం గా ఉన్న అనేక ప్రైవేటు కళాశాలలకు ఈ గుర్తింపులు లేవు. చాలా కాలేజీలకు UGC గుర్తింపు ఉంటుంది కానీ ICAR గుర్తింపు ఉండదు. కొన్ని కాలేజీలకు UGC గుర్తింపు కూడా ఉండదు.  ఇటువంటి కాలేజీలలో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలకు, పోస్టు గ్రాడ్యుయేషన్ చదవడానికి అవకాశం ఉండటం లేదు. కొన్ని  యూనివర్సిటీలు  ఒక రాష్ట్రం లో ఉండి దేశ వ్యాప్తం గా అనేక రాష్ట్రాలలో తమ స్టడీ సెంటర్ల ను తెరచి వాటినే  కాలేజీలు అని నమ్మిస్తున్నారు. స్టడీ సెంటర్ల లో చదివిన డిగ్రీలు చెల్లవంటూ గతం లో సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకున్న వారు లేరు. (ICAR Accreditation for Agricultural Colleges)

గుర్తింపు లేకపోయినప్పటికీ విద్యార్దులు ఎందుకు చేరుతున్నారు ?

అది విద్యార్దుల తప్పు కాదు. వివిధ ప్రైవేటు కాలేజీలు మాయ మాటలు చెప్పి విద్యార్దులను తమ కాలేజీలలో జాయిన్ చేసుకుంటున్నారు. అడ్మిషన్ చేసుకొనే ప్రతిసారీ ‘ఈ సంవత్సరం ICAR గుర్తింపు గ్యారంటీ’ అని చెప్పి మోసం చేస్తున్నారు. నాలుగేళ్ళు గడిచిపోయినా గాని గుర్తింపు రావడం లేదు. విద్యార్దులు ICAR గుర్తింపు లేని సర్టిఫికేట్ లతో బయటకు వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా కనీసం పై చదువు కూడా చదవడానికి లేకుండా పోతుంది. ఇలా మోసపోయిన వారు లక్షలలో ఉంటారంటే అతిశయోక్తి కాదు.

కాలేజీలకు గుర్తింపు ఉందా లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది?

ICAR సంస్థ యొక్క వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా తెలుసు కోవచ్చు. ప్రతి సంవత్సరం ఐకార్ సంస్థ చే గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, కాలేజీల వివరాలు వెబ్ సైట్ లో పొందు పరుస్తారు. https://accreditation.icar.gov.in/ అనే వెబ్ సైట్ ని సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు. ఆ కాలేజ్ లేదా యూనివర్సిటీ పేరు ఆ లిస్టు లో ఉంటే నిరభ్యంతరం గా ఆ కాలేజ్ లేదా యూనివర్సిటీ లో జాయిన్ కావచ్చు. ఆ లిస్టు లో పేరు లేదు అంటే ఐకార్ సంస్థ యొక్క గుర్తింపు లేనట్లే అని భావించాలి.

పేరెంట్స్ ని ఎలా మోసం చేస్తున్నారంటే ….

ఇతర రాష్ట్రాలలోని కొన్ని యూనివర్సిటీలు తమకు ICAR గుర్తింపు ఉందని కొన్ని తప్పుడు పత్రాలు విద్యార్దులకు చూపుతున్నాయి. ముందుగా ICAR సంస్థ కు తమ ఇనిస్టిట్యూట్ పేరు తో ఉత్తరాలు రాస్తారు. ICAR సంస్థ నుండి వారికి రిప్లయి వస్తుంది. అక్రిడిటేషన్ (గుర్తింపు) పొందడానికి అవసరమైన అర్హతలు ఉంటే తప్ప మీ యూనివర్సిటీ ని తనిఖీ చెయ్యడానికి రావడం కుదరదు అంటూ ఉంటుంది ఆ ఉత్తరం లో. ICAR ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన ఉత్తరం కాబట్టి ICAR లోగో తో పాటు సంబంధిత ఉన్నత అధికారి సంతకం కూడా ఉంటుంది.

సరిగ్గా ఇటువంటి ఉత్తరాలనే విద్యార్దుల తల్లిదండ్రులకు చూపి తమకు అతి త్వరలో గుర్తింపు వచ్చేస్తుందని మాయ మాటలు చెప్తున్నారు. ICAR సంస్థ నుండి వచ్చిన ఉత్తరమే కాబట్టి గుర్తింపు వస్తుందనే నమ్మకం తో అడ్మిషన్ తీసుకుంటున్నారు. కొద్దో గొప్పో తేడా తో దేశ వ్యాప్తం గా ఇదే దందా నడుస్తోంది.

