Pulwama Terror Attack Real Stories |పుల్వామా దాడి ఎలా జరిగింది అంటే.. రియల్ స్టోరీ
ఒక్క క్షణం లో నలభై మంది వీరులు ప్రాణాలు కోల్పోయారు. భారత దేశ చరిత్ర లోనే అత్యంత విషాదకరమైన సంఘటన కు సాక్షీ భూతమైన వర్షపు చినుకులు సైతం కన్నీరై కురుస్తున్నాయి… ఈ సంఘటన జమ్మూ కాశ్మీరు లోని పుల్వామా జిల్లా లో జరిగింది. అవంతి పోరా దగ్గర లోని లేతా పోరా దగ్గర ఈ దారుణం జరిగి ఐదేళ్ళు .
Pulwama Terror Attack – Real Stories – పుల్వామా దాడి ఎలా జరిగింది అంటే… రియల్ స్టోరీ
సాయంత్రం మూడు గంటలు… పల్చగా నీరెండ పరచుకొని ఉంది… ఏ క్షణమైనా వర్షం పడేలా ఉంది..(Pulwama Terror Attack)
జమ్మూ లోని బేస్ క్యాంప్… సి ఆర్ పి ఎఫ్ సైనికులతో సందడి గా ఉంది. ఒకరినొకరు పలకరించు కొంటున్నారు.. క్యాంప్ లో ఇంకా కొంత మంది సైనికులు రిపోర్ట్ చేస్తున్నారు. సెలవుకి ఇంటికి వెళ్లి వచ్చిన వాళ్ళే అంతా…
“హాయ్ అన్నా సూరజ్ అన్నా…… ఎప్పుడు వచ్చావ్ అన్నా.. వదినమ్మ ఎలా ఉంది… పిల్లలు బాగున్నారా…” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు వీరేంద్ర… (పాత్రల పేర్లు అసలు పేర్లు కాదు )
“తమ్ముడూ .. ఇందాకే వచ్చా ..అందరూ బాగానే ఉన్నార్రా… మీ వదిన మాత్రం ఏడుస్తూనే ఉంది.. ఎప్పుడూ లేదు .. వెళ్లొద్దు ఇంక అంటూ ఒకటే ఏడుపు.. పిల్లలు ఓకె… వాళ్ళే వాళ్ళ అమ్మను ఊరుకో బెట్టారు.. ఎందుకో ఫస్ట్ టైం.. నాకూ ఉండిపోవాలని పించింది రా ..” అన్నాడు సూరజ్ వీరూ భుజం పై చెయ్యి వేస్తూ..
రెండు చేతులు కట్టుకొని .. తల ప్రక్కకు తిప్పి ఏటో చూస్తున్న వీరేంద్ర ను ఒక్క సారిగా కదిలించి చేత్తో అతని తలని తన వైపుకు లాగే సరికి… వీరేంద్ర కళ్ళ నుండి .. నులి వెచ్చని కన్నీటి బొట్లు సూరజ్ పై పడ్డాయి… సూరజ్ ను గట్టిగా కౌగలించుకొని మౌనం గా రోదిస్తున్నాడు వీరూ..
రెండు నిమిషాల అలాగే పొదివి పట్టుకొని…తనని మెల్లగా నడిపించు కొంటూ ప్రక్కనే ఉన్న బెంచ్ పై కూర్చోబెట్టాడు… “ఏమైంది తమ్ముడూ.. ఇంట్లో ఏదైనా సమస్యా… ఏం జరిగింది రా… అందరూ బాగానే ఉన్నారా…. అమ్మకి ఏమైనా బాగోలేదా..” ప్రశ్నల వర్షం కురిపించాడు… సూరజ్.. అప్పుడే సన్నగా చినుకులు కూడా ప్రారంభం అయ్యాయి..(Pulwama Terror Attack)
“ఏం లేదన్నా… అంతా బానే ఉంది… దియా రాత్రంతా ఏడుస్తూనే ఉంది.. నన్ను వెళ్ళవద్దు అని… అనన్య నేను అసలు ఊరుకో బెట్టలేక పోయాం..”
