India Maldives dispute-భారత్ కు మాల్దీవులకు మధ్య వివాదం ఏమిటి ?
భారత్ కు మాల్దీవులకు మధ్య వివాదం ఏమిటి ?
భారత్ కు మాల్దీవులకు మధ్య వివాదం ఏమిటి? రెండు మిత్ర దేశాల మధ్య ఎందుకు వివాదం వచ్చింది?India Maldives dispute boycott Maldives
హిందూ మహాసముద్రం లో వెయ్యి కి పైగా దీవుల సముదాయం మాల్దీవులు .. ఆహ్లాదకరమైన సముద్ర తీరం గల దేశం. భారత దేశ ప్రజలు అమితం గా ఇష్టపడే దేశాలలో ఒకటి మాల్దీవులు.. చాలా మంది ఈ దేశాన్ని భారత దేశం లోని భాగమే అనుకుంటారు.. కాదు…. ఇది ఒక ప్రజాస్వామ్య స్వతంత్ర దేశం. లక్ష దీవులకు 700 కిలోమీటర్ల లోనూ, మన భూభాగానికి 1200 కిలోమీటర్ల దూరం లో ఉండే దేశం ఇది. పూర్తిగా టూరిజం పై ఆధారపడి ఉన్న దేశం ఇది. మన దేశం తో మంచి సంబంధాలను కలిగి ఉన్న ఒక మిత్ర దేశం మాల్దీవులు.
చక్కటి ప్రకృతి అందాలను కలిగిన పర్యాటక దేశం గా మాల్దీవులు ఇతర దేశాల పర్యాటకులను ఆకర్షిస్తోంది. దానిలో సింహ భాగం మన భారతీయులే ఆ దేశ అందాలను వీక్షించి వస్తున్నారు.
ప్రధాని మోడీ లక్ష దీవులకు ఎందుకు వెళ్ళారు? అసలు వివాదం ఏమిటి?
మాల్దీవుల అధ్యక్షుడు ముయుజ్జూ గత నవంబర్ లో తమ దేశం నుండి భారత దళాలు వెంటనే వెళ్లి పోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యల నేపధ్యం లో మన ప్రధాని వ్యూహాత్మకం గా వ్యవహరించారు. ప్రధాని మోడీ లక్ష దీవులకు వెళ్లి స్నార్కెలింగ్ చేసి సేద తీరారు. లక్ష దీవులు(Lakshadweep) సుందరమైన ప్రాంతం అని కొనియాడారు. అన్యాపదేశం గా టూరిజం కి ఇది గొప్ప ప్రదేశం అని చెప్పారు. ప్రకృతి అందాలు మరియు సముద్ర తీరాలు వీక్షించ డానికి మాల్దీవులే పోనక్కరలేదు అని చెప్పకనే చెప్పారు.లక్ష దీవుల్లో ప్రధాని ఫోటోలు వైరల్ అయ్యాయి. లక్ష దీవులకు 700 కిలోమీటర్ల దూరం లోని మాల్దీవులు దేశ మంత్రులకు ఇది నచ్చలేదు. నోరు పారేసుకున్నారు.
మన దేశం లోని సెలెబ్రిటీ లు అందరూ వెంటనే స్పందించారు. మన దేశం లోనే బొచ్చెడు బీచ్ లు ఉన్నాయని పోస్టు లు పెట్టారు. సచిన్ టెండూల్కర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మహారాష్ట్ర లోని ఒక బీచ్ ఫోటోలు కూడా పెట్టారు… ప్రస్తుతం సోషల్ మీడియా లో ‘బాయ్ కాట్ మాల్దీవ్స్ ‘ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. మాల్దీవులకు ఒక్క రోజు లోనే రెండు వేలకు పైగా బుకింగ్స్ వెంటనే కేన్సిల్ అయ్యాయి. కొంచం ఆలస్యం గా తేరుకొన్న మాల్దీవుల ప్రభుత్వం తప్పనిసరిగా ముగ్గురు డిప్యూటీ మంత్రులను బర్తరఫ్ చేయవలసి వచ్చింది.
