Telugu Poetry – నువ్వు గాని ఇటువైపు వచ్చావా .. బంగారం
నువ్వు గాని ఇటువైపు వచ్చావా.. బంగారం (Telugu Poetry)
నువ్వు గాని ఇటువైపు వచ్చావా.. బంగారం (Telugu Poetry)
నువ్వు గాని ఇటువైపు వచ్చావా..
తొలి కిరణమొకటి వెక్కి వెక్కి ఏడుస్తోంది
తన కంటే ప్రకాశమైన వెలుగు రేఖ ఇటు వైపు వచ్చిందని …
నువ్వు గాని ఇటువైపు వచ్చావా….
ఈ చిన్నారి గాలి తరగ గుక్క పెట్టి ఏడుస్తోంది…
తన కంటే మృదువైన మంచు తునక ఇటు వైపు వచ్చిందని…
నువ్వు గాని ఇటువైపు వచ్చావా….
ఈ సెలయేటి కళ్ళన్నీ నీళ్ళతో నిండి పోయాయి…
తన కంటే మృదువైన సంగీతాన్నిచ్చే చిరునవ్వొకటి ఇటు వైపు వచ్చిందని…
నువ్వు గాని ఇటువైపు వచ్చావా…. హలో…. నిన్నే…
నువ్వు గాని ఇటువైపు వచ్చావా ఏంటి….?
ఆకాశం నుండి జారుతోన్న చిట్టి చినుకు చెక్కిళ్ళపై ధారలు గా కన్నీళ్లు ….
లేత పూలతల దేహాన్ని సుతారం తాకే అవకాశం ఇంక తనకు రాదేమో అని…
చెప్పు… వచ్చావా ఇటువైపు ఏమన్నా….
పసి పాప పాలుకారే చెంపలపై నులి వెచ్చని చేతులతో తల్లి కాపడం పెడుతోంటే … కుంపటి కలలు కల్లలై గుంభనం గా రోదిస్తోంది..
నీ ప్రేమామృతపు కౌగిలి ఓదార్పు తో … తన అవసరం ఇక రాదేమో అని…
నిజం… నేను తమాషా కి చెప్పడం లేదు… చెప్పు … నువ్వు ఇటువైపు వచ్చావ్ కదా….
లేదని చెప్పకు… నువ్వు వచ్చావ్…
లేకపోతే… ఎప్పుడూ లేనిది… నా కను రెప్పలు పలుచని నీటి పొరలను బయటకు రాకుండా బంధించడానికి … ఎందుకు విశ్వ ప్రయత్నం చేస్తాయి……
వేగం గానో నెమ్మది గానో కొట్టుకుంటున్న గుండె చప్పుడు తో నా వ్రేలి కొసలు ఎందుకు నృత్యం చేస్తాయి…?
అర చేతుల్లో మొదలైన సన్నని వణుకు నా అణువణువూ వ్యాపించి…. జ్ఞాపకాల నూతి గట్టు పైకి నన్నెందుకు తోసి వేస్తుంది…?
ఈ విశాల మైదానం లోని పచ్చిక పై తడబడుతున్న నా అడుగులకు ఊతమిస్తోన్న గడ్డి పరకలు…ఎందుకు నా వైపు అదోలా చూస్తాయి .?
ఒక్కసారిగా విచ్చుకొన్న మట్టి పరిమళం నన్ను నిలువునా చుట్టేసి… నా పెదవులపై చిరు నవ్వై పూసి.. చెంపలపై చారికలై మిగిలి …. ఎగసి పడుతోన్న దుఃఖంతో నే వెక్కి వెక్కి ఏడుస్తున్నా నంటే…..
అనుమానం లేనేలేదు నాకు…. నువ్వు వచ్చావ్…. కాదని నువ్వు బుకాయించినా సరే…. నే చెప్పగలను.. నువ్వు వచ్చావ్…
నన్ను వదిలి….నువ్వు విశ్వాంత రాళం లోనికి మాయమై పోయాకా….. ఇంత కాలానికి గుర్తొచ్చానా… పోనీలే…..
ఇప్పుడైనా వచ్చావ్…
నువ్వు వస్తావ్…. నాకోసం…. ఆ విషయం నాకు బాగా తెలుసు ..
కానీ ఒక విషయం నీకు తెలుసా…. బంగారమ్….
నే ఎప్పుడో చనిపోయా …. నీ కోసం… నిజం !
(జ్ఞాపకాల నూతి గట్టు సంకలనం .. by David Copperfield)