“అదా తమ్ముడూ… అంతా సర్డుకొంటుంది లే.. బాధ పడకు.. మనకు ఇదంతా మామూలే గా …” అన్నాడు సూరజ్…
“అంటే అన్నా.. మర్చిపోయావా.. ఈ రోజు ఫిబ్రవరి 14.. వాలెంటైన్స్ డే.. అంత కంటే ఎక్కువ మ్యారేజ్ డే అన్నా.. నువ్వే కదా అనన్య కి నాకూ దగ్గరుండి పెళ్లి జరిపించావ్… ఈ రోజు తన దగ్గర ఉండలేక పోయాను..” అంటూ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకున్నాడు వీరేంద్ర… మళ్ళీ తనే అందుకొని.. “ఈ రోజు దియా పుట్టిన రోజు కూడా అన్నా… పాప నన్ను గట్టిగా చుట్టుకొని పడుకొంటే… మెల్లగా విడిపించుకొని వచ్చేసా అన్నా…” అంటూ కన్నీళ్లు తుడుచుకొన్నాడు వీరేంద్ర..
“భలే చిత్రం గా ఉంది.. ఎప్పుడూ లేనిది అక్కడ మీ వదిన ఏడుపు.. ఇక్కడ మీ పాప ఏడుపు… మనం కొంచం బంధాలకు దూరం గా ఉండాలి రా .. ప్రస్తుతం వేలీ లో పరిస్థితి ఏం బాగోలేదని కదా మనల్ని పిలిపించారు.. మనం ఇప్పడు డ్యూటీ లో ఉన్నాం .. మర్చి పోకు.. డ్యూటీ తర్వాతే మనకు ఏదైనా.. నా లగేజ్ తీసుకు వస్తాను… మనిద్దరం ఒకే బస్సు లో వెళ్తున్నాం.. బస్ లో మాట్లాడు కుందాం… హేపీ గా ఉండరా…” అంటూ ఒక్కసారి గట్టిగా వీరేంద్ర ని హత్తుకొని వెళ్ళాడు సూరజ్…
సూరజ్ తో మాట్లాడాక.. బరువంతా దిగిపోయినట్లు అనిపించింది వీరేంద్ర కి.. ఇప్పుడు మనసుకు హాయిగా ఉంది… దియా ని ఈ రోజు కాకపోతే మరొక రోజు కలుస్తా.. దేశం కష్టం లో ఉన్నపుడు దేశం కోసం పోరాడాల్సిందే… ఆ తర్వాతే అన్నీ .. అనుకొంటూ తన పాకెట్ లో ఉన్న మువ్వన్నెల జండా ని ఒకసారి తడిమి చూసుకున్నాడు వీరేంద్ర..
ఈ లోపు సూరజ్ కూడా వచ్చేసాడు… “తమ్ముడూ మన 76 బెటాలియన్ అంతా ఒక బస్సు లోనే… ఏం జనం రా బాబూ.. ఈ రోజు కాన్వాయ్ లో ఎంతమంది వెళ్తున్నామో తెలుసా… అక్షరాలా 2547 మంది…. రెండువేల ఐదు వందల నలభై ఏడు మంది .. జనరల్ గా కాన్వాయ్ లో వెయ్యి మంది కంటే ఎక్కువ పంపరు కదా.. ఏదో ఎమర్జెన్సీ ఉంది తమ్ముడూ ..”అని అంటూ ఉండగానే… బస్సు దగ్గరకు వచ్చారు..
విశాలమైన పెరేడ్ గ్రౌండ్స్ లో మొత్తం 78 బస్సులు వరుసగా నిలబెట్టి ఉన్నాయి… ఇద్దరూ బస్ ఎక్కి కూర్చున్న పది నిమిషాలకు సైరన్ మ్రోగింది.. బస్సులు ఒకదాని వెనుక మరొకటి మెల్లగా బయల్దేరాయి.. బస్సు లో మిగతా మిత్రులు అందర్నీ పలకరించారు సూరజ్ వీరేంద్ర… నలభై మంది ఉన్నారు బస్సులో ….
