April 20, 2025

400 Seats for NDA| ఎన్డీయే కి 400 సీట్లు ఇవ్వండి- ప్రజాగళం సభలో మోడీ

తనను టెర్రరిస్టు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇంకా మోడీ మరచిపోలేదన్న విషయం ఈ సభ ద్వారా వ్యక్తమైంది. అలాగే చంద్రబాబు కంటే జగనే తన ఆప్త మిత్రుడు లేదా రహస్య మిత్రుడు అన్న విషయాన్ని మోడీ చెప్పకనే చెప్పారు. ఈ రెండు ప్రధానమైన విషయాలకు వేదిక అయ్యింది చిలకలూరి పేట లో జరిగిన ప్రజాగళం సభ.

400 seats for NDA - PM Modiji at palnadu

పల్నాడు ప్రజాగళం సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోడీ Pic credits : X @ Narendra modi

PM Modi Palnadu Meeting |urges 400 Seats for NDA| ఎన్డీయే కి 400 సీట్లు ఇవ్వండి- ప్రజాగళం సభలో మోడీ

తమ ఎన్డీయే ప్రభుత్వానికి 400 సీట్లు ఇవ్వాలని ప్రధాని మోడీ చిలకలూరి పేట లో జరిగిన ప్రజా గళం సభలో అన్నారు. తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ కూడా ఈ సభలో పాల్గొని ప్రసంగించారు.(PM Modi Palnadu Meeting)

తెలుగుదేశం, జనసేన తో పొత్తు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సారి ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసారు. 2014 లో బీజీపీ తో పొత్తు లో ఉన్న తెలుగుదేశం 2019 ఎన్నికలలో ఒంటరి గా పోటీ చేసి ఓడిపోయింది. దీనితో 2024 ఎన్నికలకు జనసేన మరియు బీజేపీ తో పొత్తు కుదుర్చుకొని ఎన్నికలకు వెళ్తోంది.

ఎవరెవరిని ఏమన్నారంటే …

అయితే గత ఐదు సంవత్సరాలు గా బీజీపీ కి తన వంతు సహకారం అందిస్తున్న వైసీపీ ని మోడీ ఏ విధం గా విమర్శిస్తారో అని అందరూ ఎదురు చూసారు. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎదురు చూసారు. కానీ మోడీ నోటి వెంట వైసీపీ ప్రభుత్వం పై ఎటువంటి విమర్శలూ రాలేదు. కేవలం జగన్ ప్రభుత్వం లోని కొందరు మంత్రులు అవినీతి చేయడం లో పోటీ పడుతున్నారు అని మాత్రమే అన్నారు. అలాగే వైసీపీ, కాంగ్రెస్ కూడా ఒకటే అంటూ విమర్శ చేసారు. ఇలా సాధారణ విమర్శలే తప్ప జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఎటువంటి పెద్ద విమర్శలూ చేయలేదు. ఇది ఒక రకం గా చంద్రబాబు కి, పవన్ కళ్యాణ్ కి ఒక ఎదురు దెబ్బ అనే చెప్పవచ్చు.(PM Modi Palnadu Meeting)

రహస్య ఒప్పందం ఏదైనా ఉందా వైసీపీ తో ..

గత ఎన్నికల్లో మోడీ చంద్రబాబు ను తీవ్రం గా విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు బాబు కి ఏటీఎం లా మారింది అంటూ తీవ్ర విమర్శ చేసారు. ఇప్పుడు జగన్ అవినీతి పై ఇటువంటి విమర్శే చేస్తారని బాబు, పవన్ ఎంతగానో ఎదురు చూసారు గాని మోడీ జగన్ ను పల్లెత్తు మాట అనలేదు. దీనితో మోడీ రహస్య వ్యూహం బట్టబయలు అయింది. పేరుకి టీడీపీ, జనసేనతో పొత్తులో ఉన్నప్పటికీ జగన్ ను ఒక రహస్య మిత్రుడిగా ఇప్పటికీ భావిస్తున్నారు మోడీ. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దాదాపు అన్ని బిల్లుల కీ వైసీపీ తన మద్దతు ప్రకటించింది.

