January 10, 2025

Nitish Kumar Reddy Wild Fire| Boxing day Test| ఆసీస్ గడ్డ పై తెలుగోడి వీరోచిత సెంచరీ|

0

తన కొడుకు సాధిస్తున్న ఈ అరుదైన విజయాన్ని స్టేడియం లో ఉండి కళ్ళారా వీక్షించారు నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి. సెంచరీ కి చేరువలో ఉన్నపుడు ఆయన కళ్ళలో పెల్లుబికిన కన్నీటికి ఖరీదు కట్టే వారు ఎవరూ లేరనే చెప్పవచ్చు. 97 పరుగుల వద్ద బంతిని గాలిలోకి లేపినపుడు ఆ తండ్రి పడ్డ వేదన అంతా ఇంతా కాదు. సిరాజ్ ఒక్కో బంతి ని ఎదుర్కొంటున్నపుడు కూడా ఆయన లో తీవ్ర భావోద్వేగం .. చివరికి సెంచరీ మైలు రాయిని చేరినప్పుడు .. చిన్న పిల్లాడిలా చిందులేసిన ఆ లైవ్ దృశ్యాలను ప్రతి క్రికెట్ అభిమాని చిరకాలం  గుర్తుపెట్టుకుంటాడు

Nitish Kumar Reddy Wild Fire Innings

Nitish Kumar Reddy Wild Fire Innings

Nitish Kumar Reddy Wild Fire| boxing day test|ఆసీస్ గడ్డ పై తెలుగోడి వీరోచిత సెంచరీ

మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ … బాక్సింగ్ డే టెస్టు … మూడవ రోజు ఆట లో ఒక అద్భుతం జరిగింది. యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టి ని ఆకర్షించిన సంఘటన అది… ప్రతీ క్రికెట్ అభిమాని గుండె గొంతుకలో కొట్లాడింది. ఆ కుర్రాడు ఎలాగైనా సెంచరీ చెయ్యాలి. ఆ కుర్రాడి సొంతూరు అయిన వైజాగ్ నుండి మొదలు…. అటు రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆపై యావత్ భారత దేశం లోని క్రికెట్ అభిమానులు… అంతే కాదు.. భారత్ అంటే వివక్ష తో రెచ్చిపోయే ఆస్ట్రేలియన్ క్రికెట్ అభిమానులు సైతం.. ఒక్క క్షణం అనుకొన్న ఒకే ఒక మాట.. ఆ కుర్రాడు ఎలాగైనా సెంచరీ చెయ్యాలి అని (Nitish Kumar Reddy)

ఎందుకు అందరూ అలా ఎదురు చూసారు? ఎంతో మంది వర్ధమాన క్రికెటర్లు వస్తుంటారు పోతుంటారు .. సెంచరీలు కొడుతుంటారు.. సెంచరీలు మిస్ అవుతుంటారు.. ఏదో ఒకటి అవుతుందిలే అని అందరూ ఎందుకు అనుకోలేక పోయారు? ఇతగాడు సెంచరీ కొట్టకపోతే పోయేదేం లేదులే అని ఎందుకు అనుకోలేక పోయారు ? ప్రత్యర్ధి జట్టు అభిమానులే కాదు ఆటగాళ్ళు సైతం ఇతను సెంచరీ చెయ్యాల్సిందే అని ఎందుకు అనుకున్నారో తెలుసా?

ఈ చిచ్చర పిడుగు ఎవరో తెలుసా?

