RCB VS SRH Match 30 IPL 2024 }రికార్డులు బద్దలు గొట్టిన సన్ రైజర్స్|
బంతి పిచ్ మీద కంటే… బౌండరీ లైన్ వెలుపల.. ఇంకా చెప్పాలంటే స్టేడియం బయటకు పోవడానికే ప్రయత్నించింది. ఆకాశం లో తానూ ఒక నక్షత్రం అయిపోవడానికే శతవిధాలా ప్రయత్నించింది. నన్ను కాపాడండి రా బాబూ అంటూ.. స్టేడియం లోని ప్రేక్షకుల చేతులలో సిక్సర్ గా మారిన ప్రతిసారీ వారిని వేడుకొంది.. అరవీర భయంకరం గా ఆడుతున్న బ్యాట్స్ మన్ ను తప్పించుకోవడానికి అనేక బంతులు వైడ్ లుగా మారిపోయాయి.
RCB VS SRH Match 30 IPL 2024|- రికార్డులు బద్దలు గొట్టిన సన్ రైజర్స్
ఎవరైనా కొత్త రికార్డు సృష్టించినప్పుడు అభినందిస్తాం. వారు సృష్టించిన రికార్డును వారే తిరగరాస్తే అపూర్వం అంటాం.. అద్భుతం అంటాం.. అభినందనలతో ముంచెత్తుతాం… రికార్డులు బద్దలయ్యే క్షణాలను చూసి తరించినందుకు …. సగటు క్రికెట్ అభిమానిగా చాలా కాలం గుర్తు పెట్టుకుంటాం. ఏదైనా ఆ మ్యాచ్ తర్వాతే… అంటూ వీలైనన్ని సార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాం. కుదిరితే మ్యాచ్ హైలెట్స్ మళ్ళీ మళ్ళీ చూస్తూ ఆ క్షణాలను ఆస్వాదిస్తూ ఉంటాం… ఇలాంటి మ్యాచ్ లు జరగాలని ఏ క్రికెట్ అభిమాని కోరుకోకుండా ఉంటాడు చెప్పండి… అదిగో… సరిగ్గా అటువంటి మ్యాచే ఐపిఎల్ 2024 లో జరిగింది.RCB VS SRH Match 30 IPL 2024
కొడుతున్నారు సార్.. అంటూ వాపోయిన బంతి…
బంతి పిచ్ మీద కంటే… బౌండరీ లైన్ వెలుపల.. ఇంకా చెప్పాలంటే స్టేడియం బయటకు పోవడానికే ప్రయత్నించింది. ఆకాశం లో తానూ ఒక నక్షత్రం అయిపోవడానికే శతవిధాలా ప్రయత్నించింది. నన్ను కాపాడండి రా బాబూ అంటూ.. స్టేడియం లోని ప్రేక్షకుల చేతులలో సిక్సర్ గా మారిన ప్రతిసారీ వారిని వేడుకొంది.. అరవీర భయంకరం గా ఆడుతున్న బ్యాట్స్ మన్ ను తప్పించుకోవడానికి అనేక బంతులు వైడ్ లుగా మారిపోయాయి. బౌలర్ తన వేళ్ళతో ఎంత నియంత్రణ చేయాలనుకున్నా బంతులు అతని మాట వినలేక పోయాయి… ఒక్క మాట లో చెప్పాలంటే… ఈ మ్యాచ్ లో బంతులు భయపడ్డాయి.. మైదానం లో ఆటగాళ్ళ దగ్గర కంటే… స్టేడియం లోని ప్రేక్షకుల దగ్గరే ఎక్కువసేపు ఉన్నాయి. ‘వాళ్ళు పిచ్చ కొట్టుడు కొడుతున్నారు సార్’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాయి.RCB VS SRH Match 30 IPL 2024
సన్ రైజర్స్ మరియు RCB మధ్య బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం లో క్రికెట్ బంతి పెట్టుకున్న గోడు ఇది…. చిన్నస్వామి స్టేడియం లో హాజరైన వేలాది మంది క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్ ఇది. రెండు ఇన్నింగ్స్ లో కూడా పరుగుల వరద పారింది. ‘న భూతో న భవిష్యత్’ అనే రీతిలో ఈ మ్యాచ్ జరిగింది. రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఐదు వందలకు పైగా పరుగులు నమోదయ్యాయి.
