Smile Please Telugu Love Poetry – ఒకసారి నవ్వవా ప్లీజ్.. నీ చిరునవ్వులు రువ్వవా ఒకసారి .. ప్లీజ్
నీ చిరునవ్వు తునక ఒక్కటి చాలు…. చిగురాకుల సంగీతాన్ని చిత్రిక పట్టి నా గాయాలకు పూసుకోవడానికి….
Smile Please Telugu Love Poetry ఒకసారి నవ్వవా ప్లీజ్ … నీ చిరునవ్వులు రువ్వవా ఒకసారి … ప్లీజ్
నిన్ను చిత్రించడం కోసమని
నా ఆలోచనలతో ఎప్పుడూ
నన్ను నేనే చెక్కు కుంటాను…
నీ రూపం అదేపనిగా నాతో
దాగుడు మూతలు ఆడుతూనే ఉంటుంది…
నేను మొత్తం గాయాల ముద్దగా మారి
నీ వాకిలి ముందర నిలవ బడతాను …
నా కళ్ళ జోలె లో కాసిన్ని కన్నీళ్లు పుట్టించి
వెళ్ళు వెళ్ళమంటూ కసరు కొంటావు ..
రేఖా మాత్రం గా చిన్న చిరునవ్వైనా
రువ్వుతావేమో నని నేనక్కడే నిలబడి ఉంటాను…
ఆ చిరునవ్వు ..
నా గాయాలకు పూసుకోవాలన్న అత్యాశ…
నువ్వు నవ్వవు…. కాసిన్ని ముత్యాలూ రాల్చవు ….
కనీసం నా కనురెప్పల తడినైనా గుర్తించవు….
నే వేసిన నీ చిత్ర పటాలన్నింటికీ
కన్నీటి ధారల దారాలు కట్టి
గాలి పటాలు గా ఎగరవేస్తూ ఉంటాను…
నా కన్నీళ్లన్నీ ఇంకిపోయి
చిత్రపటం గా కూడా నువ్వు దూరమయ్యే లోపు …..
ఒక్క సారి నవ్వవా…. ప్లీజ్
కాసింత చిరునవ్వు రువ్వవా … ప్లీజ్
ఆ చిరునవ్వుల కొక్కెం తో ఈ అగాధం నుండి
నా గుండె ను బయటకు లాగవా … ప్లీజ్
నిన్ను చిత్రించే
కోటానుకోట్ల రేఖలకు
భాష్యం చెప్పే ప్రేమ శాస్త్రాన్ని
నే రచించ డానికి …. పీఠిక నీ చిరునవ్వే …
అందుకే….
ఒక్కసారి నవ్వవా ….. ప్లీజ్
నీ చిరునవ్వులు రువ్వవా ఒకసారి …. ప్లీజ్ (24 – 05 – 2009)
నీ చిరునవ్వు తునక ఒక్కటి చాలు… (Smile Please Telugu Love Poetry)
విశ్వ ప్రేమ వనానికి చిరునామా కనిపెట్టడానికి…
నీ చిరునవ్వు తునక ఒక్కటి చాలు….
చిగురాకుల సంగీతాన్ని చిత్రిక పట్టి నా గాయాలకు పూసుకోవడానికి….
నీ చిరునవ్వు తునక ఒక్కటి చాలు….
ఒకదాని వెనుక ఒకటిగా దాకొని ఉన్న కన్నీటి చుక్కల సమూహాన్ని
అనంత దూరాలకు తరిమి వేయడానికి….
నీ చిరునవ్వు తునక ఒక్కటి చాలు….
వెన్ను పగిలి నిట్టనిలువు గా కూలిన నా ఆశల సౌధాన్ని
తిరిగి నిర్మించు కోవడానికి….
నీ సన్నని చిరునవ్వైనా నాలో ఒక తీవ్రమైన సంచలనాన్ని కలిగిస్తుంది…
నీ కోసం…. నీ చిరునవ్వు కోసం
నా ఎముకల గూడు సైతం.. ఆబగా ఎదురు చూస్తూనే ఉంటుంది….
ఆ స్థితిలో నువ్వు నన్ను చూడలేవు…
చిన్న చిరునవ్వు తునక కోసం… ఎందుకు నీకింత పట్టుదల అంటూ
నా చుబుకం పై నువ్వు పెట్టే ముద్దు శబ్దం వినడానికని
కన్నీటి తెరలు సైతం మౌనం గా ఎదురు చూస్తుంటాయి…..
చిన్న చిరునవ్వు తునక కోసం…..
నన్ను నేను నిలువెల్లా చెక్కుకొని
నీ ముందు నిలువబడితే…
నా ఒక్కో గాయానికి సుతి మెత్తగా నువ్వు కట్టు కడుతుంటే చూడాలని
ఆశపడ్డ నా శరీర కణాలన్నీ నన్ను వెలి వేస్తాయి..
అయినా నే ఓపిగ్గా నీ చిరునవ్వుల మెరుపుల కోసం ఎదురు చూస్తూనే ఉంటాను..
చివరి సారిగా అడుగుతున్నా….
ఒక్కసారి నవ్వవా .. ప్లీజ్…
నీ చిరునవ్వులు రువ్వవా ఒకసారి… ప్లీజ్ (28 -04- 2024)