January 10, 2025

PACE NASA Satellite |సముద్ర జలాల అధ్యయనానికి నాసా పంపిన శాటిలైట్ “పేస్”

సముద్రాల యొక్క రంగును అధ్యయనం చేయడం, ఏరోసాల్స్ , మేఘాలు, మరియు కర్బన చక్రం (carbon cycle), గాలి నాణ్యత  గురించి క్షుణ్ణం గా అధ్యయనం చేయడం ఈ శాటిలైట్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు.

PACE NASA Satellite pic credit: NASA GFSC

PACE NASA Satellite ఊహా చిత్రం pic credits : NASA GFSC

PACE NASA Satellite | సముద్రజలాల అధ్యయనానికి నాసా పంపిన  శాటిలైట్ “పేస్”

సముద్ర జలాల పరిశీలన మరియు భూమి పై వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి నాసా “పేస్” అనే ఉపగ్రహాన్ని విజయవంతం గా ప్రయోగించింది. ఫ్లోరిడా రాష్ట్రం లోని కేప్ కెనవరాల్ అంతరిక్ష కేంద్రం (space launch complex 40) నుండి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ (space X Falcon 9) అనే రాకెట్ ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షం లోనికి తీసుకు వెళ్ళింది. ఫిబ్రవరి 8, 2024 న ఈ ప్రయోగం జరిగింది. PACE NASA Satellite

ఈ ఉపగ్రహం పంపడం లో ప్రధాన లక్ష్యాలు ఏమిటి?PACE NASA Satellite

ప్లాంక్టాన్, ఏరోసాల్, క్లౌడ్, ఓషన్ ఎకో సిస్టం ఈ మాటలలోని మొదటి అక్షరాలను తీసుకొని (PACE-Plankton Aerosol Cloud ocean Ecosystem) అని ఈ ఉపగ్రహానికి పేరు పెట్టారు. భూమిని అత్యంత సూక్ష్మం గా గమనించే ఉపగ్రహం ఇది. ప్రధానం గా సముద్రాల యొక్క రంగును అధ్యయనం చేయడం, ఏరోసాల్స్ , మేఘాలు, మరియు కర్బన చక్రం (carbon cycle), గాలి నాణ్యత  గురించి క్షుణ్ణం గా అధ్యయనం చేయడం ఈ శాటిలైట్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు.

బయో జియో కెమిస్ట్రీ, ఎకాలజీ తదితర శాస్త్రాల అధ్యయనం కూడా ఈ మిషన్ లో భాగం గా చేస్తారు. సముద్ర జలాల యొక్క నాణ్యత, సముద్రాల లోని మత్స్య సంపద మొదలైన అంశాల ను కూడా పరిశీలించి డేటా ను పంపుతుంది.

ఆల్గే బ్లూమ్ అంటే ఏమిటి ?

ఈ PACE ఉపగ్రహం సహాయం తో సముద్ర జలాల లోని మత్స్య సంపద వివరాలు పూర్తిగా అంచనా వేస్తారు. హానికరమైన ఆల్గే బ్లూమ్ ను గుర్తించడానికి, సముద్రం లోని వివిధ వనరులను వాటిలో సంభవించే మార్పులను పర్యవేక్షించ డానికి ప్రయత్నం చేస్తారు. సముద్ర జలాల్లో చాలా సార్లు శైవలాలు (ఆల్గే) విపరీతం గా పెరుగుతాయి. దీనినే ఆల్గే బ్లూమ్ అంటారు. దీని వలన సముద్ర జలాలలోని జీవులకే కాక మనుష్యులకు కూడా హాని జరిగే అవకాశం ఉంటుంది.