 ప్రభుత్వ కాలేజీలకు ICAR గుర్తింపు ఉంటుందా…

ప్రభుత్వ వ్యవసాయ యూనివర్సిటీలు, కాలేజీలకు ICAR గుర్తింపు ఉంటుంది. ఒక కళాశాల స్థాపించాలని అనుకున్నపుడే అన్ని అవసరమైన ప్రమాణాలతో నిర్మాణం చేస్తారు కాబట్టి ICAR Accreditation వాటికి వెంటనే లభిస్తుంది. ప్రభుత్వ యూనివర్సిటీ లకు అనుబంధ (affiliated colleges) కళాశాలలు ప్రత్యేకం గా మరలా  ICAR గుర్తింపు పొందాలి. ప్రభుత్వ యూనివర్సిటీ ప్రైవేటు కాలేజీకి అఫిలియేషన్ ఇచ్చినపుడే అవసరమైన ప్రమాణాలు అన్నీ ఉన్నవో లేవో పరిశీలించి ఇస్తే ICAR గుర్తింపు పొందడం అంత పెద్ద విషయం ఏమీ కాదు.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి..?(ICAR Accreditation for Agricultural Colleges)

తెలుగు రాష్ట్రాలలో కూడా తామర తంపర గా ప్రైవేటు కాలేజీలు పుట్టుకొచ్చాయి. అన్ని ప్రధాన నగరాలతో పాటు పాత జిల్లా కేంద్రాలలో చాలా వరకూ ఈ కాలేజీలు నడుపుతున్నారు. ఇప్పటికే విద్యార్ధులను చేర్చుకున్న కొన్ని ప్రఖ్యాత యూనివర్సిటీ ల యాజమాన్యాలు ICAR గుర్తింపు కోసం తీవ్రం గా కృషి చేస్తున్నాయి. స్టడీ సెంటర్లు నడుపుతున్న వారు తమ మాతృ యూనివర్సిటీలకు విద్యార్దులను తీసుకు వెళ్లి పరీక్షలు రాయించి మళ్ళీ తీసుకు వస్తున్నారు.

అసలు విద్యార్దులను ఎలా చేరుకుంటారంటే….

ఇంటర్ బైపీసీ, వ్యవసాయ డిప్లొమా చదివిన విద్యార్దులు వీరి టార్గెట్ . సదరు విద్యార్దులు ఎంసెట్, అగ్రిసెట్ పరీక్షలకు అప్లయి చేసుకోవడం తో పాటే వారి ఫోన్ నంబర్లు, వారి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు సేకరిస్తారు. అనధికారికం గా ఫోన్ నంబర్ల సేకరణ మరొక దందా..! విద్యార్దుల వాట్సప్ గ్రూపులలోనికి విద్యార్ధి లా చొరబడి ఫోన్ నంబర్లు దొంగిలించడం మరొక పధ్ధతి.

ఫోన్లు చేస్తూనే ఉంటారు … (ICAR Accreditation for Agricultural Colleges)

ఇలా సేకరించిన నంబర్లకు ఫోన్లు చెయ్యడం మొదలు పెడతారు. EAPCET, AGRICET పరీక్షలు ఎలా రాసావు అంటూ ప్రేమ గా అడుగుతారు. నూటికి ఎనభై శాతం మంది విద్యార్దులు పరీక్ష సరిగ్గా రాయలేదనే చెప్తారు. ఆ పాయింట్ చాలు వాళ్లకి. తర్వాత పేరెంట్ కి కాల్ చేసి కౌన్సిలింగ్ చేస్తారు. రాసిన వేల మందిలో మీ అమ్మాయి/అబ్బాయి కి రాంక్ వచ్చే అవకాశమే లేదని వాళ్ళే తేల్చి చెప్పేస్తారు. పేరెంట్ కొంచం టైం కావాలి అనగానే …ఒకే సీటు మీకోసం ఉంచాం… ఒక ఐదు వేలు అడ్వాన్స్ గా కట్టమంటారు.. పోతే ఐదు వేలే కదా అని వెంటనే కట్టేస్తారు పేరెంట్స్… మరో వైపు ఇతర కాలేజీల వాళ్ళు కూడా రోజులో అనేక సార్లు కాల్ చేస్తుంటారు. చివరకు విసిగిపోయిన పేరెంట్స్ ICAR లేకపోయినా పరవాలేదులే అనుకోని వాళ్ళ ట్రాప్ లో చిక్కుకొంటారు.

