Propose Day Valentine Week – ప్రపోజ్ డే స్పెషల్ – వేచి ఉంటా నీకోసం
“ఈ ప్రపంచం అంచు మీద ఒక తూనీగ వాలింది… జారి పడతావ్ అని నేను ఎంత చెప్పినా వినిపించు కోలేదు అది ..” “అవునా…. పడిపోయిందా మరి ..” ఆసక్తి గా అడిగింది.. అంత పనీ అయ్యేదే… నా చూపుడు వేలుపై ఎక్కించుకొని దానిని కాపాడాను… ” అన్నాను.. “అయ్యో.. అసలు ఈ కాలం లో అందరూ ఇలాగే తయారయ్యారు అండి ..” అంది..
Propose Day Valentine Week- వేచి ఉంటా నీ కోసం
ప్రపోజ్ దినోత్సవం అనేకంటే… ప్రపోజ్ డే అంటేనే బాగుంటుంది… సపోజ్ ప్రపోజ్ దినోత్సవం అన్నామే అనుకోండి… ఇప్పటికే ఎప్పుడో ప్రపోజ్ చేసి ఆ రోజును గుర్తు చేసుకొంటున్న ఫీలింగ్ అయితే వస్తుంది.. కాబట్టి ఎప్పటి కప్పుడు ప్రపోజ్ డే అనుకొంటేనే బాగుంటుంది.. ఒకవేళ గతం లో ప్రపోజ్ చేసిన రోజు ఇదే అనుకోండి… సరిగ్గా సంవత్సరం తిరిగే సరికి ఆ ప్రేమ కొనసాగుతూ ఉంటే పర్వాలేదు.. పొరపాటున బ్రేక్ అప్ అనుకోండి.. ప్రపోజ్ డే కాస్తా ప్రపోజ్ దినోత్సవం అయిపోతుంది. ఇంతకూ డే మంచిదా…. దినోత్సవం మంచిదా….(Propose Day Valentine Week)
ఇలా ఆలోచిస్తూ ఒక సుందర ఉద్యానవనం లోనికి .. అదేనండి ఒక పార్కు లోనికి అడుగు పెట్టాను… బుర్రలో ‘డే’ అనాలో ‘దినోత్సవం’ అనాలో ‘దినం’ అనాలో అర్ధం కాని పరిస్థితి లో కూర్చున్నా ఒక దగ్గర….అక్కడొక గడ్డి చామంతి చేతిలో ఒక చిన్న గులాబీని పట్టుకొని ఆత్రం గా ఎదురు చూస్తోంది.. బహుశా ‘గడ్డి’ దాని ఇంటి పేరు అయ్యుంటుంది.. ‘చామంతి’ దాని అసలు పేరు అయ్యుంటుంది… లేకపోతే గడ్డి చేమంతి అని ఎందుకు పిలుస్తారు…’ జి. చామంతి ‘ అని రాసు కొంటుందేమో… ఏదో ఒకటి లెండి…
అసలే చామంతి… అదే గడ్డి చామంతి… దాని చేతిలో చిట్టి గులాబీ… ఎవరికో ప్రపోజ్ చెయ్యడానికేమో… చాలా ఆత్రం గా ఎదురు చూస్తుంటే… నేనడిగా… ప్రపోజ్ చేస్తున్నావా…. అని.. ‘అవును’ అంది గాలికి అటూ ఇటూ సన్నగా ఊగుతూ…. ‘ఎవరు’ అన్నాన్నేను… “నా బాయ్ ఫ్రెండ్ .. వస్తాడిప్పుడు..” అంది సన్నగా ఏదో పాట పాడుకుంటూ.. “ప్రేమ… ఎప్పటినుండి ….” అడిగాను ఆసక్తి గా…. “మొదటిసారి చూసినప్పటి నుండి .. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ” అంది..
