January 10, 2025

Monkey Fever – దేశం లో వ్యాపిస్తున్న కొత్త వైరస్ వ్యాధి మంకీ ఫీవర్

దేశం లోని వివిధ రాష్ట్రాలను ప్రస్తుతం వణికిస్తున్న వ్యాధి ‘మంకీ ఫీవర్’ (Monkey Fever). గత మాసం జనవరి నుండి ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన అనేక మంది పడ్డారు. కర్నాటక రాష్ట్రం లో ఇప్పటి వరకూ 49 మందికి ఈ వ్యాధి సోకగా అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Monkey Fever in India

Monkey Fever caused by a virus

దేశం లో వ్యాపిస్తున్న కొత్త వైరస్ వ్యాధి మంకీ ఫీవర్ -Monkey Fever in Telugu

దేశం లోని వివిధ రాష్ట్రాలను ప్రస్తుతం వణికిస్తున్న వ్యాధి ‘మంకీ ఫీవర్’ (Monkey Fever). గత మాసం జనవరి నుండి ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన అనేక మంది పడ్డారు. కర్నాటక రాష్ట్రం లో ఇప్పటి వరకూ 49 మందికి ఈ వ్యాధి సోకగా అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కేరళ రాష్ట్రం లోని వాయనాడ్ జిల్లా లో కూడా ప్రజలు అప్రమత్తం గా ఉండాలని పిలుపు నిచ్చారు. కేరళ, గోవా, మహారాష్ట్ర సరిహద్దులలోని అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది.  వచ్చే రోజుల్లో ఈ వ్యాధి ఇంకా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవలసింది గా ప్రజలను కోరుతున్నారు. అసలు ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, వ్యాధి లక్షణాలు ఏమిటి, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం..

ఈ వ్యాధి కారకం ఏమిటి ?

మంకీ ఫీవర్ ను ‘క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ లేదా KFD’ (Kyasanur Forest Disease) అని పిలుస్తారు. ఈ వ్యాధి ఒక వైరస్ వలన వస్తుంది. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ – KFDV (Kyasanur Forest Disease Virus) అనే వైరస్ వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వైరస్ ఫ్లావి వైరస్ ప్రజాతి కి చెందిన వైరస్ గా భావిస్తున్నారు. సాధారణం గా వైరస్ తనంతట తానుగా వ్యాప్తి చెందలేదు. ఒక దగ్గర ఉన్న వైరస్ ను మరొక దగ్గరకి చేరవేయడానికి ఒక వాహకం అవసరం అవుతుంది. కోతులలో జ్వరాన్ని కలుగ జేస్తున్న వైరస్ కొన్ని కీటకాల ద్వారా (పేలు – ticks) మనుష్యులకు వ్యాపిస్తోంది. కోతుల శరీరం పైన ఉండే పేను తిరిగి మనిషి శరీరాన్ని కుట్టినప్పుడు ఈ జ్వరం వ్యాపిస్తున్నట్టు చెప్తున్నారు.

ఏ కీటకం దీనికి వాహకం గా పనిచేస్తోంది? (Monkey Fever in Telugu)

హీమా ఫైసాలిస్  స్పైని జెరా (Haemaphysalis spinigera) అనే శాస్త్రీయ నామం కలిగిన పేను కోతులను కుట్టి తద్వారా దానిలో  ఉండే ‘క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ – KFDV ను గ్రహిస్తుంది… ఈ వైరస్ సోకిన కోతులు అడవులలో తిరిగేటప్పుడు ఆయా ప్రాంతాలలో ఉండే పేలకు ఈ వైరస్ ను వ్యాపింప చేస్తాయి. వైరస్ సోకిన పేను మనిషిని కుట్టినపుడు ఈ వ్యాధి సోకుతుంది. మంకీ ఫీవర్ సోకిన జంతువు యొక్క రక్తం లేదా కణజాలాలు వ్యాధి ని వ్యాపింప జేయగలవు.

ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపించడం అరుదు గా జరుగుతుంది. ప్రధానం గా వైరస్ సోకిన పేను కుట్టడం ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది.

ఏ కోతుల జాతుల వలన ఈ  వ్యాధి వ్యాపిస్తుంది?

అటవీ ప్రాంతానికి దగ్గర గా ఉండే గ్రామాల్లో ఈ వ్యాధి ఎక్కువ గా కనిపిస్తోంది. అంతే కాకుండా కోతుల బెడద ఎక్కువగా ఉండే గ్రామాలలో నివసించే ప్రజలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తున్నట్టు అనుమానిస్తున్నారు. అడవులలో నల్లని ముఖం మరియు చేతులు గల ‘లంగర్స్’ (సెమ్నో పిథికస్ జాతులు- Langur ) అని పిలవబడే కోతులలో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్తున్నారు. ఈ జాతి కి చెందిన కోతులు వైరస్ కు రిజర్వాయిర్ లు గా ఉంటున్నాయి. వీటితో పాటు బోనెట్ మకాక్- Bonnet macaques (మకాకా రేడియేటా) జాతికి చెందిన కోతులు కూడా ఈ వైరస్ కు రిజర్వాయిర్ లు గా ఉంటున్నాయి.

Monkey fever in india
Monkey Fever – లంగర్స్, బోనెట్ మకాక్ ఈ వైరస్ ను కలిగి ఉంటాయి

వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?

మంకీ ఫీవర్ వ్యాధి యొక్క లక్షణాలలో ప్రధానం గా జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటాయి. వాంతులు అవుతాయి. రక్త స్రావం జరుగుతుంది. వ్యాధి లక్షణాలు మరింత ఎక్కువగా ఉన్నపుడు బాగా రక్త స్రావం సంభవించి నాడీ సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి. ప్రధానం గా అలసట గా ఉంటారు. వెలుగును చూడలేరు (ఫోటో ఫోబియా). వ్యాధి బాగా ఎక్కువ అయినప్పుడు ముక్కు నుండి, చిగుళ్ళ నుండి రక్త స్రావం జరగవచ్చు. వ్యాధి లక్షణాలను బట్టి వెంటనే స్పందించి చికిత్స తీసుకొంటే వ్యాధి నివారణ సులభం అవుతుంది. (Monkey Fever)

ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

దీనికి ప్రస్తుతం ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు. జంతువులకు ముఖ్యం గా కోతులకు దూరం గా ఉండాలి. వాటి శరీరం పై పేలు వంటివి ఉన్నపుడు మరింత జాగ్రత్త అవసరం. అటవీ ప్రాంతం దగ్గర గా ఉన్న గ్రామాల్లో, కోతులు ఎక్కువ సందర్శించే గ్రామాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి. శరీరం అంతా కప్పే విధం గా ఉన్న దుస్తులు ధరించాలి. కీటకాలను తరిమే స్వభావం ఉన్న రిపెల్లెంట్స్ వాడాలి.

కోతులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో తిరగరాదు. ఒకవేళ జ్వరం లాంటి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. కోతులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రాంతాలలో మాత్రమే ఈ వ్యాధి కనిపిస్తోంది కాబట్టి ఇతర ప్రాంతాలలోని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో దీనికి వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంచారు కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

Vijay News Health Desk