అందరూ ఇళ్ళకు వెళ్లి వచ్చి డ్యూటీ లో జాయిన్ అయిన వారే… తమ కుటుంబం తో గడిపిన మధుర క్షణాలను ఇంకా గుర్తుకు తెచ్చు కుంటున్న వారు చిరునవ్వుతో మౌనం గా కూర్చొని ఉన్నారు.. ఆ ప్రేమానుబంధం తమను కట్టి పడ వేయకూడదు అనుకొంటున్న వారు.. గట్టిగా మాట్లాడుతున్నారు..జోకులు వేస్తున్నారు.. పాటలు పాడుతున్నారు.. మొత్తమ్మీద బస్సు లో సందడి వాతావరణం నెలకొంది…
జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి పై మొత్తం 78 బస్సులు ఒక మోస్తరు వేగం తో కదులుతున్నాయి. సైనికులు వెళ్ళడానికి వీలుగా గత రెండు రోజులు గా హైవే లో రాకపోకలు నిలిపి వేసారు.. బస్సులకు ముందుగా ఎస్కార్టు వాహనాలు రోడ్ ను పరిశీలించు కొంటూ వెళ్తున్నాయి.. అధికారులు ఎప్పటికప్పడు మాట్లాడుకుంటున్నారు.. ఇంత ఎక్కువ మంది సైనికులను ఒకేసారి ఇలా రోడ్డు మార్గం లో తరలించడం ఇదే మొదటిసారి.
“ఎటువంటి అవాంతరం లేకుండా సాయంత్రానికల్లా శ్రీనగర్ చేరిపోతే అదే సంతోషం ” అన్నాడు ముందు ఎస్కార్టు వాహనం లో ఉన్న సీనియర్ పోలీస్ అధికారి… ఎందుకో అతని మనసు కీడును శంకిస్తోంది… ఎందుకంటే… ఇదే హైవే లో ఎదురు కాల్పుల సంఘటనలు చాలా జరిగాయి. ఉగ్ర వాదులు ఎటునుండి వస్తారో ఊహించడం చాలా కష్టం… ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడు తండ్రీ అనుకొంటూ దేవుడిని ప్రార్దించు కొంటున్నాడు ఆయన… అది గమనించి వెహికల్ నడుపుతున్న మరో అధికారి.. ఏం జరగదులే భాయ్.. టెన్షన్ పడకు ” అంటూ ధైర్యం చెప్పాడు..
మౌనం గా కూర్చొన్నాడు వీరేంద్ర.. బస్ ఎక్కిన దగ్గర నుండి మాట్లాడుతూనే ఉన్నాడు సూరజ్.. వయసులో తనకంటే జస్ట్ ఒక సంవత్సరం పెద్ద అంతే.. తనేదో పెద్ద ముసలి వాడు అయినట్టు.. వీరూ ఏదో చిన్న పిల్లాడు అయినట్టు మాట్లాడుతుంటే.. వీరేంద్ర కి బాగా నచ్చుతుంది.. అందుకే ఎప్పుడూ తను వింటుంటాడు… సూరజ్ మాట్లాడుతూనే ఉంటాడు…
ఉన్నట్టుండి కిటికీ లో నుండి చెయ్యి చూపిస్తూ “వీరూ అదిగో అక్కడేరా… 2016 లో మనవాళ్ళు ఎనిమిది మంది వీర మరణం పొందింది ఈ లోత్ పారా లోనే … ఇక్కడకి కొద్ది దూరం లోనే కమాండో ట్రైనింగ్ సెంటర్ ఉంది. 2017 డిసెంబర్ లో ఆ సెంటర్ లో ఉగ్రవాదులు చొరబడి మరీ ఐదు మందిని పొట్టన పెట్టుకున్నార్రా … ఊరి సంఘటన నీకు తెలిసిందే గా 19 మంది ఆర్మీ జవాన్లు చనిపోయారు.. ” చెప్పుకుంటూ పోతున్నాడు సూరజ్…
“చావుకి భయపడిందే లేదు.. నాన్న మిలటరీ లో పెద్ద రాంక్ లో ఉన్నపుడు ఈ కాశ్మీర్ లోయలోనే ఉగ్రవాదుల తూటాలకు బలై పోయాడు.. దేశం కోసం పోరాడాలి.. ప్రాణం పోయినా పర్లేదు… ఈ కాశ్మీర్ లోయలో ఉగ్ర ముఠాల ఆట కట్టించ డానికి దేనికైనా సిద్ధమే తను…” అనుకున్నాడు వీరూ
ఇంతలో.. “ఏంట్రా ఇది” అన్నాడు సూరజ్ తన చేతిపై చిన్న గాయాన్ని చూపిస్తూ…. “అదా.. దియా రా… తన చిన్ని గోళ్ళతో రక్కేసింది.. రెండేళ్ళ పిల్ల తనకేం తెలుస్తుంది..” అంటూ తన చూపుడు వేలితో ఆ గాయం పై మెల్లగా రుద్డుతుంటే.. అప్రయత్నం గా రాబోతున్న కన్నీటిని .. కను రెప్పలతోనే నొక్కిపట్టి నియంత్రించేసాడు వీరేంద్ర..
