Salute to Mother – Telugu Poetry అమ్మకు వందనం … అమ్మ కోసం ఏదో ఒకటి చెయ్
అమ్మ కళ్ళలో నే చూసిన
మెరుపులే నాకు ఆస్కార్ ….
ఆనందం తో అమ్మ నా బుగ్గపై
పెట్టిన చిరు ముద్దే నాకు నోబెల్….
Salute to Mother – Telugu Poetry- అమ్మకు వందనం ….. అమ్మ కోసం ఏదో ఒకటి చెయ్
నలుదిక్కుల కొసలకు
వేలాడేసిన నా గుండె కవాటపు
శ్వేతాంబరాల తెరలకు
నే పొదిగే ఒక్కో అక్షరం …. ఒక్కో నక్షత్రం
నే పగిలే ఒక్కో క్షణం …. ఒక్కో కవితాక్షరం(Salute to Mother – Telugu Poetry)
పక్కటెముకలన్నీ ఓ ప్రక్కగా పోగేసి
నా కోసమే నువ్వు సృష్టించిన
అమృత గుళిక
సృష్టి నాళిక … గర్భం
అపుడే జడలు విప్పుతోన్న లోపలి మృగం
కసితీరా నా చేత నిన్ను తన్నించి నప్పుడు
మొట్టమొదటి పాపం నే చేసినప్పుడు
కన్నా… నా కన్నా అంటూ
లోపల నీ గుండె చేసిన చప్పుడు నే విన్నానమ్మా…. విన్నా
పెద్దవాణ్ణి అయ్యా అనుకొని నే అడ్డం తిరిగితే
ఉషోదయం చూద్దూ గానీ …రా నాన్నా అంటూ
ఆప్యాయం గా నువ్వు నన్ను నిమిరినప్పుడు
మునిపంట నువ్వు బిగబట్టిన అనంతమైన యాతన
నే గమనించనే లేదమ్మా….
‘అమ్మా’ అంటూ నువ్వు పెట్టిన ఆక్రందనే
నే విన్న తొలి మాట…..
సృష్టి వేదిక నుండి
నువ్వు చేసిన సమర శంఖారావం
ఈ జన్మకింత అస్థిత్వాన్ని ఇచ్చింది….
ప్రతిక్షణం నాకై యుద్ధం చేస్తున్నది అదే….
నీ స్థన్యం లో …
నా పెదాలపై నువ్వు కుడిపిన
మొదటి చుక్క … ప్రేమ
తోటి మనిషిని ప్రేమించగలిగే ఆ పౌరసత్వాన్ని పొంది
నే కోటీశ్వరుడినయ్యా….
నువ్వు కలిపిన గోటి ముద్దలో అర చందమామ
నా బుగ్గపై నువ్వు పెట్టిన నోటి ముద్రలో
మిగిలిన వెన్నెలమ్మ
చిన్నపుడు బడికి వెళ్ళేటప్పుడు చిటికిన వేలయ్యేది అమ్మ …
కాలేజీ లో కట్టే ఫీజు కోసం బంగారు గొలుసయ్యేది అమ్మ …
అమ్మంటే…
నా నుదుటను పట్టే చెమటను అలవోకగా తుడిచే చీర చెంగు…
నే ఇంటికి వస్తున్నా అని తెలిసినప్పుడు ఇంటి వసారా లో తనే కాలుకాలిన పిల్లి….
పరీక్షల్లో నేను నైట్ అవుట్ చేస్తే…..
నా కోసం జీవితం మొత్తం జాగారం చేసిన కొవ్వొత్తి….. అమ్మ …
అనంతమైన దుఃఖం లో నే మునిగిపోతానని తెలిసీ కూడా
నా కంట నీరయ్యింది … అమ్మ
ఆరని ఆ తడి జాడల వెనుక
బాధతో మూల్గుతూనే ఉంది … అమ్మ
అందుకే నే చెప్తున్నా……
అమ్మ కోసం ఏదో ఒకటి చెయ్ …
అక్షరాల మేడలూ….
పగడాల దీవులూ తను కోరదు..
నక్షత్రాల కోటలూ…
వజ్రపు తూగుటుయ్యాల లూ … తనకొద్దు
అందుకే….
అమ్మ కోసం ఏదో ఒకటి చెయ్ ..
బతికున్నపుడు అమ్మ
పోయాకా .. పదింతలు అవుతుంది….
ఆ తియ్యని భారాన్ని మోయగలవా…….
అందుకే….
అమ్మను అశ్రద్ధ చేయొద్దు
కరిగిన క్షణం లో తనూ ఒక కణమై…
అంతర్ధానమయ్యే లోపు
అమ్మకోసం ఏదో ఒకటి చెయ్ …
అడుగులు తడబడితే… ఆసరావై నిలిచిపో…
అలికిన చూపైతే… చుక్కాని వై పో
అలసిన పాదాలకు … తైలమై ఒత్తి పో
కన్నీరు చిప్పిల్లితే…. చూపుడు వేలై తుడిచిపో…
నీపై బెంగ తో క్రుంగి పోయి మునగదీసుకు పోతే…
ఆప్యాయత నిండిన ఆలింగనం అయిపో..
అంతెందుకు… కళ్ళలో ఒత్తులు వేసుకొని చూసుకో…
అమ్మ కళ్ళలో మెరుపులు చూసే అదృష్టం
ఎంతమందికి ఉందీ..?
అమ్మంటే…
ప్రేమ… వాత్సల్యం…
ఎగసే అల
అలుపెరుగని ఆశ….
ఉరికే జలపాతం….
ఊసులాడే ఉషస్సు…
ఊహలకందని తపస్సు….
నలుదిక్కులను కలిపే ఇంద్ర ధనుస్సు…
అమ్మా… నీ కోసమే ఈ కవిత అని నే రాసి ఇస్తే…
మెరుపుల కళ్ళతో
నన్ను గుండెకు హత్తుకొనే అమ్మా…..
నీకు వందనం….
అప్పుడు…
అమ్మ కళ్ళలో నే చూసిన
మెరుపులే నాకు ఆస్కార్ ….
ఆనందం తో అమ్మ నా బుగ్గపై
పెట్టిన చిరు ముద్దే నాకు నోబెల్….
అమ్మా…… నువ్వెక్కడున్నా …
ఈ కానుక నీ కోసం….
ఈ కానుక నీకు అంకితం …
అమ్మా వందనం….
అమ్మకు వందనం…..
(మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో …….)
(09-05- 2009)
(ఈ కవిత 09-05- 2009 తేదీన ఆంధ్రా ఫోక్స్ అనే ఒక వెబ్ సైట్ లో ప్రచురించ బడింది.. దాదాపు పదిహేనేళ్ళ తర్వాత ఈ వెబ్ సైట్ లో తిరిగి ప్రచురించడం జరిగింది)