January 10, 2025

Real Story of TV Actors Pavitra Jayaram Chandrakanth| ఒక చెంప దెబ్బ రెండు కుటుంబాలలో విషాదం నింపింది|

ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్య, ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమ ఇద్దరు వ్యక్తుల్ని ప్రేమికులని చేస్తుంది… ఇద్దరి వ్యక్తుల గుండెలను పగిలేలా కూడా చేస్తుంది… అందుకే… ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలీదు… ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎందుకు చిచ్చు పెడుతుందో కూడా ఎవరికీ తెలీదు.. ఎందుకంటే… అది ప్రేమ కాబట్టి…

telugu quotes - Telugu quotations - self confidence

Telugu quotes - Telugu quotations on Self Confidence

Real Story of TV Actors Pavitra Jayaram Chandrakanth| ఒక చెంప దెబ్బ రెండు కుటుంబాలలో విషాదం నింపింది

సీన్ నెంబర్ -1

ఒక టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోంది అక్కడ.. ప్రధాన పాత్రధారి కేక్ కట్ చేసే సన్నివేశం… కేక్ కట్ చేసే క్రమం లో ఆమె చీరకు నిప్పు అంటించే సన్నివేశం…. అందరూ సిద్ధం గా ఉన్నారు… ‘స్టా ర్ట్.. కెమెరా… యాక్షన్….’ (Real Story of TV Actors Pavitra Jayaram Chandrakanth)

చీర చెంగుకు కొద్దిగా అంటుకోవలసిన మంటలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి.. ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.. హడావుడి గా అందరూ పరుగులు తీస్తున్నారు… మంటలు అంత ఎత్తున ఎగసిపడటం చూసిన హీరోయిన్ స్పృహ కోల్పోయింది… సెట్ లో వాళ్ళు ఆమెను లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు.. నీళ్ళు చిలకరించారు… పాదాలపై రుద్దుతున్నారు.. తట్టి లేపుతున్నారు… అయినా ఆమె స్పృహ లోనికి రాలేదు… ఇదంతా గమనిస్తున్నాడు అతడు… ఇటువంటి సమయాల్లో చాలా చురుగ్గా ఉంటాడు తను.. అంతే.. ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా…. స్పృహ లేకుండా పడి ఉన్న ఆమె దగ్గరకు వెళ్లి.. ఆమె చెంప పై గట్టిగా కొట్టాడు… అంతే.. ఆ దెబ్బకు ఒక్కసారిగా స్పృహ లోనికి వచ్చింది ఆవిడ…

యూనిట్ సభ్యులందరూ ఆమెను హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారు.. సపర్యలు చేసారు… డాక్టర్ అడిగారు.. ఈమె చెంపలపై ఆ దెబ్బలు ఏమిటి అని… అక్కడున్న వారు అతడిని చూపిస్తూ అన్నారు.. “ఇతనే సార్… పాపం మేడం బుగ్గలపై గట్టిగా కొట్టాడు.. చూడండి ఎలా కందిపోయాయో.. అప్పటికీ మేము చెప్తూనే ఉన్నాం..” అంటూ ఉండగానే… ఆ డాక్టర్ ఇలా అన్నారు… “సమయానికి అతను అలా గట్టిగా కొట్టడం వల్లనే ఆమె స్పృహ లోనికి వచ్చింది.. లేదంటే షాక్ లో ఆమె ప్రాణాలు అప్పుడే పోయేవి..” అని..

అప్పుడే కోలుకొంటున్న ఆమె ఈ మాటలను జాగ్రత్త గా వింటోంది.. కళ్ళు తెరచి ‘అతని’ వైపు చూసింది… సన్నగా నవ్వుతూ తననే చూస్తూ ఉన్నాడు… ‘థాంక్స్……’ అన్నదామె కళ్ళతోనే… సరే పాపా అని మనసులోనే అనుకొని కళ్ళతోనే వారించాడు…’సారీ…’ అంటూ చెవి పట్టుకొని క్షమాపణ చెప్పబోయాడు.. చెంప పై కొట్టినందుకు…. అలా అనొద్దు అంటూ నొచ్చుకొంది… కళ్ళు మూసుకొంది…. అతనిపై  కృతజ్ఞత తో ఆమె పెదవులపై విరిసిన చిరునవ్వు తన గుండె లోతుల్లో తీవ్రమైన అలజడి రేపింది.. అతను ఎక్కడున్నాడో చూద్దాం అనుకొంటూ చిన్నగా కళ్ళు తెరచి చూసింది.. అక్కడే .. ఆ ప్రదేశం లోనే… చిరునవ్వుతో తననే చూస్తూ ఉన్నాడు… చప్పున కళ్ళు మూసుకొంది ఆమె.. తన గుండె లయ తప్పడం తనకు మాత్రమే తెలుస్తోంది… ఏమిటీ కొత్త అనుభూతి… అలా హాస్పిటల్ బెడ్ మీదే తనకు నిద్ర పట్టేసింది.. (Real Story of TV Actors Pavitra Jayaram Chandrakanth)

