YSRCP Manifesto 2024 ఎందుకు ఆలస్యం అవుతోంది అంటే | AP General Elections 2024
టీడీపీ, జనసేన కి తోడు ఇప్పుడు ఆ కూటమి లో బీజేపీ కూడా చేరింది. రాష్ట్రం లో బీజేపీ ని గంప గుత్త గా వ్యతిరేకించే కొన్ని వర్గాల ఓట్లను ఆకర్షించే విధం గా కొన్ని కొత్త అంశాలను చేర్చే ఆలోచన తోనే అద్దంకి సిద్ధం సభ లో మ్యానిఫెస్టో విడుదల చేయలేదని భావిస్తున్నారు. ఒకటి రెండు రోజులు ఆలస్యం అయినా అన్ని వర్గాలను ఆకట్టుకొనే విధంగా ప్రస్తుత మ్యానిఫెస్టో రూపొందిస్తున్నారని తెలుస్తోంది.
YSRCP Manifesto 2024 ఎందుకు ఆలస్యం అవుతోంది అంటే.. | AP Elections 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని రాజకీయ పక్షాలు అత్యంత ఆసక్తి గా ఎదురు చూస్తున్న అంశం వైసీపీ మానిఫెస్టో . గత ఎన్నికల్లో నవరత్నాలు అంటూ ముందుకు వచ్చి గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది వైసీపీ. అందుచేత ప్రస్తుత ఎన్నికల్లో ఎటువంటి హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రధాన ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం, జనసేన ఇప్పటికే సూపర్ సిక్స్ అంటూ తమ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజలలోనికి బలం గా తీసుకు వెళ్ళాయి. (YSRCP Manifesto 2024)
అద్దంకి సిద్ధం లో ప్రకటిస్తా అన్నారు….
నిజానికి అద్దంకి సిద్ధం సభలో మ్యానిఫెస్టో ప్రకటిస్తారని విజయ సాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. దీనితో సహజం గానే ప్రతిపక్షాలు అన్నీ మ్యానిఫెస్టో ప్రకటన గురించి ఎదురు చూసాయి. కాని జగన్ మోహన్ రెడ్డి మ్యానిఫెస్టో తర్వాత ప్రకటిస్తామని చెప్పడం తో అందరూ నిరాశ కు గురయ్యారు. పదేపదే ఇలా వాయిదా వేస్తున్నారంటే బాగా ఆచి తూచి అన్ని వర్గాలను ఆకట్టుకొనే వరాలు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.
కూటమి లో బీజేపీ చేరినందుకే నా …?
టీడీపీ, జనసేన కి తోడు ఇప్పుడు ఆ కూటమి లో బీజేపీ కూడా చేరింది. రాష్ట్రం లో బీజేపీ ని గంప గుత్త గా వ్యతిరేకించే కొన్ని వర్గాల ఓట్లను ఆకర్షించే విధం గా కొన్ని కొత్త అంశాలను చేర్చే ఆలోచన తోనే అద్దంకి సిద్ధం సభ లో మ్యానిఫెస్టో విడుదల చేయలేదని భావిస్తున్నారు. ఒకటి రెండు రోజులు ఆలస్యం అయినా అన్ని వర్గాలను ఆకట్టుకొనే విధంగా ప్రస్తుత మ్యానిఫెస్టో రూపొందిస్తున్నారని తెలుస్తోంది.
అందరికీ ఎందుకంత ఆసక్తి అంటే..(YSRCP Manifesto 2024)
వైసీపీ అధికారం చేపట్టిన దగ్గర నుండి మ్యానిఫెస్టో ను ఒక బైబిల్ గా, ఖురాన్ గా, ఒక భగవద్గీత గా భావిస్తున్నాం అని చెప్తూ హామీల అమలుకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వైసీపీ శ్రేణులు చెప్తున్న ప్రకారం ఇప్పటికే దాదాపు 98 శాతం వరకూ హామీల అమలు చేసినట్లే. కాబట్టి ఈ ఎన్నికలకు ఎటువంటి హామీలను ఇస్తున్నారో అని ఇటు ప్రజలు అటు రాజకీయ పక్షాలు తమ తమ అంచనాలు వేసుకుంటున్నారు. ( YSRCP Manifesto 2024)
గత మ్యానిఫెస్టో లోని అంశాలను అలాగే కొనసాగిస్తూ మరి కొన్ని కొత్త ప్రయోజనాలు కలిగించే యోచన లో వైసీపీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రకటించబోయే మ్యానిఫెస్టో లో కొత్తగా ఏ అంశాలపై దృష్టి పెట్టబోతున్నారో ఒక సారి పరిశీలిద్దాం.