ప్రస్తుతం జరుగుతున్నది ఇలా ఉంటే రెండు దేశాల మధ్య నివురు గప్పిన నిప్పు లాంటి నిజాలు చాలా ఉన్నాయి.నిజానికి భారత దేశానికి మాల్దీవులు అత్యంత మిత్ర దేశం .
ఇరు దేశాల మధ్య చారిత్రక నేపధ్యం ఏమిటంటే…
1988 లో మాల్దీవులు అధ్యక్షుడు గా ఉన్న అబ్దుల్ గయూమ్ ప్రభుత్వం పై తిరుగుబాటు జరిగింది. శ్రీలంక కు చెందిన కొన్ని ఉగ్ర మూకల సహాయం తో దేశం లోని వ్యాపారులు కొందరు కుట్ర పన్నారు. మన దేశం వెంటనే స్పందించింది. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ మన దళాలను ‘ఆపరేషన్ కాక్టస్ ‘ పేరుతో అప్పటికప్పుడు మాల్దీవులు పంపి శత్రు మూకల ఆట కట్టి గయూమ్ ప్రభుత్వాన్ని కాపాడారు. ఎటువంటి సహాయాన్నైనా అందించ డానికి భారత్ ఎప్పుడూ సిద్ధం గానే ఉండేది. సునామీ వచ్చినప్పుడు కూడా మాల్దీవులకు సహాయాన్ని అందించిన మొదటి దేశం ఇండియానే… ప్రధాని మోడీ అధికారం లోనికి వచ్చాక విదేశీ పర్యటనకు వెళ్ళిన మొట్టమొదటి దేశం కూడా మాల్దీవులే…(India Maldives dispute boycott Maldives)
ఇరు దేశాల వివాదం లో చైనా పాత్ర ఏమిటి అంటే….?
హిందూ మహాసముద్రం లో భారత భూభాగానికి అతి దగ్గర గా ఉండే ఒక ప్రజాస్వామ్య స్వత్రంత్ర దేశం మాల్దీవులు. మొదటి నుండీ మన దేశం మాల్దీవులకు అన్ని రంగాలలో సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ఒక ప్రక్క చైనా కూడా ఏదోఒక విధం గా మాల్దీవులు పై తన ఆధిపత్యాన్ని చూపించు కోవాలని ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే.. ఒకవేళ చైనా భారత్ పై యుద్ధానికి దిగితే ఈ ప్రాంతం వ్యూహాత్మకం గా తనకు పనికి వస్తుంది అనేది ఆలోచన. దీనితో అక్కడి అధికార పక్షాలను, ప్రతి పక్షాలను ప్రలోభాలకు గురి చేస్తుండటం కూడా ఒక కారణం. కావాలని అప్పులు ఇచ్చి తీరా తీర్చ లేని పరిస్థితి లో భూభాగాలను ఆక్రమించడం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమం లోనే మాల్దీవులు ప్రభుత్వానికి కూడా కొంచం అప్పు ఇచ్చి, దాదాపు 30 కోట్ల రూపాయలకు ఒక దీవి ని కూడా సొంతం చేసుకొన్నది చైనా. అంతే కాకుండా చైనా మాల్దీవులు మధ్య ఒక స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కూడా జరిగింది. ఇలా మన దేశం తో సమానం గా మాల్దీవులు తో సంబంధం ఏర్పాటు కు ఉవ్విళ్ళూరుతోంది చైనా.(India Maldives dispute boycott Maldives)
మాల్దీవులు లో సున్నీ ముస్లిం జనాభా కూడా ఎక్కువ ..
మరొక పార్శ్వం ఏమిటంటే.. మాల్దీవులు లో సున్నీ ముస్లిం లు అధికం గా ఉంటారు. భారత దేశం లో తరచూ జరిగే అనేక రాజకీయ, మతపరమైన అంశాలు వీరు గమనిస్తూ ఉంటారు. ఈ సంఘటనలు కూడా ఇక్కడి ప్రజల వ్యతిరేకతలకు కారణం కావచ్చు.
‘ఇండియా అవుట్’ India Out నినాదం వెనుక ఉన్నది ఎవరు?