ఇంతకూ ఆ పసికూన.. ఆ చిచ్చర పిడుగు ఎవరో చెప్పలేదు కదా… ఈ టెస్టు సీరీస్ లోనే ఆరంగేట్రం చేసి.. తన అభిమాన క్రికెట్ హీరో కోహ్లీ నుండి క్యాప్ అందుకుని.. ఆడిన ప్రతి టెస్టు లోనూ తనదైన శైలి లో బ్యాటింగ్ చేసి.. మహామహులే విఫలమైన పిచ్ లపై ధాటిగా ఆడుతూ మంచి స్కోర్లు నమోదు చేసి.. అసలు తగ్గేదేలా అంటూ .. ప్రపంచం లోనే మేటి జట్టు అయిన ఆస్ట్రేలియా పై వీరోచితం గా ఆడి తన మొట్ట మొదటి సెంచరీ ని నమోదు చేసిన ధీరుడు మన తెలుగువాడు .. మరీ ముఖ్యంగా మన విశాఖపట్నం వాసి ….అతనే ..21 ఏళ్ళ  నితీష్ కుమార్ రెడ్డి …యావత్ టెస్టు క్రికెట్ చరిత్ర లోనే పదికాలాల పాటు గుర్తు ఉంచుకొనే ఇన్నింగ్స్ ఆడాడు అనడం లో అతిశయోక్తి లేనేలేదు.(Nitish Kumar Reddy)

పౌరుషాన్ని కలిగించిన ఎమ్మెస్కే వ్యాఖ్యలు

ఇరవై ఒక్క ఏళ్ళ పసికూన ఇతడు.. అవతల ప్రపంచం లోనే మేటి బౌలింగ్ లైనప్ గల ఆసీస్ జట్టు.. అంతకు మించి భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం తో ఫాలో ఆన్ ఆడే ప్రమాదం. అటువంటి పరిస్థితి లో క్రీజు లోనికి వచ్చిన నితీష్ రెడ్డి పై ఎవరికీ ఎటువంటి నమ్మకమూ లేదు. ఆ ముందు రోజే భారత మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా నితీష్ లో పౌరుషాన్ని రగిలించి ఉండవచ్చు.అవతల ఉన్నది కొండ అయినా సరే.. డీ కొట్టి తీరాల్సిందే అని నిర్ణయించుకుని ఉండవచ్చు.. టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ తో క్రుంగి పోలేదు.. తనకు కావలసినంత సమయం ఉంది. కూల్ గా ఒక్కో పరుగూ తీసుకుంటూ పోతే తను అనుకున్నది సాధించ వచ్చు అనుకున్నాడు. సాధించాడు..

రిషబ్ డబుల్ సెంచరీ, జడేజా ఒక సెంచరీ

రిషబ్ పంత్ ఒక డబుల్ సెంచరీ, రవీంద్ర జడేజా కనీసం ఒక సెంచరీ చేసేసి .. మరో ద్రావిడ్, లక్ష్మణ్ లా ప్రత్యర్ధి జట్టు కు ఎదురు టార్గెట్ ఇచ్చి టెస్టు ను గెలిపించేస్తారని… రాత్రంతా కలలు కన్న సగటు భారత క్రికెట్ అభిమాని ఉదయం నిద్ర లేచేసరికి .. ఇక ఫాలో ఆన్ తప్పదు అనే పరిస్థితి లో ఈ టెస్టు కూడా పోగొట్టేసారు అనుకొని ఎవరైతే లైవ్ చూడటం ఆపేసారో  వారు మాత్రం నిజం గానే దురదృష్టవంతులు అని చెప్పవచ్చు.

క్రీజు వద్ద పాతుకుపోయిన వాషింగ్టన్ సుందర్

వాషింగ్టన్ సుందర్ తో కలిసి నితీష్ కుమార్ రెడ్డి ఒక్కో బాల్ ఆడుతూ ముందు ఫాలో ఆన్ గండం తప్పించేసారు. ఆపై కొండ లా ఉన్న ఆధిక్యాన్ని కూడా తగ్గించే పనిలో పడి సఫలీకృతులు అయ్యారు. నితీష్ రెడ్డి అడపా దడపా షాట్ లు కొడుతూ జట్టు స్కోరు పెంచే ప్రయత్నం చేసాడు. కాని వాషింగ్టన్ సుందర్ మాత్రం క్రీజు వద్ద పాతుకు పోయాడు అంతే… క్రికెట్ లో ఫోర్లు అని ఉంటాయి కొడితే నాలుగు పరుగులు వస్తాయి అనే విషయాన్నే మరచిపోయినట్లు ఆడాడు సుందర్. నూట అరవై పైగా బంతులు ఆడి కేవలం ఒకటే బౌండరీ కొట్టా డంటే ఎలా ఆడాడో మనం అర్ధం చేసుకోవచ్చు. (Nitish Kumar Reddy)

