Kiss Day Valentine Week – తూరుపు కి తొందరెక్కువ .. పడమటికి పొందిక ఎక్కువ..
తూరుపు కి తొందరెక్కువ… పడమటికి పొందికెక్కువ.. పసిపాపలు నిద్రలో సైతం పూయించే చిరునవ్వుల పుష్పాల కోసం ఈ దిక్కులకు ఎప్పుడూ కంగారే…. ఒకటి నిద్ర లేపేస్తుంది… ఒకటి నిద్రలో ముంచేస్తుంది… ఈ తొందర పాటే కదా .. ముద్దంటే..
Kiss Day Valentine Week – తూరుపు కి తొందరెక్కువ .. పడమటికి పొందిక ఎక్కువ..
ఒక మనసును తీసుకెళ్ళి వేరొక మనసులో ముంచడమే …ముద్దు అంటే…… (Kiss Day Valentine Week)
ఒక మౌనాన్ని తోడ్కొని వెళ్లి మరొక మౌనం లో కలిపేయడమే… ముద్దు అంటే…
ఒక చిరునవ్వును చిత్రిక పట్టి వేరొక చిరునవ్వు కు జతచేయడమే … ముద్దు అంటే..
ఒక తియ్యని సంగీతాన్ని తోలుకొని పోయి అనంత సంగీతం పై రుద్దడమే… ముద్దు అంటే…
ఒక వెచ్చని ఊపిరిని విడిపించుకు పోయి ఇంకొక చల్లని ఊపిరికి ప్రాణం పోయడమే … ముద్దు అంటే….
ఒక గుండె చప్పుడు ఒంటరి అయ్యిందని మరొక గుండె చప్పుడు తో తోడు పొందడమే … ముద్దు అంటే….
నీ స్పర్శ తో మత్తుగా తూగుతున్న అక్షరాలకు భాష్యం చెప్పడమే కదా …. ముద్దు అంటే…
నువ్వు గుర్తొచ్చిన జ్ఞాపకానికి కన్నీళ్లు పొంగుకు రావడమే కదా … ముద్దు అంటే…
మెరుపుల కొసలకు మరపుల గాలి పటాన్ని ఎగురవేసినపుడు అది తెగిపడకుండా దారపు దేహాన్ని మొత్తం వేలి కోసలతో మృదువుగా తాకడమే…ముద్దంటే..
ఉదయం నిజానికి ఒక ముద్దు, సాయంత్రం కూడా ఒక ముద్దు… ఎవరెవరు పెట్టుకుంటారని అనడిగితే.. గడ్డి పరకా మాట్లాడదు… తొలి కిరణమూ మాట్లాడదు…(Kiss Day Valentine Week)
తూరుపు కి తొందరెక్కువ… పడమటికి పొందికెక్కువ.. పసిపాపలు నిద్రలో సైతం పూయించే చిరునవ్వుల పుష్పాల కోసం ఈ దిక్కులకు ఎప్పుడూ కంగారే…. ఒకటి నిద్ర లేపేస్తుంది… ఒకటి నిద్రలో ముంచేస్తుంది… ఈ తొందర పాటే కదా .. ముద్దంటే..
ఉన్నట్టుండి ఒక కల ఉప్పొంగి …కను రెప్పలు దాటి నీరై ప్రవహించి తలగడ లోనికి మాయమై నపుడు.. ఆ తడి కోసం వెతికే వేలి కొసల వెతుకులాట కూడా ఒక రకం ముద్దే….
నువ్వు నాటిన చెట్టు … నువ్వు నడచిన దారి… నువ్వు దండ వేసిన విగ్రహం… నువ్వు వాడిన పరిమళం .. నీకు నచ్చిన రంగు…. నువ్వు రాసిన అక్షరాలు… నా నుదుట నీ గుండె తో పెట్టిన సంతకం…ఇవన్నీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నపుడు…
నా ఆలోచనలతో …సుదీర్ఘం గా అనంతకాలం పాటు….నిన్ను ముద్దు పెట్టు కుంటూనే ఉంటాను..