రైతు రుణ మాఫీ (YSRCP Manifesto 2024)
రైతు భరోసా క్రింద ఇప్పటికే కొంత ఆర్దిక సాయం చేస్తున్నారు. ఈ సొమ్ము ను ఇంకా పెంచే అవకాశం ఉంది. దానితో పాటు రెండు లక్షలు, లేదా లక్ష లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయాలన్న ధృఢ సంకల్పం లో ఉన్నట్టు కనిపిస్తోంది జగన్ ప్రభుత్వం. ఎందుకంటే 2014 లో ఈ హామీ ఇవ్వని కారణం గా ఎంతగా నష్టపోయిందీ వైఎస్సార్ సీపీ కి బాగా తెలుసు. తప్పనిసరిగా రుణాల మాఫీ చెయ్యాలన్న అంశం పై తీవ్రం గా తర్జన భర్జన లు జరుగుతున్నాయి. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాలలో బీజీపీ రుణాల మాఫీ పై అంతగా ఆసక్తి లేదు. ప్రస్తుతం టీడీపీ జనసేన తో పొత్తులో ఉంది కాబట్టి ఈ కూటమి రుణాల మాఫీ ప్రకటించే అవకాశం చాలా తక్కువ. ఇటువంటి సందర్భం లో రుణ మాఫీ ప్రకటిస్తే కచ్చితం గా అది చాలా ఉపయోగ పడుతుందనేది జగన్ యోచన.
మహిళల ఉచిత బస్సు ప్రయాణం
కర్నాటక, తెలంగాణా రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా తమ కూటమి అధికారం లోనికి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ప్రకటిస్తుంది. ఈ అంశం లో జగన్ ప్రభుత్వం ఏ విధం గా స్పందిస్తుంది అన్నది అంతు చిక్కని ప్రశ్న గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆటో డ్రైవర్ల కు పదివేల రూపాయలు చొప్పున ఆర్దిక సహాయం చేస్తోంది ప్రభుత్వం.(YSRCP Manifesto 2024)
మహిళల ఉచిత ప్రయాణం వలన పై రెండు రాష్ట్రాలలో ఆటో డ్రైవర్లు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితి లో ఏపీ లో కూడా స్త్రీలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభిస్తామని వాగ్దానం చేసే సాహసం చేసే అవకాశం లేదు అనేది ఒక వాదన. తప్పదు అనుకొంటే సీనియర్ సిటిజన్ల కు, చదువుకొనే బాలికలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించవచ్చు. ఏదైనా చెయ్యాలి అనుకొంటే ఇదొక ఎన్నికల హామీ లా మాత్రమే కాకుండా ఇప్పటికే అమలు చేసి ఉండేవారు. అంటే ఈ అంశం లో జగన్ కు అంత ఆసక్తి లేదని భావించాల్సి ఉంది.
ఉచిత గ్యాస్ సిలిండర్లు
పథకాలన్నీ పేదవారికే ఉన్నాయి గానీ మధ్యతరగతి వారికి మొండి చెయ్యి చూపించారనే బాధ వీరికి ఎక్కువగా ఉంది. ఒక ప్రక్క నిత్యావసర వస్తువుల రేట్లు కూడా విపరీతం గా పెరిగి పోవడం తో మధ్య తరగతి వారి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి లో పడినట్లు అయింది. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణం లో ఉచితం గా లేదా తక్కువ ధరకు ఒక్కొక్కరికీ సంవత్సరానికి మూడు సిలిండర్లు అందించాలని ఆలోచిస్తున్నారు. ఈ పథకం తప్పకుండా మధ్య తరగతి మహిళలను సంతృప్తి పరచే పథకం అవుతుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు.