ఎవరు గెలిచినా ఎన్డీయే కే మద్దతు ..(PM Modi Palnadu Meeting)

మరొక విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లోని 25 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ గాని, టీడీపీ గాని ఎవరు గెలిచినా మద్దతు ఇచ్చేది చివరికి బీజేపీ కే. కాబట్టి కర్ర విరగకుండా.. పాము చావకుండా తన ప్రసంగాన్ని కొనసాగించవలసి వచ్చింది మోడీ. ఇది ఒక రకం గా వైసీపీ కి ఉత్సాహాన్ని కలిగించే విషయం. టీడీపీ, జనసేన కలిసి బీజేపీ తో పొత్తు పెట్టుకుని అదే పెద్ద విజయం లా భావిస్తున్న ప్రస్తుత తరుణం లో పేట లో జరిగిన సభ లో మోడీ ప్రసంగం వారిని  తీవ్ర నిరాశ కు గురి చేసింది అని చెప్పవచ్చు.

ఉత్సాహం గా పవన్ ప్రసంగం 

సభ ప్రారంభం లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రసంగించారు. జగన్ పాలన ను అరాచక పాలన అంటూ దాదాపు అందరూ చీల్చి చెండాడారు. ప్రధాని వేదిక వద్దకు చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ముందుగా ప్రసంగించారు. ఆయన ప్రసంగం లో మోడీ ని పొగడ్తలతో ముంచెత్తారు. దానితో పాటు జగన్ పాలన అంతం కావాలని ఆకాంక్షించారు. తన ప్రసంగం లో ఆద్యంతం పురాణాలను ఉదహరిస్తూ మోడీ ని ప్రసన్నం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. పవన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నపుడు మోడీ లేచి వెళ్లి సభా ప్రాంగణం లోని స్తంభాలపై ఎక్కి కూర్చొన్న వారు అంతా దిగిపోవాలని స్వయం గా విజ్ఞప్తి చేసారు. (PM Modi Palnadu Meeting)

పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు…

చంద్రబాబు తన ప్రసంగం లో సింహ భాగం మోడీ ని పొగడ్తలతో ముంచెత్తారు. మోడీ ని విశ్వ గురు అంటూ ఆకాశానికి ఎత్తారు. వైసీపీ చేస్తున్న ఆకృత్యాలను చెప్తూ ఎన్డీయే ప్రభుత్వాన్ని అధికారం లోనికి తీసుకు రావాలని రాష్ట్రం లో జగన్ పాలన అంతం కావాలి అంటూ పిలుపు ఇచ్చారు.

పదే పదే మొరాయించిన మైకులు  (PM Modi Palnadu Meeting)

మోడీ ప్రసంగించడం ప్రారంభించిన కొద్ది సేపటికే మైకులు మొరాయించాయి. మోడీ ప్రసంగాన్ని పురందేశ్వరి తెలుగు లోనికి అనువదించారు. అనేక సార్లు మైకులు మొరాయించడం తో మోడీ ఒకింత అసహనం వ్యక్తం చేసారు. ఒక ప్రక్క అనువదించాల్సి రావడం, మైకుల అంతరాయం తో మోడీ సరిగ్గా ప్రసంగించ లేక పోయారు. కేంద్రం గత ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన విద్యాసంస్థల గురించి మాత్రం ప్రధాని ఏకరువు పెట్టారు. కేంద్రం ఇస్తున్న పధకాల గురించి వివరించారు. పీవీ నరసింహారావు గురించి, ఎన్టీ రామారావు గురించి మాత్రం ప్రస్తావించారు.

చంద్రబాబు, పవన్ గురించి ఏమన్నారంటే..

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. ప్రధాని ప్రసంగం లో తెలుగుదేశం పార్టీ పేరు గాని, జనసేన పార్టీ పేరు గాని ప్రస్తావించక పోవడం గమనార్హం. పవన్, చంద్రబాబు మోడీ గారిని ఆకాశానికి ఎత్తేసారు. అయితే మోడీ మాత్రం వీరిని ఉద్దేశించి ఇంకేమీ మాట్లాడలేదు. చంద్రబాబు ను రాష్ట్ర ముఖ్యమంత్రి గా చేయండి అని కూడా అనలేదు. దీనితో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశ కు గురయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాన్ పేర్లను కేవలం ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు.