గత కొద్ది సంవత్సరాలు గా అక్కడి ప్రతి పక్షాలు భారత్ కు వ్యతిరేకం గా ‘ఇండియా అవుట్’ నినాదాలు చేస్తూ ఊరేగింపులు కూడా చేస్తున్నారు.భారత్ వ్యతిరేక భావనలు దేశం లో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాయి అక్కడి ప్రతిపక్ష మరియు ఇతర రాజకీయ పక్షాలు. గతం లో ఆ దేశ అద్యక్షుడు గా ఉన్న అబ్దుల్లా యమీన్ తమ దేశానికి భారత్ బహుమతి గా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక విమానాన్ని వెనక్కు తీసుకోవాలని, అలాగే భారత సైన్యాన్ని వెనక్కు పిలవాలని మన దేశాన్ని కోరడం జరిగింది.
‘ఇండియా ఫస్ట్ ‘ నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే….
ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భారత అనుకూల అద్యక్షుడు ఎన్నిక కావడం తో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగానే ఉండేవి. అద్యక్షుడు మహమ్మద్ సోలీ ‘ఇండియా ఫస్ట్’ అనే నినాదాన్ని ఇచ్చారు.
కొత్త ప్రభుత్వం వచ్చాక ఏం జరిగింది…?
అయితే గత నవంబర్ 2024 లో జరిగిన ఎన్నికలలో భారత వ్యతిరేక భావనలు అధికం గా గల ప్రభుత్వం ఎన్నిక అయింది. మొహమ్మద్ ముయుజ్జూ అధ్యక్ష భాద్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత లు చోటు చేసుకొన్నాయి. ‘ఇండియా అవుట్’ అనే నినాదం తో అధికారం లోకి వచ్చిన ముయుజ్జూ వెంటనే భారత దళాలు తమ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని కోరారు. చైనా అనుకూలవాది గా ఈయన కు పేరుంది. ‘ఇండియా అవుట్’ నినాదం వెనుక ఉండి నడిపిస్తున్నది కూడా చైనా యే అనేది జగమెరిగిన సత్యం. ఈ సంఘటనల నేపధ్యం లోనే మాల్దీవుల మంత్రి మరియం షియునా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
బంతి మాల్దీవుల చేతిలోనే ఉంది ఇంకా…..!!!
ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా , హిందూ మహా సముద్రం లో వ్యూహాత్మక ప్రదేశం గా ఉన్న మాల్దీవులు తో తగువు పెట్టుకోవాలని మన దేశం భావించడం లేదు. మాల్దీవులు దేశానికి మన దేశం చేసినంత సాయం మరే దేశమూ చెయ్యలేదు. నేనూ ఉన్నాను అంటూ చైనా ముందుకు వస్తున్నా ఆ దేశ ప్రయోజనాలే ముఖ్యం గాని మాల్దీవులు కు ప్రత్యేకం గా ఒరగబెట్టింది ఏమీ లేదని చెప్పవచ్చు. ఇప్పటికైనా మాల్దీవులు తన చిరకాల మిత్ర దేశం భారత్ తో మంచి సంబంధాలు కొనసాగించాలి. చైనా పన్నిన ఉచ్చులో పడిపోతే శ్రీలంక వంటి దేశాల పరిస్థితే దీనికి ఎదురు కావచ్చు. భారత్ వ్యతిరేక భావనలు పెచ్చు మీరకుండా చర్యలు తీసుకోవాలి. మాల్దీవులు దేశాన్ని కంటికి రెప్ప లా కాపాడుతున్న భారత్ పైనే ఎదురు తిరిగితే తన కన్ను పొడుచు కున్నట్టు అవుతుంది. భారత్ తో శత్రుత్వాన్ని కోరుకుంటే చైనా చేతిలో పావు గా మారి చివరకు దురాక్రమణ కు గురైనా ఆశ్చర్యపోనవసరం లేదు. బంతి మాల్దీవుల చేతిలోనే ఇంకా ఉంది…!!!
Vijay Kumar Bomidi, Editor, Vijay News Telugu