కచ్చితం గా అదే సమయానికి…అక్కడికి జస్ట్ రెండు కిలోమీటర్ల దూరం లో హైవే కి కొంచం దూరం గా… కార్లో కూర్చొని ఉన్నాడు అదిల్..
స్టీరింగ్ పై రెండు చేతులు బిగించి ఉన్నాయి.. కుడి చేతి పిడికిలి బిగించి స్టీరింగ్ పై కొట్టాడు.. ఒక్కొక్క వేలు తెరిచి లెక్కపెడుతున్నాడు. చిటికిన వేలు ఒకటి అయితే బొటనవేలు ఐదు అయ్యింది… ఇంకా లెక్క సరిపోలేదు.. ఎడమ చేతి పిడికిలి తో స్టీరింగ్ పై గట్టిగా కొట్టాడు.. చిటికిన వేలు తెరిచి గట్టిగా అరిచాడు “ఆరు” అని… అతని కళ్ళు కసితో ఎరుపెక్కి ఉన్నాయి..
అతని ముందున్న లక్ష్యం పగ తీర్చు కోవాలి. ఒకటి కాదు రెండు కాదు ఆరు సార్లు అరెస్టు చేసారు తనని కాశ్మీరు పోలీసులు.. కొట్టారు కూడా.. అప్పుడే నిర్ణయించు కున్నాడు వాళ్ళపై పగ తీర్చు కోవాలని.. ఇప్పుడు తన ఆశయం నెరవేరబోతోంది… పోలీస్ కి నేనేంటో చూపిస్తా అంటూ ఊపిరి ఎగబీల్చి అరుస్తున్నాడు..
సిగ్నల్ వస్తే అంతే ఇక.. ఫోన్ కోసం చూస్తున్నాడు … మొత్తం మూడు వందల కిలోల పేలుడు పదార్ధం… ఆర్ డీ ఎక్స్ దాదాపు వంద కిలోలు ఉంటుంది.. కారు అంతా పేలుడు పదార్ధం.. పక్కనే ఉన్న జెలెటిన్ స్టిక్స్ ని తడిమి చూసాడు.. “చరిత్ర లో నిలచిపోతాడు అదిల్… ” అంటూ తనని తాను ఉద్రేక పరచుకొంటున్నాడు.. సరిగ్గా అప్పడు.. ఫోన్ రింగయ్యింది.. రెండు నిమిషాల్లో బస్సులు అక్కడికి చేరుకుంటాయి .. రెడీ గా ఉండు” అవతల స్వరం అరచినట్టే చెప్పింది.. కార్ స్టార్ట్ చేసాడు అదిల్
బస్సులు కొంచం వేగం గానే వెళ్తున్నాయి.. బస్సులలో ఉన్న సైనికులు ఉత్సాహం గా పాటలు పాడుకుంటున్నారు… “కొంచం నిద్ర వస్తోంది అన్నా…” అంటూ వీరూ తన భుజం పై వాలబోతుంటే.. తన దగ్గరకు తీసుకొని భుజం పై పడుకోబెట్టుకొన్నాడు సూరజ్..
