ఎర్ర సముద్రం అల్లకల్లోలం ? Operation Prosperity Guardian అంటే ఏమిటి?
ఎర్ర సముద్రం అల్లకల్లోలం గా మారింది. వాణిజ్య నౌకలు సూయజ్ కాలువ మార్గం గుండా ప్రయాణించాలంటే గజగజ లాడుతున్నాయి.ప్రపంచ దేశాలకు చమురు రవాణా ఈ ప్రాంతం గుండా జరుగుతుంది. అసలేం జరిగింది దీని వెనుక కథ ఒక సారి చూద్దాం.
అసలు ఏం జరిగింది అంటే….
ప్రపంచం అంతా మెల్లగా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తో మొదలైన ఈ అగ్ని ఆరేటట్లు కనిపించడం లేదు. హమాస్ మూకలు అకస్మాత్తు గా ఇజ్రాయెల్ పై దాడి చెయ్యడం తో ఈ పరిస్థితి మరింత సంక్షోభానికి దారి తీసింది. ఇజ్రాయెల్ వెంటనే తేరుకొని హమాస్ మూకలను మట్టుపెట్టే క్రమం లో మరొక యుద్ధ వాతావరణం తెర మీదకు తీసుకు వచ్చింది. గాజా పై తీవ్రమైన బాంబు దాడులతో విరుచుకు పడుతోంది. హమాస్ మరెన్నడూ ఇజ్రాయెల్ వైపు కన్నెత్త కుండా చెయ్యడమే లక్ష్యం గా హమాస్ ముఖ్య నాయకులను సైతం డ్రోన్ దాడులు చేసి మరీ అంతం చేస్తోంది. ఈ స్థితి లో చుట్టూ ఉన్న ముస్లిం దేశాలు ఈ దాడులను ఖండించాయి గాని అంతకు మించి గాజా కు గాని హమాస్ కు గాని ఎటువంటి సహాయం చెయ్యలేక పోయాయి.
వాణిజ్య నౌకలపై దాడులు ఎందుకు చేస్తున్నాయి అంటే ..?
ఈ పరిస్థితి లో ఇరాన్ సహకారం తో యెమెన్ కు చెందిన హోతీ దళాలు ఎర్ర సముద్రం నుండి ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడులు చెయ్యడం మొదలు పెట్టాయి.. అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన సూయిజ్ కాలువ వైపు ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడులు చెయ్యడం ద్వారా హమాస్ పై దాడులను తక్షణం ఆపి వేయాలనే డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్ పరిగణన లోనికి తీసుకొనక పోతే దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. హోతీ దళాలకు తోడు లెబనాన్ లోని హెజ్బుల్లా తిరుగుబాటు దారులు కూడా దాడులు చేసే యోచనలో ఉన్నారు. వీరికి అండగా ఇరాన్ ఉంది. ఇరాన్ వెనుక చైనా ఉందన్నది కాదనలేని సత్యం.(ఎర్ర సముద్రం లో అల్లకల్లోలం)
ఇజ్రాయెల్ నౌకల పై ముందుగా దాడులు
ఇజ్రాయెల్ పై హామాస్ దాడి చెయ్యగానే అమెరికా మధ్యధరా సముద్రం లో తమ యుద్ధ నౌకలను మొహరించింది. హోతీ దళాలు ప్రయోగించిన కొన్ని బాలిస్టిక్ క్షిపణులను గగన తలం లోనే కూల్చి వేయగాలిగాయి. దీనితో హోతీ దళాలు ఎర్ర సముద్రం పై తమ దృష్టి కేంద్రీకరించాయి. నిరంతరం రద్దీ గా ఉండే బాబ్ – అల్ – మందేబ్ జలసంధి గుండా ప్రయాణం చేసే ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చెయ్యడం మొదలు పెట్టారు. ఇజ్రాయెల్ తో సంబంధం ఉండే దేశాల నౌకలపైనా దాడులు చేసారు. భారత్ కు చెందిన రెండు నౌకలపై కూడా డ్రోన్ దాడులకు తెగబడ్డారు. ఇలా వందలాది నౌకలపై దాడులు చేస్తూ ఉండడం తో షిప్పింగ్ కంపెనీలు తమ కార్య కలాపాలు తగ్గించాయి.
ప్రపంచ దేశాల వాణిజ్య నౌకలతో ఎప్పుడూ రద్దీ గ ఉండే రెండు జల సంధులపై ఇరాన్ తన ఆధిపత్యాన్ని కలిగి ఉంది. దానితో తన చెప్పు చేతల్లో ఉండే యెమెన్ కు చెందిన హోతీ తిరుగుబాటు దారులతో నౌకలపై దాడులు చేయిస్తోంది. ఈ దాడులను అడ్డుకోవడానికి అమెరికా రంగలోకి దిగి ‘ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ ‘ ను ప్రారంభించింది.
Operation Prosperity Guardian అంటే ఏమిటి ?
ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు రక్షణ ఇచ్చే లక్ష్యం తో అమెరికా ప్రారంభించిన రక్షణ చర్య ‘ఆపరేషన్ ‘Operation Prosperity Guardian’ . ఈ ఆపరేషన్ కు చాలా దేశాలు మద్దతు పలికాయి. కంబైన్డ్ మారిటైం ఫోర్స్ పేరుతో కార్య కలాపాలు ప్రారంభించాయి. ఎర్ర సముద్రం లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేస్తున్న డ్రోన్లు, మిస్సైళ్ళ ను అడ్డుకొని మధ్యలోనే కూల్చి వేసాయి. ఇది అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య కొంత ఉద్రిక్తత కు దారి తీసింది.
హోతీ ల లక్ష్యం ఏమిటి అంటే….
ఇలా వాణిజ్య నౌకలపై దాడులు చెయ్యడం ద్వారా ప్రపంచ దేశాలపై ఒత్తిడి తీసుకు వచ్చి హమాస్ పై ఇజ్రాయెల్ దాడులను ఆపడమే హోతీ ల లక్ష్యం. భారత్ కు కూడా సూయిజ్ జల సంధి ద్వారానే చమురు ను పంపిస్తోంది రష్యా. అయితే ఐరోపా ఆసియా మధ్య ప్రయాణించే కొన్ని దేశాల నౌకలు తమ మార్గాన్ని మార్చుకొని ‘కేప్ ఆఫ్ గుడ్ హాప్’ వైపు గా వేలాది కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. ప్రయాణ ఖర్చులతో పాటు దాదాపు మూడు వారాల నుండి నెల రోజుల ప్రయాణ సమయం వృధా అవుతోంది. సరుకులు సమయానికి చేరుకోకపోవడం వలన ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.(ఎర్ర సముద్రం లో అల్లకల్లోలం)
శాంతి నెలకొల్పాలి అంటే ఏం జరగాలంటే….
ఈ ఉద్రిక్తతలు అన్నీ తగ్గి పశ్చిమాసియా లో శాంతి నెలకొనాలంటే ముందు ఇజ్రాయెల్ హమాస్ మధ్య చర్చలు సఫలం కావాలి. గాజా లో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి. అంతర్జాతీయ వాణిజ్యం లో కీలక పాత్ర పోషించే సూయిజ్ కాలువ ప్రాంతాల్లో దాడులు ఆగాలి.లేనట్లయితే ఈ పరిస్థితులు అన్నీ కలిసి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్య పోనవసరం లేదు. పశ్చిమాసియా లో శాంతి నెలకొనాలని ఆశిద్దాం.