వృద్ధుల పెన్షన్లు :
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో అత్యంత జనాదరణ పొందిన పథకాలలో పెన్షన్ల పథకం ఒకటి. ఒకటో తారీఖునే ఇంటివద్దకే వాలంటీర్ల ను పంపి పెన్షన్ పంపిణీ చేయడం అనేది ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకు వచ్చింది. ప్రస్తుతం మూడు వేల రూపాయలు చొప్పున నెలకు ఇస్తున్నారు. పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని ఇప్పటికే టీడీపీ కూటమి ముందుకు వస్తున్న నేఫద్యం లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
వెంటనే నాలుగు వేల రూపాయలు పెంచడం ఒక ఎత్తు అయితే, ఇంతకు ముందు లా సంవత్సరానికి 500 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోవడం మరొక ఎత్తు. ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడవలసిందే. పెన్షన్ పెంచుతాం అంటూ దెందులూరు సిద్ధం సభ లో జగన్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు కాబట్టి పెన్షన్ పెరగడం తధ్యం.
అమ్మ ఒడి పథకం
జగన్ ప్రభుత్వానికే ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకు వచ్చిన పథకం అమ్మ ఒడి. ప్రస్తుతం ఇస్తున్న మొత్తం 15 వేల రూపాయలను 20 వేల రూపాయలకు పెంచే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ కూటమి అదే మొత్తాన్ని ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తాం అంటూ ఇప్పటికే ప్రకటించింది. చాలా కీలకమైన అంశం కాబట్టి ఇద్దరు పిల్లలకు ఈ పథకం వర్తింప జేస్తే బాగుంటుంది అనేది జగన్ పార్టీలోని పరిశీలకుల మాట. (YSRCP Manifesto 2024)
ఇదే విధం గా చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, డ్వాక్రా రుణాలు వంటి ఇతర కీలక పథకాలలో ఏవైనా మార్పులు చేస్తారేమో వేచి చూడవలసిందే.
దాదాపు 130 సార్లు మీకోసం బటన్ నొక్కాను కాబట్టి మీరు నాకోసం 2 సార్లు బటన్ నొక్కండి అని ముఖ్యమంత్రి ఓటర్లను అడుగుతున్నారు. ఈ ఐదేళ్ళ పాటు తమకు సక్రమం గా పథకాలు అందాయి అనే నమ్మకం ఉంటే మరొక సారి ఓట్లు వేసి గెలిపిస్తారు. లేదు ప్రతిపక్షాల హామీలు బాగుంటే వారు ఆ హామీలను తప్పకుండా అమలు చేస్తారన్న నమ్మకం ఉంటే టీడీపీ కూటమి గెలుస్తుంది.(YSRCP Manifesto 2024)
ప్రజలకు జ్ఞాపక శక్తి ఎక్కువే…
ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటరు ఇప్పటికే ఒక అంచనా కి వచ్చి ఉంటాడు కాబట్టి రాజకీయ పక్షాలు చేసే జిమ్మిక్కులు ఎవరినీ ప్రభావితం చెయ్యవు అన్నది అక్షర సత్యం. ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువ అనే ఉద్దేశ్యం తో ఎడా పెడా వాగ్దానాలు చేసి తీరా అధికారం లోనికి వచ్చాకా వాటిని పూర్తిగా విస్మరిస్తే ఏమౌతుందో 2019 ఎన్నికలలో చూసాం. ఎవరన్నారు ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువ అని… అదేంటో గాని ఓటు వేసే క్షణానికి గత ఐదేళ్ళ రివైండ్ కళ్ళ ముందు ప్రత్యక్షమై మార్గాన్ని నిర్దేశిస్తుంది.. బటన్ నొక్కేస్తారు .. అంతే…
– ఎడిటర్, విజయ్ న్యూస్ తెలుగు