దూరం గా ఎస్కార్టు వాహనాల తర్వాత బస్సులు కనిపించాయి అదిల్ కి… గట్టిగా అరుస్తున్నాడు.. పిడికిలి బిగించి స్టీరింగ్ పై కొడుతున్నాడు.. మొత్తం 78 బస్సులు..ఒక్కొక్కటి గా వెళ్ళిపోతున్నాయి బస్సులు.. ఉన్మాదం తో కారు ముందుకి కదిలించాడు అదిల్..
వీరూ ని పట్టుకుని తనూ కంట నీరు పెట్టుకున్నాడు సూరజ్… కళ్ళు మూసుకొని వీరేంద్ర పై తనూ తల వాల్చి పడుకున్నాడు…
సమయం మద్యాహ్నం 3.15 గంటలు
అంతే….
ఒక్క సారిగా .. పెద్ద విస్పోటనం… పెద్ద శబ్దం… ఆ ప్రదేశమంతా పొగ తో నిండి పోయింది.
నలభై మంది తో వెళ్తున్న ఆ బస్సు ను వేగం గా కారు తో డీ కొట్టాడు అదిల్… క్షణాల్లో భారీ శబ్దం తో పేలుడు…. బస్సు చిన్నా భిన్నం అయిపొయింది.. తెగిన శరీర భాగాలతో ఆ ప్రాంతం అంతా నిండి పోయింది. బస్సు ఆకారాన్నే కోల్పోయి ఇనుప రేకుల ముద్ద గా మారిపోయింది…
ఆ పేలుడు శబ్దం దాదాపు 10 కిలోమీటర్ల వరకూ వినిపించింది. ఆ ప్రాంతం అంతా గన్ పొడర్ తో నిండిపోయింది… వేరే బస్సు లో వెళ్తున్న వారు కూడా తీవ్రం గా గాయ పడ్డారు..
వెంటనే కాల్పులు ప్రారంభం అయ్యాయి.. వర్షం పడుతోంది… ఆ ప్రదేశం లోనికి ఎవరూ వెళ్ళలేని పరిస్థితి.. ఒక్క క్షణం లో నలభై మంది వీరులు ప్రాణాలు కోల్పోయారు. భారత దేశ చరిత్ర లోనే అత్యంత విషాదకరమైన సంఘటన కు సాక్షీ భూతమైన వర్షపు చినుకులు సైతం కన్నీరై కురుస్తున్నాయి… ఈ సంఘటన జమ్మూ కాశ్మీరు లోని పుల్వామా జిల్లా లో జరిగింది. అవంతి పోరా దగ్గర లోని లేతా పోరా దగ్గర ఈ దారుణం జరిగింది. Pulwama Terror Attack
——————–
టీవీ లో డయానా రోమా చూస్తున్న దియా చేతిలోనుండి రిమోట్ తీసుకొని ఎందుకో గాని న్యూస్ చానల్ పెట్టింది అనన్య.. జరిగిన ఘోరాన్ని బాధ తో వివరిస్తున్నారు న్యూస్ రిపోర్టర్లు.. ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల పేర్లు స్క్రీన్ పై కనిపిస్తున్నాయి.. వీరేంద్ర పేరు కనిపించింది…. పరిగెత్తుకుంటూ అత్తగారి దగ్గరకు వెళ్లి భోరున ఏడ్చేసింది అనన్య… ఇదేమీ తెలియని దియా.. మళ్ళీ రిమోట్ వెతుక్కొని డయానా రోమా చూసుకొంటోంది..