గ్రామీణ ప్రాంత విద్యార్దులే గురి (ICAR Accreditation for Agricultural Colleges)

గ్రామీణ ప్రాంతాలలో అవగాహన లేని రైతు కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్దులు  సులువుగా వీరి వలలో చిక్కుకుంటారు. అంతే కాకుండా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం మోసపోతుంటారు. ప్రక్కన రెండు కిలోమీటర్ల దూరం లోని కాలేజ్ కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని ఒకటికి పదిసార్లు ఎదురు చూస్తుంటారు తల్లిదండ్రులు. అలాంటిది ఈ ఫోన్ల ధాటికి తట్టుకోలేక ఆగ్రా, ఢిల్లీ, డెహ్రాడూన్ వంటి దూర ప్రాంతాలకు సైతం అమ్మాయిలను ఒంటరిగా పంపేస్తుంటారు. వాళ్ళుకు  ఆయా కాలేజీ లలో మంచి మిత్రులు దొరికితే చక్కగా చదువుకొని వచ్చేస్తారు. తల్లిదండ్రులకు దూరం గా ఉంటూ అనేక చెడు వ్యసనాలకు బానిసలైన అనేకమంది బాలుర సంగతి మరీ విషాదకరం.

తల్లిదండ్రుల “అతి” కూడా ప్రధాన కారణం 

‘ఏజీ బిఎస్సీ చదివి తీరాల్సిందే ‘ అంటూ విద్యార్దులకు లక్ష్యాన్ని బలంగా రుద్దే తల్లిదండ్రులు ఎంట్రెన్స్ పరీక్షల్లో సరైన రాంక్ రాకపోతే ఈ గుర్తింపు లేని కాలేజీల చుట్టూ తిరగడం, వాళ్ళు అడిగినంత డబ్బు పోసి పిల్లల్ని అందులో జాయిన్ చెయ్యడం, ఆ తర్వాత లబోదిబో మనడం చూస్తూనే ఉన్నాం.  పిల్లలకు ఒకటి లేదా రెండు అవకాశాలు ఇచ్చి అప్పుడు ఏదైనా గుర్తింపు ఉన్న కాలేజీ లో జాయిన్ చేస్తే బాగుంటుంది.

ICAR Accreditation సమస్య కు పరిష్కారం ఏమిటంటే…

  • తమ పిల్లల్ని admit చేసే ముందు ఆయా కాలేజీలు/ యూనివర్సిటీ లకు గుర్తింపు ఉందో లేదో ICAR సంస్థ యొక్క వెబ్ సైట్ ను సందర్శించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి.
  • non-ICAR కళాశాలలపై ప్రభుత్వం నిఘా ఉంచాలి.
  • అన్నిటికంటే ముఖ్యం గా…. అగ్రికల్చర్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలి. దానితో ఈ సమస్య కు పరిష్కారం లభిస్తుంది.
  • ఇప్పటికే non-ICAR కాలేజీ లలో చదివిన విద్యార్దులకు ప్రత్యేక ఉమ్మడి పరీక్ష నిర్వహించి పరీక్ష పాసైన వారికి ICAR విద్యార్దులకు మాదిరి అవకాశాలు కల్పించాలి (విదేశాలలో MBBS చదివిన వారికి పరీక్ష పెట్టినట్టు)
  • దేశవ్యాప్తం గా చదువు ముగించి బయటకు వచ్చే వ్యవసాయ పట్టభద్రులకు సీరియల్ నెంబర్ కేటాయించాలి. ఈ ప్రతిపాదనలన్నీ అనేక సంవత్సరాలుగా చర్చకు నోచుకుంటున్నవే తప్ప ఆచరణ లోనికి రావడం లేదు.
  • ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల స్థాపన మరింత గా జరగాలి.
  • వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యత ను గుర్తించి ఇటువంటి చట్టాలు చేయడం ద్వారా విద్యార్దుల వలసలు తగ్గుతాయి.

ఇటువంటి చర్యలు తీసుకున్నపుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కనీస గుర్తింపు లేని కాలేజీలు/యూనివర్సిటీల స్థాపన తగ్గుతుంది. విద్యార్దులు తమ విలువైన కాలాన్ని వృధాగా కోల్పోకుండా వ్యవసాయాభివృద్ధి కి కృషి చేస్తారనడం లో ఎటువంటి సందేహం లేదు.

-విజయ్ కుమార్ బోమిడి, డైరెక్టర్, VK అగ్రి అకాడమీ, 8125443163

(ఇప్పటికే non-ICAR కాలేజీల్లో చదివి డిగ్రీలు పొందిన వారు, చదువుతున్న వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదుపరి వ్యాసం లో వివరించడం జరుగుతుంది)

2 thoughts on “ICAR గుర్తింపు అవసరమా అగ్రి కాలేజీలకు | ICAR Accreditation for Agricultural Colleges

Comments are closed.