PSLV C58 – XPoSat ప్రయోగం విజయవంతం – ISRO ఖాతా లో మరో రికార్డు –
PSLV C58 – XPoSat ప్రయోగం విజయవంతం – ISRO ఖాతా లో మరో రికార్డు …….. ఖగోళ మూలాల నుండి విడుదల అయ్యే ప్రకాశవంతమైన ఎక్స్ కిరణాల మూలాలను అధ్యయనం చేయడానికి భారత్ ప్రయోగించిన మొట్టమొదటి పొలారి మెట్రి మిషన్ ఇది.
2024 నూతన సంవత్సరం మొదటి రోజున ISRO చేసిన ప్రయోగం విజయవంతం అయ్యింది.. జనవరి 1 , సోమవారం ఉదయం చేపట్టిన PSLV C58 రాకెట్ ను విజయవంతం గా ప్రయోగించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO.
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఈ రాకెట్ ను ప్రయోగించారు. 25 గంటల పాటు కొనసాగిన కౌంట్ డౌన్ ముగిసిన తర్వాత సోమవారం ఉదయం 9.10 గంటలకు … పొగమంచు తెరలను చీల్చుకొంటూ రాకెట్ నింగి లోనికి ఎగసింది. PSLV C58 బరువు 260 టన్నులు కాగా పొడవు 44.4 మీటర్లు . ఈ ప్రయోగం నాలుగు దశలలో పూర్తి అయ్యింది.
XPoSat ఉపగ్రహాన్ని భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులోని నిర్ణీత సింక్రోనాస్ కక్ష్య లోనికి విజయవంతం గా ప్రవేశ పెట్టింది PSLV వ్యోమ నౌక.
ఆ తర్వాత పి.ఎస్.ఎల్.వి ఎక్స్ పెరిమెంటల్ మాడ్యూల్ -3 (POEM-3) ప్రయోగం నిర్వహించ డానికి వీలుగా రాకెట్ యొక్క నాల్గవ ఇంజన్ మండించడం ద్వారా దాని కక్ష్య ను 350 కిలో మీటర్ల కు తగ్గించారు.అనంతరం ఒక కిలో బరువు ఉన్న వియ్ సాట్ ని కూడా నిర్ణీత కక్ష్య లోనికి ప్రవేశ పెట్టారు.
ఈ వియ్ సాట్ ఉపగ్రహాన్ని ను కేరళ కు చెందిన ఎల్.బి.ఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ విద్యార్ధినులు రూపొందించారు. ప్యూయల్ సెల్ కు చెందిన 10 ప్రత్యేక పరికరాలను కూడా నిర్దేశిత కక్ష్య లోనికి ప్రవేశ పెట్టారు.
XPoSat అంటే ఏమిటి?(PSLV C58 – ISRO)
ఎక్స్ రే పొలారి మీటర్ శాటిలైట్ ను XPoSat అని పిలుస్తున్నారు. XPoSat ఉపగ్రహం దాదాపు ఐదేళ్ళ పాటు సేవలు అందిస్తుంది. అంతరిక్షం లో అసాధారణ పరిస్టితుల్లో ఖగోళ మూలాల నుండి విడుదల అయ్యే ప్రకాశవంతమైన ఎక్స్ కిరణాల మూలాలను అధ్యయనం చేయడానికి భారత్ ప్రయోగించిన మొట్టమొదటి పొలారి మెట్రి మిషన్ ఇది.
వివిధ అంతరిక్ష ఆధారిత ప్రయోగ శాలల నుండి, స్పెక్ట్రో స్కోపిక్ పరికరాల నుండి సమృద్ధి గా సమాచారం లభిస్తున్నప్పటికీ , ఈ ఖగోళ మూలాల నుండి వెలువడే ఉద్గారాల యొక్క కచ్చితమైన సమాచారం ఇప్పటికీ ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక సవాల్ గానే ఉన్నది.
X-Ray Polarimeter Satellite ఉపగ్రహం లో రెండు శాస్త్రీయ పే లోడ్ లు ఉంటాయి. అవి 1) Polix 2) XSPECT
POLIX పే లోడ్ ఏం చేస్తుంది అంటే….?
POLIX అంటే… Polarimeter instrument in X-Rays … ఇది ఒక ఎక్స్ రే పోలారీ మీటర్. 8 – 30 కిలో ఎలక్ట్రాన్ ఓల్టుల శక్తి స్థాయి పరిధి లో ఖగోళ పరిశోధనలు చేస్తుంది. బెంగుళూరు లోని రామం రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (RRI) మరియు UR రావు శాటిలైట్ సెంటర్ సంయుక్తం గా దీనిని రూపొందించాయి. ఈ పేలోడ్ లో ఒక కోలి మేటర్ (collimator), నాలుగు ఎక్స్ రే డిటెక్టర్ లతో కూడిన ఒక స్కాటరర్ (scaterrrer) ఉంటాయి. నిర్దేశిత శక్తి స్థాయి లో ధ్రువణ పరామితులు తెలుసుకోవడం కోసం ప్రత్యేకం గా తయారుచేసిన పే లోడ్ ఇది.
XSPECT పే లోడ్ ఏం చేస్తుంది అంటే …..?
దీనిని URSC (UR Rao satellite space center) మరియు ఇస్రో (Indian Space Research Organization) దీనిని తయారు చేసాయి. ఇది ఒక ఎక్స్ రే స్పెక్ట్రో స్కోపీ మరియు టైమింగ్ పేలోడ్. మృదు ఎక్స్ రే కిరణాలలో సమయ వేగాన్ని, అధిక స్పెక్ట్రో స్కోపిక్ రిజల్యూషన్ ను అందించే పరికరం ఇది. 0.8 -15 కిలో ఎలెక్ట్రాన్ వోల్టు ల శక్తి స్థాయి లో విడుదల అయ్యే ఎక్స్ కిరణాల అధ్యయనానికి తోడ్పడుతుంది.
ఫ్యూయల్ సెల్ వలన ఉపయోగాలు ఏమిటంటే …?(PSLV C58 – ISRO)
విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ ఈ ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టం (FCPS) ను రూపొందించింది. భారత్ స్వయం గా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు చేసుకొంటున్న ఈ తరుణం లో ఈ ఫ్యూయల్ సెల్ ఒక సమర్ధవంతమైన శక్తినిచ్చే కేంద్రం గా ఉండవచ్చని ISRO భావించడం జరుగుతోంది.
- భారత అంతరిక్ష కేంద్రాన్ని రూపొందించాలన్నది ISRO ప్రధాన లక్ష్యం.
- ఈ కేంద్రానికి రోదసి లో శక్తిని ఇచ్చే ఒక ప్రధాన వనరుగా ఈ ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టం (FCPS) పనిచేస్తుంది. ఇది రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చ గలదు.
- భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు అయితే దానికి కావలసిన ఇంధనం చాలా కాలం పాటు అందించే శక్తి దీనికి ఉంటుంది.