సముద్రాలకు రంగు ఎలా వస్తుంది? (PACE NASA Satellite)

సాధారణం గా సముద్రానికి ఆ రంగు దానిలో గల ఫైటో ప్లాంక్టాన్ జాతుల వలన కలుగుతుంది. ఈ జాతులలో ఆకు పచ్చని వర్ణ ద్రవ్యం క్లోరో ఫిల్  వలన జలాలు ఆ రంగులో కనిపిస్తాయి. సముద్రం లోని ఇటువంటి పదార్ధాలు సూర్యకాంతి తో జరిపే చర్యల ఫలితం గా సముద్ర జలాలు వివిధ రంగులు సంతరించుకొంటాయి. ప్రపంచ వ్యాప్తం గా ఉన్న ఈ phyto plankton జాతులను అధ్యయనం చేయడం ద్వారా సముద్ర జీవావరణం గూర్చి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం దొరుకుతుంది.

Phytoplankton అంటే ఏమిటి ?

భూమిపై పెరిగే  మొక్కల మాదిరి గానే సముద్రం లో పెరిగే మొక్కలు వంటివి గా వీటిని చెప్పవచ్చు. వీటిలో కిరణ జన్య సంయోగ క్రియ జరుపుకొనే బాక్టీరియా మరియు  మొక్కల వంటి శైవలాలు ఉంటాయి. వీటికి ఉదాహరణలు గా డయాటమ్స్, సైనో బాక్టీరియా, డైనో ఫ్లాజేల్లేట్, మైక్రో ఆల్గే  వంటి వాటిని చెప్పుకోవచ్చు.

సముద్రం లోని విశాల ఉపరితలం పై ఇవి పెరుగుతూ ఉంటాయి. వీటిలో పత్రహరితం ఉండటం వలన కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఇవి ఆహారాన్ని తయారుచేసుకొంటాయి. సూర్యరశ్మి ని ఉపయోగించుకొని పత్రహరితం సహాయంతో ఆహరం తయారుచేసుకోవడానికి సముద్రపు ఉపరితలం పైనే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. చాలా ఎక్కువ విస్తీర్ణం లో సముద్రం లో పెరుగుతూ ఉంటాయి. అందువలన ప్రపంచ వ్యాప్తం గా సంభవించే ఎటువంటి వాతావరణ మార్పులకైనా ఇవి వెంటనే స్పందిస్తూ ఉంటాయి.

భూమిపై కిరణ జన్య సంయోగ క్రియ లో సగం వీటి ద్వారానే ..

అంతే కాకుండా భూగోళం అంతా జరిగే కర్బన చక్రం లో కీలక పాత్ర వహిస్తాయి. భూమి మీద జరిగే కిరణ జన్య సంయోగ క్రియ లో సగం వీటి ద్వారానే  జరుగుతుంది.

భూమిపై ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ లో సగం వీటి ద్వారానే ..

అలాగే భూమి మీద ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ లో సగ భాగాన్ని ఇవే ఉత్పత్తి చేస్తాయి. నీటిలో కరిగిన కార్బన్ డయాక్సైడ్ ను ఉపయోగించుకొని సేంద్రియ కర్బన పదార్దాలు తయారు చేస్తాయి. భూగోళం పై జరిగే కర్బన చక్రం (కార్బన్ సైకిల్) లో వీటి పాత్ర చాలా ఎక్కువ .

అందుకే ఇప్పుడు నాసా ఈ phytoplankton పై పరిశోధనలు జరపడానికి ప్రత్యేక ఉపగ్రహాన్ని పంపింది. కర్బన చక్రం, ఆల్గే బ్లూమ్ తదితర అంశాలను క్షుణ్ణం గా పరిశీలించడం ద్వారా అనేక కొత్త విషయాలను తెలుసు కోవడానికి ప్రయత్నిస్తారు. సముద్ర జలాల నాణ్యత, జీవావరణం , మత్స్య సంపద మరియు ఆహార భద్రత వంటి అంశాలపై పరిశోధనలు చేస్తారు. భౌగోళికం గా తరచూ సంభవిస్తున్న మార్పులను గూర్చి అధ్యయనం చేయడం లో ఒక ముందడుగు ఈ PACE ఉపగ్రహ ప్రయోగం అని ఘంటాపథంగా చెప్పవచ్చు.