నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు.. ఇదొక కుట్ర సిద్ధాంతం
నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు.. ఇదొక కుట్ర సిద్ధాంతం
జీవితం లో నేను ఎన్నో కష్టాలు పడ్డాను… నా పిల్లలు అటువంటి కష్టం పడకూడదు…
నేను ఎంతో పేదరికం లో పుట్టి పెరిగాను… నా పిల్లలు అలా పెరగకూడదు… వాళ్ళను రిచ్ గా పెంచాలి..
నా చిన్నతనం లోనే నా తల్లిదండ్రులు చనిపోయారు… అనాధ గా పెరిగాను… నా పిల్లలు అలా పెరగకూడదు.
ఇలా అనుకొని మీ చేజేతులా మీరే మీ పిల్లల బంగారు భవిష్యత్తు ని సర్వ నాశనం చేసేస్తున్నారు… అవును.. ఇది నిజం…
మీలా కష్టాలు పడకూడదని అల్లారుముద్దుగా పెంచుతున్నారు… కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నారు.. స్కూల్లో టీచర్ పొరపాటున చిన్న దెబ్బ వేస్తే వెళ్లి ఆ టీచర్ ను బజారుకు ఈడ్చి అనరాని మాటలు అంటున్నారు.. చివరికి ఆ స్కూలే మార్చేస్తున్నారు…
మీ పిల్లలు ఏది కావాలంటే అది కొని పెడుతున్నారు… వాళ్ళు ఇది కావాలి అని అడగడానికంటే ముందుగానే వేలకు వేలు పోసి వాటిని సమకూర్చుతున్నారు.. ఏది కావాలంటే అది క్షణాల్లో సమకూరుస్తున్నారు.. వాళ్లకు కష్టం అంటే తెలియకుండా చూసుకుంటున్నారు…
మీ జీవితాన్నంతా ధార పోసి పిల్లల కోసమే అన్నీ పెట్టేస్తారు… మీ కోసం ఏదీ ఉంచుకోరు.. అంతా వాళ్ళ కోసమేగా అంటూ వేదాలు వల్లిస్తారు…
అల్లారుముద్దుగా పెంచుకున్న మీ అబ్బాయి మీకు తెలియకుండానే అనేక వ్యసనాల బారిన పడతాడు.. బాధ్యత లేకుండా పెరిగిన ఆ గాడిద ఏ గంజాయి కో డ్రగ్స్ కో అలవాటు పడిపోతాడు.. ఎంత డబ్బు కావాలన్నా మీరు ఇస్తారుగా.. ఎందుకంటే మీ బిడ్డ మీకులా పేదరికం లో ఉండకూడదు మరి
అలాగే అల్లారుముద్దు గా పెంచుకున్న మీ అమ్మాయి ఏ పోరంబోకు గాడితోనో చెట్టపట్టాలు వేసుకుని మీ ముందే తిరుగుతూ ఉంటుంది . ఆమె కోసమే లక్షలు పోసి సీటు కొని ఏ లోటూ లేకుండా ఆమెను చూసుకుంటే…. బాధ్యత లేని ఆ గాడిద కనీసం పదో తరగతి కూడా పాస్ కాని రోడ్ సైడ్ రోమియో గాడితో లేచిపోతుంది…
హలో…. హలో మైడియర్ తల్లిదండ్రులూ ఇప్పుడు చెప్పండి … మీరు చేసింది తప్పా ఒప్పా .. మా పిల్లలు అటువంటి వారు కాదు…. బంగారం అని సర్ది చెప్పుకుంటున్నారా … మీరు అనుకొనేది వంద శాతం తప్పు…. తప్పే కాదు… తప్పున్నర కూడా….
ఎందుకంటారా…. వాళ్లకి కష్టం తెలియకుండా పెంచారు. బాధ్యత తెలియకుండా పెంచారు.. మంచీ మర్యాదా తెలియకుండా పెంచారు. ఒక రూపాయి సంపాదించడం రాకుండా పెంచారు .. ఎల్ల కాలం మీరు ఉంటారా…. ఏదో ఒక రోజు మీరు గుటుక్కు మంటారు… అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ? ఇలా కష్టం తెలియకుండా , బాధ్యత తెలియకుండా పెరిగిన ఇలాంటి పిల్లల వల్లే కదా ఇన్ని హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి…. ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు ఇలాంటి వాళ్ళు.. ఇలాంటి వాళ్లనా మీరు సమాజానికి అందించేది….
పిల్లలకు అసలు కష్టం తెలియకుండా పెంచడం అనేది ఈ తరం తల్లిదండ్రులు సృష్టించుకున్న ఒక పెద్ద కుట్ర సిద్ధాంతం.. చిన్నప్పటినుండే పిల్లలకు కష్టాన్ని పరిచయం చెయ్యండి.. బాధ్యత ను అలవాటు చెయ్యండి… మంచీ మర్యాదా నేర్పండి.. వాళ్ళు బాగుపడతారు..జీవితం లో తల్లిదండ్రులు గా మీరు ఎంత కష్ట పడ్డారో వివరం గా వారికి చెప్పండి .. కష్టపడితేనే రేపు సుఖాన్ని అనుభవిస్తావు అని చిన్నప్పటి నుండే బోధించండి … మీ పిల్లలు బాగు పడతారు.. అటువంటి వారి వలన సమాజానికి కూడా ఉపయోగం ఉంటుంది.. ఆలోచించండి తల్లిదండ్రులూ