“బాగుంటాడా …అంటే.. చూడ్డానికి ఎలా ఉంటాడు… ” నా మాట పూర్తి అయ్యే లోపే తను అందుకొని… “సూపర్ గా ఉంటాడు… కాసేపు ఇక్కడే ఉంటే.. చూపిస్తా మీకు కూడా ..” అంది. నాకు ఎందుకో ఈ ప్రేమకథ మీద ఆసక్తి పెరిగింది… అసలే దినం అనాలా.. దినోత్సవం అనాలా అన్న మీమాంస లో ఉన్నాన్నేను….
తనతో ఇంకా మాట్లాడదాం అనిపించింది… “నువ్వే ఒక అందమైన పుష్పానివి… నీ చేతిలో మరొక చిన్ని అద్భుతం.. నీ ప్రియుడు అంత స్పెషల్ ఆ….” అన్నాను.. “యెస్…. చాలా స్పెషల్… చాలా మంచోడు…” అంది.. “నువ్వు లవ్ చేస్తున్నట్టు తనకు తెలుసా ..” అడిగాను… “లేదు..లేదు… ఇంతవరకూ తనకు చెప్పలేదు… ప్రపోజ్ డే కదా… ఈ రోజు చెప్తాను… తను ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని దిగులుగా ఉంది ….” తన కంట్లో సన్నని నీటి పొర… నేను ఓదార్చాను…. “పర్లేదు… దిగులు పడకు… ఒప్పుకుంటాడు లే… అందాల రాశి వి…నిన్ను గాక ఇంకెవరు కావాలను కుంటాడు…” అన్నాను..
సాయంత్రం కాబోతోంది… ఇలా వచ్చి కూచోండి.. … తను ఇలాగే వస్తాడు…” అంటూ నన్ను మరొక చోట కూర్చోబెట్టింది… ఈ ప్రేమ కథ నాకు భలే థ్రిల్ అనిపించింది.. నాకు ఇంకా ఆసక్తి పెరిగిపోయింది.. చూద్దాం ఏం జరుగుతుందో అనుకున్నాను… “గుండె వేగం పెరుగుతోంది నాకు… ఏమైనా చెప్పండి నాకు .. తను వచ్చే వరకూ ..” అంది..
“ఈ ప్రపంచం అంచు మీద ఒక తూనీగ వాలింది… జారి పడతావ్ అని నేను ఎంత చెప్పినా వినిపించు కోలేదు అది ..” “అవునా…. పడిపోయిందా మరి ..” ఆసక్తి గా అడిగింది.. అంత పనీ అయ్యేదే… నా చూపుడు వేలుపై ఎక్కించుకొని దానిని కాపాడాను… ” అన్నాను.. “అయ్యో.. అసలు ఈ కాలం లో అందరూ ఇలాగే తయారయ్యారు అండి ..” అంది..
“ఇంకా అయిపోలేదు కథ.. దానిని వాళ్ళ అమ్మ దగ్గరకి తీసుకు వెళ్ళా… “ప్రేమా దోమా అని పిచ్చి వేషాలు వేస్తోంది.. వదిలేసి ఉండాల్సింది సారూ ..” అంటూ పిల్ల తూనీగ ని చితక్కొట్టింది తల్లి ..” అయిపోయింది అన్నట్టు చూసాను తన వైపు… “ప్రేమించడం తప్పు అంటారా …” అడిగింది నా కళ్ళలోనికి చూస్తూ…. “నో…. కాదు.. తప్పు కాదు…తప్పు కాదు….” కొంచం అరిచినట్టే చెప్పేసరికి ఉలిక్కి పడింది …
సాయంత్రం… ఆకాశం బంగారు రంగులో కనిపిస్తోంది… లేలేత సూర్య కిరణం ఒకటి మెల్లగా నడుచుకొంటూ వస్తోంది… తను కిరణ్… కుర్రాడు నాకు బాగా తెలుసు… ” మీరిక్కడ….” అంటూ ఒక్కసారి గా వంగి నా కాళ్ళకు నమస్కరించాడు…. పైకి లేపి తనను కౌగలించు కున్నాను.. ఒక్క సారిగా నా కళ్ళలో నుండి చిప్పిల్లిన కన్నీటి బొట్లు ఒక్కొక్కటి గా అతని సుందరమైన తలపై పడి… లోపలికి వెళ్ళిపోయాయి..