సూరజ్ ఇంట్లో ఇదే పరిస్థితి .. రాత్రే కదమ్మా.. నాన్న మన దగ్గర నుండి వెళ్లిందీ అంటూ ఏడుస్తున్నారు పిల్లలు…. భారతదేశం మొత్తం దిగ్బ్రాంతి కి గురైంది.. ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల కుటుంబాలకు బాసట గా ఉండాలని పిలుపు నిచ్చారు ప్రధాని మోడీ.. ఫిబ్రవరి 14, 2019.. అనేక సైనిక కుటుంబాల ఆశలను తుంచివేసిన రోజు… బ్లాక్ డే… చీకటి రోజు గా మిగిలిపోయింది.. జడలు విప్పిన ఉగ్రవాద భూతం లేత జీవితాలను చిదిమేసింది… ప్రతి ఒక్క భారతీయుని మనసు గాయపడిన రోజు అది (పై సంభాషణలు కేవలం కల్పితం)
PS: ఉగ్రవాద దాడి తో రగిలి పోయింది భారత దేశం… సైన్యానికి మానసిక స్థైర్యం కలిగించాలి… భారత దేశ అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం రహస్యం గా జరిగింది.. ఉగ్రవాదులపై దండయాత్రకు పథకం సిద్ధం అయ్యింది.. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియ నివ్వలేదు. అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
రహస్యం గా ఆపరేషన్ జరగబోతున్న రోజు.. ఫిబ్రవరి 26, 2019 అర్ధరాత్రి… ( Pulwama Terror Attack)
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిరేజ్ 2000 రకానికి చెందిన పన్నెండు యుద్ధ విమానాలు పాకిస్తాన్ వైపు బయల్దేరాయి. మెరుపు వేగం తో దాడిచేసే కమెండో లను తీసుకొని లైన్ ఆఫ్ కంట్రోల్ ను దాటేసాయి మన యుద్ధ విమానాలు… perfect plan తో చీకట్లోనే ముందుకు సాగుతున్నాయి దళాలు… పాక్ ఆక్రమిత కాశ్మీరు లోని ఖైబర్ పక్తున్యా ప్రావిన్స్ లో భీకరం గా అటాక్ చేసారు. ఈ ప్రదేశం బాలాకోట్ పట్టణానికి దగ్గరగా ఉంటుంది.. బాంబుల దాడి తో ఆ ప్రదేశం దద్దరిల్లింది..
ఇజ్రాయెల్ లో తయారైన ఐదు Spice 2000 బాంబులను బాలాకోట్ లోని లక్ష్యాల పై వేసారు. దాదాపు 350 మందికి పైగా ఉగ్రవాదులు చంపబడ్డారు. ఎంత వేగం గా వచ్చాయో అంతే వేగం గా వెనుదిరిగి వచ్చాయి మన యుద్ధ విమానాలు. తెల్లవారుజామున 3.45 గంటలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా ఫోన్ చేసి చెప్పారు “కోతి చంపబడింది – బందర్ మర గయా “ అని.. ఈ మొత్తం ఆపరేషన్ కు రహస్యం గా పెట్టిన పేరు ‘ఆపరేషన్ బందర్’ . తనకు సమాచారం అందిన వెంటనే ప్రధానికి ఫోన్ చేసి విషయం చెప్పారు దోవల్.
భారత్ చేసిన ప్రతీకార దాడి లో దాదాపు 350 మందికి పైగా ఉగ్రవాదులు చంపబడ్డారు. అయితే పాకిస్తాన్ ఒప్పుకోలేదు. బాంబులు నిర్జన ప్రదేశాలలో పడ్డాయని చెప్పింది.
ఇంకా ఈ ఉద్రిక్తత ముగిసి పోలేదు…
బాలాకోట్ దాడులు జరిగిన వెంటనే పాకిస్తాన్ భారత యుద్ధ విమానాలపై దాడి చేసింది.. అప్ గ్రేడ్ చేసిన MIG – 21 యుద్ధ విమానం నడుపుతున్న అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ కు చెందిన ఒక ఖరీదైన యుద్ధ విమానాన్ని కూల్చి వేసారు. అయితే పాకిస్తాన్ ఫైటర్లు మిగ్ విమానాన్ని కూల్చి వేసారు. అభినందన్ వర్ధమాన్ దాదాపు అరవై గంటల పాటు పాకిస్తాన్ చెరలో ఉన్న తర్వాత దౌత్య ప్రయత్నాలతో మార్చి ఒకటవ తేదీన భారత్ కు తిరిగి చేరుకున్నారు.
(ఈ వ్యాసం ఇంటర్ నెట్ లో దొరికిన కథనాల ఆధారం గా రాయడం జరిగింది. సంభాషణలు పూర్తిగా కల్పితం)
It’s very hurting sir😣🥺😭😭
అవును అండి… జస్ట్ ఊహించు కోవడానికే అలా ఉంటే… నిజం ఇంకా భయంకరం గా ఉండి ఉంటుంది….. thank you