ఐపీఎల్ చరిత్ర లోనే అత్యధిక పరుగుల రికార్డు
సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ సెషన్ లోనే స్థాపించిన రికార్డును తానే తిరగరాసింది. ముంబై ఇండియన్స్ పై ఈ ఐపీఎల్ సెషన్ లోనే 277 పరుగుల అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఈ రికార్డును తానే తిరగరాస్తూ RCB పై 287 పరుగుల అత్యధిక స్కోరును నమోదు చేసి ఐపీఎల్ చరిత్ర లోనే అత్యధిక స్కోరును చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఒకే జట్టు వరుసగా రెండు సార్లు 270 కు పైగా పరుగులు సాధించడం ఇదే మొదటిసారి. ఇదంతా ఒక ఎత్తు అయితే రాయిల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది.
ధీటుగా సమాధానమిచ్సిన RCB (RCB VS SRH Match 30 IPL 2024)
288 పరుగుల విజయలక్ష్యం తో బరిలోనికి దిగిన RCB కేవలం 25 పరుగుల తేడా తో ఓడిపోయిందంటే.. అతి స్వల్ప తేడా తో ఓడిపోయిందంటే.. RCB పోరాట పటిమ ను కూడా అభినందించక తప్పదు… ఇరుజట్లు అత్యున్నత ప్రదర్శన ఇచ్చాయి. ప్రేక్షకులకు పైసా వసూల్ మ్యాచ్ ఇది. ఐపీఎల్ చరిత్ర లోనే ఎప్పటికీ మరచిపోలేని మ్యాచ్ ఇది… సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ‘విజయ్ న్యూస్ ‘ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.RCB VS SRH Match 30 IPL 2024
చెలరేగి ఆడిన ట్రావిస్ హెడ్, క్లాసెన్ (RCB VS SRH Match 30 IPL 2024)
బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియం లో SRH మరియు RCB జట్ల మధ్య మ్యాచ్ నంబర్ 30 జరిగింది. మొదట టాస్ గెలిచిన RCB ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనితో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఓపెనర్స్ మొదటి ఓవర్ నుండే దూకుడు గా ఆడారు. మొదటి ఓవర్ లో ట్రావిస్ హెడ్ ఒక ఫోర్ కొట్టి తన ఆగమనాన్ని చాటడం జరిగింది. మొదటి ఓవర్ లో 7 పరుగులు లభించాయి. 2 వ ఓవర్ లో అభిషేక్ శర్మ, హెడ్ కలిసి రెండు సిక్సర్లు, ఒక ఫోర్ తో కలిపి 20 పరుగులు సాధించారు. 3 వ ఓవర్ లో కేవలం 4 పరుగులు లభించాయి. ఇక ఇక్కడ నుండి ట్రావిస్ హెడ్ చెలరేగి పోయాడు. 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది సన్ రైజర్స్. 108 పరుగుల వద్ద సన్ రైజర్స్ మొదటి వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ట్రావిస్ హెడ్ విద్వంసం కొనసాగింది. 8 సిక్సర్లు, 9 ఫోర్లతో కేవలం 41 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అవుట్ అయ్యాడు ట్రావిస్ హెడ్. క్రిస్ గేల్ తరహా లో తన సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు హెడ్. ఇంతకు ముందు RCB తరపున కూడా ఆడాడు ట్రావిస్ హెడ్.
మరొక ప్రక్క కుదురుకున్న క్లాసెన్ రెచ్చి పోయాడనే చెప్పాలి. మొత్తం 7 సిక్సర్లు, 2 ఫోర్ల తో కేవలం 31 బంతుల్లో 67 పరుగులు చేసాడు మన కూకట్ పల్లి క్లాసెన్. జట్టు స్కోరు 231 పరుగుల వద్ద క్లాసెన్ యొక్క క్లాసికల్ ఇన్నింగ్స్ కు తెరపడింది.