అప్పుడు గుర్తొచింది నాకు ఆ అమ్మాయి… అయ్యో.. నే మర్చి పోయా అనుకొంటూ వెనుదిరిగి చూసా….ఆశ్చర్య పోతూ నన్నే చూస్తోంది ఆమె.. తన దగ్గరగా వెళ్లాను… “తను మీకు తెలుసా …”అడిగింది… తెలుసు అన్నాను.. “తననే సార్… నేను ప్రేమించేది…” అంటూ చేతిలోని గులాబీని గట్టిగా పట్టుకొంది… అంతే పాపం ఆ గులాబీ ముల్లొకటి ఆమె చేతిలో గుచ్చుకొని రక్తం ధారాపాతం గా కారుతోంది…
కిరణ్ వేగంగా స్పందించాడు.. ఆమె చేతిలో గులాబీ తీసుకున్నాడు.. తన దగ్గర ఉన్న ఖర్చీఫ్ తో రక్తం కారకుండా కట్టు కట్టాడు.. ఆమె కళ్ళవెంట నీటి చుక్కల్ని తుడిచి వేసాడు.. ఆమె నుదుటి పై ముద్దు పెట్టాడు.. ఆప్యాయం గా కౌగలించు కున్నాడు.. నేను అక్కడ ఉన్నాననే విషయమే ఇద్దరూ మర్చిపోయారు… ఏవో ఆలోచనలలో ఉన్న నా దగ్గరికి వచ్చి… “అర్జంట్ గా వెళ్ళాలి .. ” అంటూ నా చేతిని ముద్దాడి…. క్షణం లో మాయం అయిపోయాడు తను..
ఆమె ఎలా ఉందో అని వెనుదిరిగి చూస్తే.. మెరుపుల కళ్ళతో తను… “ఈ చిట్టి గులాబీలు దొరకడం లేదు సార్..మళ్ళీ రేపుదయమే తను వచ్చేస్తాడు…. రోజూ తనకి ప్రపోజ్ చేస్తాను …” అంది… “తను నిన్ను ప్రేమిస్తున్నాడు పాపా…” అని అనాలనుకున్నా….
” మంచు తెరలను చీల్చుకొని వేకువ ఝామున వచ్చే తొలి కిరణం తను… రాత్రంతా తననే తలచుకొని ఎదురు చూస్తూ ఉంటానా… విశ్వ వేదిక పై నుండి ఉదయ నాదం చేసుకుంటూ నన్ను పలకరిస్తాడు సార్… రోజంతా తననే తలచు కుంటూ గడిపేస్తానా… సాయంత్రపు తెరలను చీల్చుకుంటూ ఈ పడమర దిక్కు నుండి వచ్చి పలకరించి వెళ్తాడు సార్… నేను జస్ట్ గడ్డి చేమంతి ని సార్.. మరి తను… ఈ విశ్వానికే వెలుగు సార్…. మీకు చాలా థాంక్స్ చెప్పాలి.. మీరు వచ్చిన వేళా విశేషం.. తను మొదటి సారి నన్ను కౌగలించు కున్నాడు.. నా నుదిటి పై ముద్దు పెట్టాడు.. ఈ క్షణం నేను చనిపోయినా పర్వాలేదు సార్.. ” అంటూ నా కాళ్ళకు నమస్కరించింది…
నా కళ్ళ వెంట ధారలు గా కన్నీళ్ళు… “వాడు నా కొడుకమ్మా…..” అని చెప్పాలనుకున్నా….. కాని నా గొంతు పూడుకు పోయింది… పడమర నా డ్యూటీ అయిపోయింది.. తూర్పు వైపుకు నా ప్రయాణం మొదలైంది… నా డౌట్ మాత్రం అలాగే ఉండి పోయింది .. ఇంతకీ దీన్ని ప్రపోజ్ డే.. అనాలా లేక ‘ప్రపోజ్ దినోత్సవం అనాలా ” అని….
” జ్ఞాపకాల నూతి గట్టు ” నుండి