జగన్ గురించి మోడీ ఏమన్నారంటే…

జగన్ ప్రభుత్వం లోని మంత్రులు అవినీతి చేయడం కోసం పోటీ పడుతున్నారని అన్నారు. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పై ఎక్కువగా విమర్శలు చేసారు.

అమరావతి, పోలవరం గురించి…(PM Modi Palnadu Meeting)

అమరావతి గురించి గాని, పోలవరం గురించి గాని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి గాని, ప్రత్యేక హోదా గురించి కాని, కడప ఉక్కు ఫాక్టరీ గురించి కాని మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ విషయాలపై ఏదైనా ప్రత్యేక ప్రకటన చేస్తారేమో అని అందరూ ఆసక్తి గా ఎదురు చూసారు. కానీ ప్రధాని నుండి ఎటువంటి స్పందనా లేదు. ఎన్టీఆర్ కు భారత రత్న గురించి కూడా ఏమీ ప్రస్తావించ లేదు. దీనితో టీడీపీ, జనసేన శ్రేణులు నిరాశ కు గురయ్యాయి.

ప్రధాని వ్యూహం ఏమిటి ?

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ సీట్ల లో కొన్ని వైసీపీ, కొన్ని ఎన్డీయే పక్షాలూ గెలుచుకుంటాయి. ఎవరు గెలిచినా ఎన్డీయే కే మద్దతు లభిస్తుంది. ఎందుకంటే బీజీపీ కి వైసీపీ కి ఉన్న రహస్య అవగాహన వలన వైసీపీ మద్దతు బీజేపీ కే ఉంటుంది. కాబట్టి ఎవరు గెలిచినా 25 సీట్ల మద్దతు తనకే లభిస్తుంది అన్నది వ్యూహం. అందుకే వైసీపీ ని ఏమాత్రం విమర్శించలేదు అనేది వాస్తవం.(PM Modi Palnadu Meeting)

వైసీపీ వ్యూహం కూడా మారవచ్చు…?

అయితే వచ్చే రెండు నెలలలో వ్యూహాలు మారి ప్రత్యేక హోదా ఇచ్చే వారికే మద్దతిస్తాం అంటూ వైసీపీ పాత పాట మళ్ళీ పాడితే మాత్రం కొంచం మార్పులు జరగవచ్చు. తను గెలిచే సీట్లతోనే ఎన్డీయే కు మద్దతు అవసరం అయితే మాత్రం తప్పకుండా ప్రత్యేక హోదా అంశం తెరమీదకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రత్యేక హోదా అంశమే తమ తొలి ప్రాధాన్యత అంటూ చెప్తోంది. ఒకవేళ కేంద్రం లో ఇండియా కూటమి అధికారం లోనికి రావడానికి తన మద్దతు అవసరం అయితే వైసీపీ ప్రత్యేక హోదా తో ముడిపెట్టి ఇండియా కూటమికి మద్దతు ఇవ్వవచ్చు కూడా. దానిని దృష్టి లో పెట్టుకొనే ప్రధాని వైసీపీ, కాంగ్రెస్ ఒకటే అంటూ కామెంట్ చేసారను కోవచ్చు. (PM Modi Palnadu Meeting)

ఏమైనప్పటికీ ప్రధాని ఎదురు దాడి చేస్తారని లోలోపల భయపడిన వైసీపీ శిబిరం లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. వైసీపీ ని ప్రధాని చీల్చి చెండాడుతారు అని భావించిన టీడీపీ, జనసేన శిబిరం లో మాత్రం తీవ్ర నిరాశ వ్యక్తమైంది.

PS: తనను టెర్రరిస్టు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇంకా మోడీ మరచిపోలేదన్న విషయం ఈ సభ ద్వారా వ్యక్తమైంది. అలాగే చంద్రబాబు కంటే జగనే తన ఆప్త మిత్రుడు లేదా రహస్య మిత్రుడు అన్న విషయాన్ని మోడీ చెప్పకనే చెప్పారు. ఈ రెండు ప్రధానమైన విషయాలకు వేదిక అయ్యింది చిలకలూరి పేట లో జరిగిన ప్రజాగళం సభ.