వైసీపీ పై ముప్పేట దాడి చేసిన మోడీ అమిత్ షా | Modi Amith shah fires on YSRCP
వైసీపీ పై ముప్పేట దాడి చేసిన మోడీ, అమిత్ షా
06-05-2024 విజయ్ న్యూస్: వైసీపీ ప్రభుత్వం పై ప్రధాని మోడీ తీవ్రమైన ఆరోపణలు చేసారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయింది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో లిక్కర్ మాఫియా మరియు ఇసుక మాఫియా నడుస్తున్నాయని, ఈ ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అధోగతి పాలు అయ్యిందని తీవ్ర విమర్శలు చేసారు. రాజమహేంద్రవరం సమీపం లోని వేమగిరి వద్ద జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ఈ వ్యాఖ్యలు చేసారు.
మోడీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని వైసీపీ ఊహించలేక పోయింది. గతం లో మార్చి నెలలో చిలకలూరి పేట దగ్గర బొప్పూడి లో జరిగిన సభలో కూటమి నాయకులతో అంటీ ముట్టనట్టు వ్యవహరించారు మోడీ. వైసీపీ ప్రభుత్వం పై పల్లెత్తు మాట కూడా అనకుండా తన ప్రసంగాన్ని ముగించడం తో కూటమి నాయకులకు ఈ విషయం మింగుడు పడలేదు. ప్రధాని కూడా వైసీపీ ని పరోక్షం గా సపోర్టు చేస్తున్నారనే అందరూ అనుకున్నారు.
అయితే నెల తిరిగే సరికి మోడీ స్వరం లో మార్పు కనిపించింది. అమిత్ షా కూడా తన ప్రచార సభల్లో వైసీపీ ని నేరుగా ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేసారు.ఇంతలోనే బీజేపీ శిబిరం లో అంత మార్పు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోవడం వైసీపీ వంతు అయ్యింది. ఈ రోజు ప్రధాని మోడీ రాజమహేంద్రవరం మరియు అనకాపల్లి ప్రచార సభలలో అనేక అంశాలను ప్రస్తావించారు. ఎన్నికలు బాగా దగ్గర పడటం తో ప్రధాని చేసిన ఇటువంటి వ్యాఖ్యలు తమ పార్టీ అవకాశాలను దెబ్బ తీసే విధం గా ఉన్నాయని వైసీపీ నాయకులు వాపోతున్నారు.