ఆసీస్ కొత్త బంతిని కూడా చితక్కొట్టారు

ఆస్ట్రేలియా  జట్టు కొత్త బంతి తీసుకున్నప్పటికీ ఈ జోడీ ని విడదీయ లేక పోయారు. అటు సుందర్ కీ ఇటు నితీష్ కి దేశవాళీ మ్యాచ్ లలో ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. కొత్త బంతి ని ఎలా ఎదుర్కోవాలో ఇద్దరికీ బాగా తెలుసు. కొత్త బంతి తో ఈ ఇద్దరినీ పెవిలియన్ కి పంపొచ్చు అని కలలు గన్న ఆసీస్ బౌలర్ల కు నిరాశే ఎదురైంది. ఎనిమిదో వికెట్ దగ్గర బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్ మన్ ఇలా బ్యాటింగ్ చేస్తారని ఆసీస్ బౌలర్లు అనుకోలేదు.

ఆసీస్ బౌలర్లు అందరూ తమ  తమ ఆయుధాలను ప్రయోగించారు. ఏ బౌలర్ ఎటువంటి బంతులు వేసినా నితీష్ గానీ, సుందర్ గానీ తొణకలేదు.. బెణకలేదు. ఆడుతూనే ఉన్నారు. వికెట్ పైకి వచ్చిన బంతులను గౌరవించారు. వికెట్ బయటకు పోయే బంతులను వదిలేసారు. షార్ట్ పిచ్ బంతులను సమర్దవంతం గా ఎదుర్కొన్నారు. దూసుకొస్తున్న బౌన్సర్ల ను తప్పించుకున్నారు. కొన్ని సార్లు నేరుగా బంతి తమ శరీరానికి తాకినా లెక్క చేయలేదు. నితీష్ ని ఎక్కువసార్లు బంతి నేరుగా వచ్చి తాకింది. అయినా సరే పడిలేచిన కెరటం లా ఆడాడు.

వాషింగ్టన్ సుందర్ సూపర్ సపోర్ట్

ఒక ప్రక్క నితీష్ క్రీజులో పరుగులు సాధిస్తూ ఉంటే అతనికి చక్కటి సహకారాన్ని అందించాడు వాషింగ్టన్ సుందర్. ఒకవేళ సుందర్ గానీ తక్కువ స్కోరు కే అవుట్ అయి ఉంటే నితీష్ రెడ్డి దగ్గర నుండి ఇటువంటి ఇన్నింగ్స్ మనం చూసే వాళ్ళం కాదు. ఎందుకంటే ఆ తర్వాత బ్యాటింగ్ లైనప్ లో మిగిలింది బుమ్రా మరియు సిరాజ్ మాత్రమే. యాభై పరుగులు చేసిన తర్వాత దురదృష్టవ సాత్తూ అవుట్ అయ్యాడు సుందర్.

అప్పటికి నితీష్ రెడ్డి తొంభై లలో ఉన్నాడు. ఒక ప్రక్క బుమ్రా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది సిరాజ్ మాత్రమే.. ఇప్పటికే సరైన బౌలింగ్ చేయడం లేదని అపఖ్యాతి ని మూటగట్టుకున్న సిరాజ్ పై ఎవరికీ ఎటువంటి నమ్మకాలు లేవు. కనీసం ఒక బంతి అయినా ఆడగలడా అని అందరికీ అనిపించింది. మూడు పరుగుల దూరం లో ఉన్నపుడు అంత వరకూ కూల్ గా ఆడుతున్న నితీష్ రెడ్డి ఒక్కసారిగా బంతిని గాల్లోకి లేపాడు. అవుట్ అయిపోయాడు అనుకున్నారు అందరూ. ఫీల్డర్ లేని చోట బంతి పడింది .. ఊపిరి పీల్చు కున్నారు అందరూ..