తర్వాతి రోజు అదే సెట్ లో షూటింగ్… ఆమె కళ్ళు ఆత్రం గా అతని కోసం వెదుకుతున్నాయి… ఉన్నట్టుండి.. ఒక బేస్ వాయిస్ వినబడింది.. “మేడం.. ఎలా ఉన్నారు..  మందులు వేసుకున్నారా …..” అని పలకరిస్తూనే అతను తన పనిలో మునిగిపోయాడు… ఒక్కసారిగా ఆమె మనసు ఉత్తుంగ తరంగమే అయ్యింది… ఇక అతని చుట్టూనే ఆలోచనలు.. ఓ ప్రక్క షూటింగ్ లో పాల్గొంటూ ఉందే కాని మనసంతా అతనే నిండి పోయాడు.. తను కనిపిస్తే చాలు .. చేయి చెంప మీదకి… మనసు మధురానుభూతుల లోనికి … వెళ్ళిపోతున్నాయి…. ఇక్కడ కట్ చేస్తే…..

ఆమె పేరు పవిత్ర జయరాం … తనకు పెళ్ళి అయి విడాకులు కూడా తీసుకొన్నది .. తనకు ఇద్దరు పిల్లలు .. ఒక బాబు పాప… జీవితం లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం గడిపింది. కన్నడ టీవీ సీరియల్స్ లో నటించింది. తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. డైరక్షన్ చేయాలనేది ఆమె ఆశ… పిల్లలను ఉన్నత స్థాయి లో చూసుకోవాలని ఆశ పడింది.. సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చి జీవితం ఇప్పుడే బాగుంది అనుకునే సమయం లో దురదృష్టం వెంటాడింది.. కారు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయింది..

అతని పేరు చంద్ర కాంత్... చందు అని పిలుస్తారు అందరూ.. పెళ్ళి అయింది.. తనకూ ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఒక బాబు.. ఒక పాప… చందు మల్టీ టాలెంటెడ్… జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్.. క్రికెట్ కూడా బాగా ఆడతాడు.. ఏ పనైనా కష్టపడి చేస్తాడు.. మంచి సాఫ్ట్ వేర్ కంపెనీ లో టీం లీడ్ గా ఉద్యోగం.. అన్నీ వదిలేసి యాక్టింగ్ వైపు వచ్చాడు.. కెరీర్ ఇప్పుడే ఊపు అందు కొంటోంది… సినిమాల లో కూడా అవకాశాలు వచ్చేలా ఉన్నాయి.. అంతలోనే దురదృష్టం వెంటాడింది.. ఆత్మహత్య చేసుకొన్నాడు. 

ఇద్దరి తీరాలు వేరు… ఇద్దరి గమ్యాలు వేరు.. అసలు ఎవరికి ఎవరో.. కానీ… ఒకే  ఒక చెంప దెబ్బ… ఇద్దరిని కలిపింది.. రెండు కుటుంబాలను విడదీసింది.. రెండు కుటుంబాలలో విషాదం నింపింది… కట్ చేస్తే…

సీన్ నెంబర్ -2 (Real Story of TV Actors Pavitra Jayaram Chandrakanth)

ఉదయం ఐదు గంటలు… అప్పుడే తెలతెల వారుతోంది… చందు ఫోన్ రింగ్ అయ్యింది.. వెంటనే వాట్సప్ సందేశాలు వరుసగా వస్తున్నాయి.. తన ప్రక్కనే పడుకున్న భార్య లేచి చూసే లోపు చందు ఫోన్ అందుకున్నాడు.. పిల్లలపై దుప్పటి సరిచేస్తూ అడిగిందామె.. ‘ఎవరు ఇంత ఉదయాన్నే…’ “ఫ్రెండు ఒకడు… గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాడు లే..” అనేంత లోనే ఫోన్ రింగ్ అయ్యింది… బయటకు దూరం గా వెళ్లి మాట్లాడుతున్నాడు… శిల్ప కి ఇదంతా కొత్తగా ఉంది… వాట్సప్ అంటేనే చిరాకు పడే వాడు చందు.. అలాంటిది.. ఆ మెసేజ్ రాగానే అతని మొహం లో ఒక్క సారిగా వెలుగు.. కచ్చితం గా ఇది ఫ్రెండు కాదు.. ఎవరో అమ్మాయే అనుకునే సరికి… ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు బొటబొటా కారిపోయాయి.. మంచం పై నున్న పాప చెక్కిలి పై ఆ కన్నీళ్లు  పడటం తో పాప ఒక్క సారిగా అటూ ఇటూ కదిలింది.. పాపను దగ్గరకు తీసుకొని మెల్లగా చప్పిలించింది…

తనది ప్రేమ వివాహం.. 2004 నుండి చందు తో ప్రేమ… పెద్దలందర్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు 2015 లో.. చాలా కేరింగ్ గా ఉండేవాడు.. తను ఖాళీగా ఉంటే.. తెలిసిన వాళ్ళతో మాట్లాడి సాఫ్ట్ వేర్ జాబ్ ఇప్పించింది.. పాప పుట్టింది.. ఆ తర్వాత బాబు.. శిల్ప జీవితం లో ఆనంద కరమైన రోజులు ఇవే… ఇంత వరకే..ఆ తర్వాత  యాక్టింగ్ అంటూ ఉద్యోగాన్ని వదిలి వేసాడు..టీవీ లో  అవకాశాలు వచ్చాయి.. సరిగ్గా అప్పుడే జరిగింది కేక్ కటింగ్ షూటింగ్.. పవిత్ర స్పృహ కోల్పోవడం.. అతను చెంప దెబ్బ కొట్టడం.. ఒకే ఒక చెంప దెబ్బ… బంగారం లాంటి కుటుంబాలలో విషాదం నింపింది..

ఫోన్లో చాలా సేపు మాట్లాడిన తర్వాత లోనికి వచ్చాడు.. తనెంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పై మొట్టమొదటి సారి అరిచాడు… కొట్టాడు… శిల్ప కు తన ప్రపంచం అంతా తలక్రిందులు గా కనిపిస్తోంది.. చందు బాత్ రూమ్ లో ఉన్నపుడు అతని మొబైల్ చూసింది… ‘పవి’ అని ఉంది.. ఆమె ఫోటో కూడా ఉంది.. రోజూ సీరియల్ లో కనిపించే ముఖమే… ఏం జరుగుతుందో అసలు తనకు అర్ధం కాలేదు.. ఇద్దరు పిల్లల్ని చెరో ప్రక్క పొదివి పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది…. వచ్చే నాలుగేళ్ళూ తను ఇలాగే ఏడుస్తూ కాలం గడప వలసి వస్తుం దని ఆ క్షణం లో ఆమె కు తెలీదు… సీన్ కట్ చేస్తే….

నాలుగేళ్ల తర్వాత.. (Real Story of TV Actors Pavitra Jayaram Chandrakanth)

సీన్ నెంబర్ -3

బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారి… కారు వేగం గా వెళ్తోంది.. కార్లో చందు.. పవిత్ర .. పవిత్ర వాళ్ళ బంధువుల అమ్మాయి ఉన్నారు… డ్రైవర్ అంతకంతకూ వేగం పెంచుతున్నాడు… మహబూబ్ నగర్ దగ్గరలో ఉన్నారు…. దాదాపు 140 కిలోమీటర్ల కు పైగా వేగం తో వెళ్తోంది కారు.. అంతలోనే.. ఉన్నట్టుండి.. ఎదురుగా ఆర్టీసీ బస్సు… డ్రైవర్ తప్పించలేక పోయాడు… పెద్ద శబ్దం తో ఆర్టీసీ బస్సు ను డీ కొట్టింది కారు…. ఒక్కక్షణం నిశ్శబ్దం.. చందు కు గాయాలయ్యాయి… పవీ… పవీ అంటున్నాడు… కన్నయ్యా…కన్నయ్యా నీ కేమైంది అంటూ చందు వైపు చూసింది పవిత్ర… పవీ.. పవీ .. నీకేం కాలేదు కదా.. అంటున్నాడు….. రక్తమోడుతూ కనిపించాడు.. అతని వళ్ళంతా రక్తం… అది చూసింది పవిత్ర… కన్నయ్యా…. అంటూ ఒక్క సారిగా గట్టిగా అరిచింది… మరొక మాట లేదు… కళ్ళు అలానే తెరిచి ఉన్నాయి… వెనక్కి వాలిపోయింది.. అంతే ఆమె ప్రాణం అక్కడే పోయింది..

పవీ… పవీ అంటూ చందు అరుస్తున్నాడు… అంబులెన్స్ ని పిలవండీ అంటూ కేకలు వేస్తున్నాడు… నీకేం కాదు పవీ.. లే.. ఇదిగో చూడు నాకేమీ కాలేదు అంటూ ఆమెతో మాట్లాడుతున్నాడు…. అప్పటికే తను ప్రాణం వదిలేసింది… అంబులెన్స్ వచ్చింది.. హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు.. ఆమె చనిపోయింది అన్నారు.. ఆమె స్వస్థలానికి అంబులెన్స్ బయలు దేరింది.. (Real Story of TV Actors Pavitra Jayaram Chandrakanth)

పవిత్ర ప్రక్కనే కూర్చున్నాడు చందు.. గత కొద్ది సేపటిగా ఏం జరుగుతుందో తనకేమీ అర్ధం కావడం లేదు… ఇప్పుడేగా.. తను పవిత్ర ఎంతో అన్యోన్యం గా.. ఉత్సాహం గా బయల్దేరింది.. ఇంతలోనే ప్రక్కన నిర్జీవం గా పవిత్ర.. ఇద్దరూ కలిపి వేయించుకున్న టాటూ వెక్కిరిస్తున్నట్టు ఉంది.. అంబులెన్స్ వేగం గా వెళ్తోంటే… అప్పుడే ఒక నిర్ణయం తీసేసుకున్నాడు చందు… మృతదేహాన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఒకటే చెప్తున్నాడు.. ‘పవీ… నేను కూడా నీ దగ్గరకే వచ్చేస్తాను… నువ్వు లేకుండా నేను ఉండలేను… రోజులో ఇరవై నాలుగు గంటలూ నువ్వే నా లోకం… ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేను… వచ్చేస్తా… అతి త్వరలోనే నీ దగ్గరకు వచ్చేస్తా…’ అంటూ భోరున ఏడుస్తూ సోమ్మసిల్లిపోయాడు… పవిత్ర జయరాం అంత్య క్రియలు ఆమె స్వగ్రామం లో జరిగిపోయాయి…

రెండు రోజుల తర్వాత ….

సీన్ నెంబర్ – 4

హైదరాబాద్ లో ఒక నిర్జన ప్రాంతం … సుమన్ టీవీ నుండి రోషన్ చందు తో మాట్లాడుతున్నాడు…. బాధ ని కళ్ళలోనే నింపుకొని అన్నీ చెప్తున్నాడు చందు.. ఒకానొక క్షణం లో తనని తాను అదుపు చేసుకోలేక పోయాడు… ‘తను చాలా మంచిది సార్.. తన గురించి తప్పుగా రాయకండి సార్.. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా .. పవి చాలా మంచిది సార్… తన గురించి బ్యాడ్ గా కామెంట్స్ పెట్టకండి సార్’ అంటూ ఏడ్చాడు.. అంతలోనే సన్నగా నవ్వుతూ అన్నాడు చందు.. ‘త్వరలోనే మీరంతా ఒక గుడ్ న్యూస్ వింటారు’ అని.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పవిత్ర దగ్గరకి వెళ్లిపోవాలి అనే ఆలోచన తో కూడిన వికృతమైన నవ్వు అది.. రోషన్ అదిరిపడ్డాడు… లేదు లేదు… నువ్వు త్వరగా కోలుకోవాలి… ఇండస్ట్రీ మొత్తం నీకు అండగా ఉంటుంది.. అంటూ ఎదో చెప్తున్నా…. వినిపించుకొనే స్థాయిలో లేడు చందు…

ఇంటికి వెళ్ళాడు… ఎవరితో ఏమీ మాట్లాడలేదు… భార్యతో, పిల్లలతో… తల్లి తో…. బట్టలు మార్చుకొని బయటకు వెళ్ళాడు… ఫ్రెండ్స్ తో తిరిగి వచ్చాడు.. అప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసాడు.. త్వరలో పవి దగ్గరకు వెళ్తున్నా అని.. అది భార్య శిల్ప చూసింది.. కనీసం తనకు తన భర్త ఉంటే చాలు అనుకొని… ఆ మెసేజ్ గురించి అడిగించింది… అలాంటిది ఏమీ లేదు అంటూ చెప్పాడు అందరికీ… అందరూ వెళ్ళిపోయారు… ప్రాపర్టీ విషయం గా అందరితో కలిసి మాట్లాడాడు.. వెళ్లి పోయాడు… అంతే… శిల్ప ఫోన్ చేస్తే ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్నా అని చెప్పాడు… అంతే…. ఇక ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు… శిల్ప ఫోన్ చేస్తూనే ఉంది.. అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నారు.. చందు ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు… రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు…కట్ చేస్తే…

నాలుగు రోజుల తర్వాత..

సీన్ నెంబర్ – 5

ఎల్కేజీ చదువుతున్న చిన్న బాబు ఆడుకుంటున్నాడు ఇంట్లో… అమ్మా… అమ్మా… అనుకొంటూ తల్లి శిల్ప దగ్గరకి వచ్చాడు… తన చెయ్యి పట్టి లాగుతూ టీవీ దగ్గరకి తీసుకు వెళ్లి…. స్క్రీన్ వైపు చూపిస్తూ అన్నాడు… నాన్న… అమ్మా… నాన్న అదిగో అంటూ…. చందు నటించిన ఎపిసోడ్ టీవీ లో వస్తోంది…. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన కళ్ళలో కూడా చిన్న కన్నీటి తెర… బాబుని గుండెకి హత్తుకొంది… చందు ని చూడాలనిపిస్తోంది… అంతలోనే చందు పక్కన పవిత్ర…. విసురుగా వెళ్లి టీవీ కట్టేసింది శిల్ప…. అమ్మా.. నాన్న… నాన్న అంటూనే ఉన్నాడు బాబు…

విషాదాంతం అయిన ఈ ప్రేమ కథ లో తప్పెవరిది ఒప్పెవరిది అనేది చెప్పడం కష్టం.

  • తనకు పెళ్ళయి, ఇద్దరు పిల్లలు ఉండి, విడాకులు తీసుకున్న స్థితి లో చందు లో తనకు ఒక తోడు ను వెతుక్కున్న పవిత్ర ది తప్పు అంటామా…..
  • ప్రాణం గా ప్రేమించి పెళ్ళిచేసుకొని, ఇద్దరు పిల్లలను కన్న తర్వాత కూడా వారిని గాలికి వదిలేసి పవిత్ర లో కొత్త ప్రేమను వెతుక్కున్న చందు చేసింది తప్పు అంటామా….
  • పవిత్ర విడాకులు తీసుకొని స్వతంత్ర జీవితం గడుపుతోంది, ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి ఆమె వైపు వారికి ఆమె లేని లోటు తప్ప ఎటువంటి నష్టం కలగలేదు… చందు వైపు మాత్రం విద్వంసం…..  తన కంటే వయసులో చాలా చిన్నదైన భార్య, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, తల్లి, తండ్రి ఇంకా పెద్ద కుటుంబం.. స్నేహితులు  అందర్నీ దుఃఖ సాగరం లో ముంచి వెళ్ళిపోయాడు…
  • ఎవరిది తప్పో.. ఎవరిది ఒప్పో… ఎత్తి చూపించి మాటలతో, కామెంట్ల తో  కుళ్ళ బొడిచి మరీ చంపేయడానికి వారిద్దరూ ప్రాణాలతో లేరు..
  • ఒక్కోసారి అనిపిస్తుంది మనకి… ఆ రోజు షూటింగ్ లో చీర కొంగు పై స్పిరిట్ వేసి అంటించిన కుర్రాడు తన పని సరిగ్గా చేసి ఉంటే.. ఆమె స్పృహ కోల్పోయేది కాదు…చందు ఆమెను ఆ చెంప దెబ్బ కొట్టక పోయి ఉంటే… అంత కేరింగ్ గా ఉండక పోయి ఉంటే… చందు తో ప్రేమలో పడేది కాదు.. చందు ఇలా ప్రాణాలు తీసుకొనే వాడు కాదు కదా.. అని.. అనిపిస్తుంది…  కరిగిన కాలాన్ని వెనక్కి తీసుకు రాలేం…. ఫ్రెండ్స్…
  • ఈ ఉదంతాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్… వదిలేయండి ఇక…

(పవిత్ర జయరాం ప్రమాదం జరిగిన తర్వాత, చందు ఆత్మహత్య చేసుకున్న తర్వాత మీడియా లో , సోషల్ మీడియా లో వచ్చిన అనేక కధనాలు, వీడియోలు పరిశీలించిన తర్వాత ఆ వార్తల ఆధారం గా రాసిన write up మాత్రమే ఇది.. ఎవరినీ కించపరచాలని గాని, ఎవరి మనోభావాలను గాయ పరచాలని గాని రాసిన రచన కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ… ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తింటే క్షంతవ్యులం…)

-విజయ్ కుమార్ బోమిడి, ఎడిటర్, రియల్ స్టోరీస్, విజయ్ న్యూస్ తెలుగు,