January 10, 2025

Valentines Day Greetings 2U -ఆ దేవుడు చేసిన సంతకమే ఈ ప్రేమ

ఏడిస్తే కన్నీరొచ్చింది… నవ్వితే చిరునవ్వొచ్చింది… గాయమైతే రక్తం కారింది… అద్దం లో చూస్తే మనకో రూపం ఉంది… ఎండలోనికి వెళ్తే  నీడ కనిపించింది… ఊపిరి తీసుకొంటే చాతీ ఉప్పొంగింది… నా గుండె లోని నిన్ను చూస్తే మనసు  తియ్యగా మూలిగింది..

Valentines Day Greetings 2U

Valentines Day Greetings 2U (pexels)

Valentines Day Greetings 2U | ఆ దేవుడు చేసిన సంతకమే ఈ ప్రేమ – 

మనం  ప్రేమికులం (Valentines Day Greetings 2U)

మనది ప్రేమ కులం ..అవును  ప్రేమ అనే క్యాస్ట్ ….

మన క్యాస్ట్ కి రిజర్వేషన్ ఫలాలు అందుతాయో లేదో నాకైతే తెలీదు….

అలాగే ఫీజు రీ ఇంబర్స్ మెంట్, వసతి దీవెన వస్తాయో లేవో కూడా  తెలీదు…

చివరికి మనల్ని గుళ్ళోకి రానిస్తారో లేదో కూడా  తెలీదు…. ఎందుకంటే… మనది నిమ్న కులమో, అగ్ర కులమో నాకు తెలీదు…

ఏడిస్తే కన్నీరొచ్చింది… నవ్వితే చిరునవ్వొచ్చింది… గాయమైతే రక్తం కారింది… అద్దం లో చూస్తే మనకో రూపం ఉంది… ఎండలోనికి వెళ్తే  నీడ కనిపించింది… ఊపిరి తీసుకొంటే చాతీ ఉప్పొంగింది… నా గుండె లోని నిన్ను చూస్తే మనసు  తియ్యగా మూలిగింది..

ఇన్ని జరిగినా మనల్ని కనీసం మనుష్యులు గా  ఎవరూ గుర్తించ రెందుకు…?

ఒకరిని ఒకరు ప్రేమిస్తే ఈ ప్రపంచం మనోభావాలు ఎందుకు దెబ్బ తింటున్నాయి …?

విరామ సమయం లో దేవుడు కొంచం సేద తీరుతున్నపుడు … తన చుట్టూ ఉన్న పిల్లలకు పెట్టిన ఆటల పోటీల్లో నువ్వూ నేనూ విజేతలం…. అప్పుడు మనకు  దేవుడిచ్చిన బహుమతే “ప్రేమ”…. ఆయన పెట్టిన సంతకమే కదా ఈ “ప్రేమ”.. ఆయన పెదవులపై మెరిసిన కాంతి రేఖ కదా ఈ ప్రేమ….

ఫలానా క్షణం లో……  ఫలానా వాళ్ళ మధ్య  పుట్టాలని దేవుడే తన ‘టైం బుక్’ లో రాసి పెట్టాక …నువ్వు.. నేను ఈ లోకం … అంతా నిమిత్త మాత్రులం…

ఈ లోకం లో…. ప్రేమ విఫలమైన జంట ….. నదిలో దూకో… ఉరి పెట్టు కునో…. రైలు క్రింద పడో ప్రాణాలు  కోల్పోయాక .. ఆ సృష్టి కర్త కళ్ళు తప్పకుండా చెమ్మగిల్లుతాయి…. ఎందుకంటే….. ఆయనే ప్రాణ ప్రతిష్ట చేసి సృష్టించిన ప్రేమ కదా… గుండె కలుక్కు మంటుంది ఎవరికైనా….

ఈ భూ  గోళం పై … ..వర్షాలు సమృద్ధి గా కురుస్తున్నాయి… పంటలు బాగా పండుతున్నాయి….పిల్ల గాలులు అందర్నీ పలకరించి పోతున్నాయి…

పసి పిల్లలు నవ్వులు  పూస్తున్నారు… వృద్ధులు బోసి నవ్వులు రువ్వుతున్నారు…

ఋతు పవనాలు వీస్తున్నాయి… పారే నదులు సంగీత తరంగాలు అవుతున్నాయి..

ప్రకృతి ఒడి లో జీవం సేద తీరుతోంది… ప్రేమ పరవళ్ళు తొక్కుతోంది…  బహుశా … దేవుడు ఆశించింది ఇదే కావచ్చు… కానీ నాణానికి ఇది ఒక వైపే… మరొక వైపు అంతా… విద్వంసం….. ప్రేమ రాహిత్యం… మోడు బారిన జీవితాలు… ఇది కాదు ఆయన కోరుకున్నది…

నువ్వు త్వరగా రాకపోతే… ఇలాగే.. నేను ప్రపంచం చుట్టి వచ్చేస్తా… ఎందుకంటే.. ‘ఉచిత ప్రపంచ ప్రయాణా’నికి నాకు అర్హత ఉంది..

నువ్వు త్వరగా రాకపోతే.. ఇంతటి ఆనందం కనుమరుగై… నా ఆలోచనలు నన్ను గేలి చేసి చంపేస్తాయి…

నువ్వు వచ్చెయ్… త్వరగా… ఎంత వీలైతే అంత త్వరగా….

పెన్షన్ ప్రతి ఏటా పెంచుకుంటూ పోయినట్లు … నువ్వు నా టెన్షన్  పెంచుకుంటూ పోకు…

నువ్వు త్వరగా రా… గ్రామ సచివాలయానికి పోయి … క్యాస్ట్ సర్టిఫికేట్ కి మనం అర్జెంట్ గా అప్లయి చేసుకోవాలి…. ఆధారాలు అడిగితే దేవుడిచ్చిన బహుమతి ఉందిగా… అది చూపిద్దాం…

ఈ ప్రేమ విశ్వ విద్యాలయం లో మనమే స్టూడెంట్స్…. మనమే ఫ్యాకల్టీ… మనదే మానేజ్ మెంట్… పట్టా ఇచ్చేది మాత్రం దేవుడే…… ఆయన పెట్టిన సంతకమే కదా ఈ ప్రేమ… అన్నట్టు… మర్చిపోయా… ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు నీకు…Valentines Day Greetings 2U

(జ్ఞాపకాల నూతి గట్టు సంకలనం)

Valentines Day Greetings 2U
Valentines Day Greetings 2U (pexels)