మూడు బంతుల్లో హీరో అయిపోయిన సిరాజ్

చివర్లో సిరాజ్ మూడు బంతులు ఎదుర్కోవలసి వచ్చింది. మరొక ప్రక్క నితీష్ లో కొంచం టెన్షన్ … ఒకవేళ సిరాజ్ అవుట్ అయితే జట్టు ఆల్ అవుట్ అయినట్లే.. నితీష్ నాటౌట్ గా మిగిలిపోవలసి వస్తుంది… స్టేడియం అందరిలో ఒకటే టెన్షన్.. ఒక్కొక్కటిగా మూడు బంతులను సమర్దవంతం గా ఎదుర్కొన్నాడు సిరాజ్. ఒక్కసారిగా స్టేడియం లో హర్షాతిరేకాలు.. (Nitish Kumar Reddy)

అందరికీ ఫీలింగ్స్ వచ్చేసాయి..!

మ్యాచ్ భారత్ లోనే జరుగుతున్నట్టు ఉంది అప్పటి వాతావరణం. దాదాపు 77 వేల మంది కి పైగా ప్రేక్షకులు ఈ టెస్టుకు హాజరయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత ఆస్త్రేలియన్ బౌలర్ల నే ఎదురొడ్డి నిలబడ్డాడు ఒక 21 ఏళ్ళ యువకుడు అని అందరిలో ఒకటే ఫీలింగ్… అందరిలో ఫీలింగ్స్ వచ్చేసాయి.. కుర్రాడు సెంచరీ కొట్టాల్సిందే అని .. సెంచరీ కి ఒక్క పరుగు దూరం లో నితీష్..

వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్ ఇది

ఒక చక్కటి షాట్ తో ఫోర్ కొట్టి మరీ తన మొట్టమొదటి టెస్టు సెంచరీ ని నమోదు చేసుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. అశేష క్రికెట్ అభిమానుల కేరింత లతో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ దద్దరిల్లి పోయింది. ఆటగాళ్ళు ఎవరైనా జట్లు ఏవైనా చివరికి క్రికెట్ గెలిచింది. అయితే నితీష్ కుమార్ రెడ్డి కళ్ళలో మాత్రం ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అన్నట్టు .. నిదానం గానే తన సెంచరీ ని సెలబ్రేట్ చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసినప్పుడు మాత్రం ‘తగ్గేదేలే ‘ అంటూ బ్యాట్ తో చూపించిన హావభావాలు నిజం గా వైల్డ్ ఫైరే ..

ఉపసంహారం :

తన కొడుకు సాధిస్తున్న ఈ అరుదైన విజయాన్ని స్టేడియం లో ఉండి కళ్ళారా వీక్షించారు నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి. సెంచరీ కి చేరువలో ఉన్నపుడు ఆయన కళ్ళలో పెల్లుబికిన కన్నీటికి ఖరీదు కట్టే వారు ఎవరూ లేరనే చెప్పవచ్చు. 97 పరుగుల వద్ద బంతిని గాలిలోకి లేపినపుడు ఆ తండ్రి పడ్డ వేదన అంతా ఇంతా కాదు. సిరాజ్ ఒక్కో బంతి ని ఎదుర్కొంటున్నపుడు కూడా ఆయన లో తీవ్ర భావోద్వేగం .. చివరికి సెంచరీ మైలు రాయిని చేరినప్పుడు .. చిన్న పిల్లాడిలా చిందులేసిన ఆ లైవ్ దృశ్యాలను ప్రతి క్రికెట్ అభిమాని చిరకాలం  గుర్తుపెట్టుకుంటాడు.

చివరికి గిల్ క్రిస్ట్ వచ్చి ఆయనను ఇంటర్వ్యూ చేయడం.. అంతే కాదు రవిశాస్త్రి అంతటివాడు కూడా కన్నీరు పెట్టడం ….. అబ్బో.. చాలా జరిగాయి చివర్లో..

తన కొడుకు లోని ప్రతిభను గుర్తించి తన పాతికేళ్ళ కెరీర్ ను సైతం పణం గా పెట్టిన ఒక సామాన్య తండ్రికి ఇంతకంటే గొప్ప సత్కారం ఏముంటుంది?

Vijay Sports News Desk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *